US – Iran War : ఆగని యుద్ధం.. లారక్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం.. ఇరాన్ సీరియస్ వార్నింగ్!.. హోర్ముజ్‌లో హైటెన్షన్..
US - Iran War : అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్రమవుతోంది. ఇరాన్ భూభాగంలోని లారక్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడి చేసింది.
- Harish Thanniru
- Published on- August 31, 2026 / 08:05 AM IST
US Iran War
US – Iran War : అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్రమవుతోంది. ఇరాన్ భూభాగంలోని లారక్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడి చేసింది. హోర్ముజ్ జలసంధి పరిధిలోఉన్న ఈ ద్వీపంలోని రెండు ఇరాన్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థలను అమెరికా బలగాలు ధ్వంసం చేసినట్లు ఓ అమెరికా అధికారి వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిలో కొత్తగా సముద్రపు మైన్లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతవారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాజా దాడి జరగడం గమనార్హం.
Also Read : Cyprus Boat Accedent: సైప్రస్ తీరంలో ఘోర ప్రమాదం.. 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా.. ఆరుగురు దుర్మరణం
అమెరికా అధికారుల వివరాల ప్రకారం.. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు రాకెట్ లాంచర్లను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా గుర్తించింది. దీంతో ఆదివారం లారక్ ద్వీపంలోని రెండు లాంచర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. లారక్ ద్వీపం హోర్ముజ్ ద్వీపానికి దక్షిణంగా, ఖేష్మ్ ద్వీపానికి తూర్పున ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయ దిశలో సుమారు 1,100 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో లారక్ ద్వీపానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది.
ఇదిలాఉంటే.. అమెరికా బలగాల దాడుల తరువాత ఇరాన్ సైతం ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. అమెరికా దాడుల్లో పలువురు సైనికులు, పౌరులు పలువురు మరణించగా.. పలువురు గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని ఐఆర్జీసీ హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హర్మూజ్ జలసంధిపై అమెరికా క్రమంగా పట్టు పెంచుకుంటుంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభంకాగానే హర్మూజ్ జలసంధిని తన నియంత్రణలోకి తెచ్చుకున్న ఇరాన్.. దానిలోని అంతర్జాతీయ నౌకా మార్గాల్లో సీమైన్స్ ను ఏర్పాటు చేసింది. దీంతో ఇరాన్ చెప్పిన మార్గంలో ఇతర మార్గాల్లో వెళ్లిన పలు నౌకలు వాటిని ఢీకొని పేలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా బలగాలు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి.. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఏర్పాటు చేసిన సీమైన్స్ ను తొలగించాయి. దీంతో హర్మూజ్ పై అక్రమంగా అమెరికా పట్టు పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇరాన్ భూభాగంలోని లారక్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడి చేసింది.
మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. తమ అసలు శత్రువును గుర్తించి, వారి ప్రణాళికలను అర్థం చేసుకుని ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ఇదిలాఉంటే.. అమెరికా–ఇరాన్ యుద్ధం ఇప్పటికే ఆరో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో లారక్ ద్వీపంపై తాజా దాడి.. మధ్యప్రాచ్యంలో మరింత తీవ్ర సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
