Road Safety Course : కొత్త బైక్ కొనేవాళ్లకు బిగ్‌షాక్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు..
Road Safety Course : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రవాణా శాఖ.. వాహనాలు కొనుగోలు చేసే దశలోనూ ఈ శిక్షణను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది.
Road Safety Course : కొత్త బైక్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కొత్త బైక్ కొనుగోలు చేయాలంటే ఇకపై రోడ్డు భద్రతపై ఆన్లైన్ కోర్సు పూర్తి చేయాల్సి రావొచ్చు.
ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రవాణా శాఖ.. వాహనాలు కొనుగోలు చేసే దశలోనూ ఈ శిక్షణను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది.
సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఉండేలా ఈ కోర్సును రూపొందిస్తోంది. దీన్ని పూర్తి చేశాకే కొత్త బైక్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చే విధానాన్ని తీసుకురావడంపై కేంద్ర రోడ్లు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానంలో భాగంగా ఈ అంశాన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కోర్సు పూర్తి చేసిన తర్వాతే ద్విచక్ర వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ కల్పించే విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
కోర్సులో ఏయే అంశాలు ఉంటాయి?
ఈ ఆన్లైన్ శిక్షణలో హెల్మెట్ ధరించడం, వాహన వేగాన్ని నియంత్రించడం, రాంగ్ రూట్లో ప్రయాణించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నిబంధనలు పాటించడం, ప్రమాదాలను నివారించే పద్ధతులపైనా శిక్షణ ఇవ్వనున్నారు. ద్విచక్ర వాహనంపై మహిళలు ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలను బైక్‌పై తీసుకెళ్లే సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
లైసెన్స్ రెన్యువల్ చేసుకునేవారికీ వర్తిస్తుందా?
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి రెన్యువల్ చేసుకునేవారు కూడా రోడ్డు భద్రతపై ఆన్లైన్ మాడ్యూల్‌ను పూర్తి చేసేలా చూడాలని కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సూచించినట్లు సూచించింది. అయితే, తెలంగాణ రవాణాశాఖ ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్సు రూపకల్పన తుది దశలో ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
