US National Debt : వామ్మో.. అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు..! సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ముప్పు తప్పదా?
US National Debt : ప్రతీ ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అమెరికా అప్పు పెరుగుతుండటం భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది.
- Harish Thanniru
- Published on- August 28, 2026 / 07:59 AM IST
US National Debt
US National Debt : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఇప్పుడు భారీ రుణభారంతో సతమతమవుతోంది. అమెరికా జాతీయ రుణం తొలిసారిగా 40ట్రిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసింది. ఇక్కడ ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే? ప్రతీనెలా అప్పుల భారం భారీగా పెరుగుతోంది.
Also Read : AP Politics : కేంద్ర కేబినెట్‌లో ఏపీకి మరో బెర్త్..? ఆ ముగ్గురిలో కేంద్రమంత్రి అయ్యేదెవరు.?
గత ఏడాది అక్టోబర్ నెలలో అమెరికా అప్పుల భారం 38 ట్రిలియన్ డాలర్లు ఉండగా.. ఐదు నెలల క్రితం 39 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం అది మరింత పెరిగింది. ట్రెజరీ డేటా ప్రకారం.. ఆగస్టు 18వ తేదీ నాటికి అమెరికా మొత్తం రుణం సుమారు 40.05 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రతీ ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అప్పు పెరగడం ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది.
40ట్రిలియన్ డాలర్ల రుణం అంటే అమెరికా వెంటనే దివాలా తీస్తుందని అర్ధంకాదు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన రిజర్వ్ కరెన్సీ అయిన డాలర్.. భారీ మూలధన మార్కెట్లు, ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకం వంటి బలాలు అమెరికాకు ఉన్నాయి. అమెరికాకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ, ఈ రుణభారాన్ని కంట్రోల్ చేయకుంటే రాబోయే రోజుల్లో అగ్రరాజ్యం పెనుసవాళ్లను ఎదుర్కోవటం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుణం విషయంలో ప్రస్తుత విధానమే మరికొన్నేళ్లు కొనసాగితే మాత్రం భవిష్యత్తులో అమెరికా ఆర్థిక విధానాలపై ఒత్తిడిని పెంచుతుంది.
అమెరికా రుణం ఇలానే పెరుగుతూపోతే సామాన్యులపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేటు పెరిగితే దాని ప్రభావం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. హోమ్ లోన్లు, కార్ లోన్లు, క్రెడిట్ కార్డులు, కంపెనీల రుణ వ్యయాలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. మౌలిక వసతులు, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, రక్షణ రంగం, భవిష్యత్ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే రంగాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. భవిష్యత్తులో ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే “ఫిస్కల్ ఫ్రీడమ్” తగ్గిపోవచ్చునని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమస్యను పరిష్కరించేందుకు అమెరికా ట్రెజరీ దృష్టిసారించింది. బాండ్ల బైబ్యాక్‌ల ద్వారా మార్కెట్‌లో దీర్ఘకాలిక బాండ్లపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇవి రుణ నిర్వహణను మెరుగుపరిచినా.. బడ్జెట్ లోటు అనే అసలు సమస్యను పరిష్కరించలేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిర్మాణాత్మక లోటును తగ్గించాలంటే ఖర్చుల నియంత్రళణ, ఆదాయాల పెంపు, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ.. ప్రభుత్వ వ్యయాలను నియంత్రిస్తూ అవసరమైన చోట ఆదాయాలను పెంచేలా ద్వైపాక్షిక ఆర్థిక సంస్కరణలు చేపట్టడం అమెరికాకు ప్రస్తుతం కీలకంగా మారింది.
