US Midterm Elections 2026 : ట్రంప్ పార్టీకి షాక్.. భారతీయులకు ఊరట కలుగుతుందా? వీసా ఆంక్షలు తగ్గుతాయా?
US Midterm Elections 2026 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే భారత్‌కు లాభమా? భారతీయుల హెచ్1బీ వీసాలు, ఐటీ ఉద్యోగాలు, వాణిజ్య ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- November 5, 2026 / 07:08 PM IST
US Midterm Elections 2026
- అమెరికాలో డెమొక్రాట్ల హవా..
- భారతీయులకు బెనిఫిట్స్ ఇవేనా?
- అమెరికా మధ్యంతర ఎన్నికలు..
- వీసాలు, ఉద్యోగాలు, వాణిజ్యంపై ప్రభావం ఎంత?
US Midterm Elections 2026 : అమెరికా రాజకీయాల్లో మధ్యంతర ఎన్నికలు కీలక మలుపుగా మారనున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలి, డెమొక్రాట్లు కాంగ్రెస్‌లో పట్టు సాధిస్తే.. అమెరికా విధానాల్లో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌పై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? భారతీయులకు వీసాల విషయంలో ఊరట లభిస్తుందా? అనే చర్చ మొదలైంది..
ట్రంప్‌కు రాజకీయంగా ఇబ్బందులేనా? :
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలంలో రెండేళ్లు పూర్తయ్యాక జరుగుతాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలతోపాటు సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం మెజార్టీ సాధిస్తే.. అధ్యక్షుడు పదవిలో కొనసాగినప్పటికీ, కీలక నిర్ణయాలకు కాంగ్రెస్ మద్దతు పొందడం కష్టమవుతుంది. కొత్త చట్టాలు, బడ్జెట్, ప్రభుత్వ ఖర్చులకు ప్రతిపక్షం అడ్డుపడవచ్చు. దీంతో ట్రంప్ తన నిర్ణయాలను అమలు చేసేందుకు మరిన్ని రాజకీయ సవాళ్లు ఎదుర్కొక తప్పదు..
విదేశాంగ విధానంలో దూకుడు పెరుగుతుందా? :
దేశీయంగా రాజకీయ ఒత్తిడి పెరిగినప్పుడు విదేశీ వ్యవహారాలపై దృష్టి మళ్లించే ప్రయత్నం అధ్యక్షులు చేయవచ్చు. అయితే, ఇది తప్పనిసరిగా జరిగే పరిణామం కాదు.. యుద్ధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, సైనిక చర్యల విషయంలో కాంగ్రెస్ పాత్ర కూడా కీలకమే. ముఖ్యంగా యుద్ధ వ్యయాలకు నిధుల విషయంలో ప్రతిపక్షం అడ్డుపడితే ట్రంప్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు..
భారత్‌కు కలిసొచ్చే అంశాలివే :
ఈ పరిణామాలు భారతీయులకు కొంత రిలీఫ్ అందించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హెచ్1బీ వీసాలు, ఉద్యోగ ఆధారిత వలస విధానాలపై అమెరికాలో చర్చ పెరిగితే భారత ఐటీ నిపుణులకు భారీ బెనిఫిట్ ఉండొచ్చు.. వీసా నిబంధనలపై సమీక్షకు కూడా ఛాన్స్ ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిక్యం వచ్చినంత మాత్రాన వీసా ఆంక్షలు వెంటనే తొలగిపోతాయని చెప్పలేం..
మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ మార్పులు రావచ్చు. చర్చలకు కొత్త దారి తెరుచుకున్నా, ఒప్పందం ఆలస్యమయ్యే అవకాశమూ లేకపోలేదు.. ఇక భారత్‌పై ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు మాత్రం వెంటనే తగ్గే అవకాశం లేదు..
ఎందుకంటే.. వాణిజ్య విధానాల విషయంలో అమెరికా అధ్యక్షుడికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. మొత్తానికి అమెరికా రాజకీయాల్లో మార్పులు వస్తే.. భారత్‌కు కొన్ని అవకాశాలు, మరికొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. ముఖ్యంగా వీసాలు, ఐటీ ఉద్యోగాలు, వాణిజ్య సంబంధాల విషయంలో ట్రంప్ తదుపరి అడుగులే కీలకం కానున్నాయి..
