Trump Russia Sanctions Bill : రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం.. భారత్, చైనాకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన ట్రంప్..

Trump Russia Sanctions Bill : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరిన్ని ఆంక్షలకు సంబంధించిన కీలక బిల్లును చట్టంగా మార్చారు.

US President Donald Trump Signs Russia Sanctions Bill

Trump Russia Sanctions Bill : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరిన్ని ఆంక్షలకు సంబంధించిన కీలక బిల్లును చట్టంగా మార్చారు. దీనిపై ట్రంప్ సంతకం చేయడంతో రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం అమెరికాకు లభించింది. దీంతో రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాపై మరోసారి టారిఫ్ ముప్పు ఏర్పడింది.

Also Read : AP Rains : దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ..

‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026’ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు బుధవారం సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గత నెలలోనే సెనెట్‌ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దీంతో భారత్, చైనా సహా 10దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు రష్యా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఈ చట్టం కల్పిస్తోంది.

అమెరికా హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ప్రకారం.. రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 500శాతం వరకు టారిఫ్‌లు విధించే నిబంధనలు చట్టంలో ఉన్నాయి. అదే సమయంలో రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాలపై నేరుగా కాకుండా, వాటి నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై కూడా టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ చట్టం కల్పిస్తోంది.

రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. దీంతో ఈ కొత్త చట్టం భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఒక కీలక విషయం గమనించాలి. భారత్‌పై 100శాతం టారిఫ్ వెంటనే అమల్లోకి వచ్చినట్లు కాదు. ట్రంప్ తనకు లభించిన అధికారాన్ని ఉపయోగించి అలాంటి టారిఫ్ విధించాలని నిర్ణయించాల్సి ఉంటుంది. బిల్లుకు సంబంధించిన చర్చల్లో భారత్, చైనా, యూఏఈ, టర్కియే, సింగపూర్, అజర్‌బైజాన్, కజకిస్థాన్ తదితర దేశాల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే, ఆ దేశాలపై ఆటోమేటిక్‌గా 100 శాతం సుంకం అమలవుతుందని దీని అర్థం కాదు.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గతంలో భారత్‌పై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించింది. రష్యా క్రూడ్‌పై భారత్ తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అనంతరం 2026 ఫిబ్రవరిలో అదనపు టారిఫ్‌లను తొలగించగా, భారత్‌పై వర్తించే పరస్పర టారిఫ్‌ను 18శాతానికి తగ్గించారు.

ఇప్పుడు రష్యా ఆంక్షల చట్టం కారణంగా మరోసారి భారత ఎగుమతులపై టారిఫ్ ముప్పు తెరపైకి వచ్చింది.

అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదించిన వెంటనే భారత విదేశాంగ శాఖ స్పందించింది. దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని పేర్కొంది. రష్యా చమురు దిగుమతుల అంశంపై గత కొన్ని నెలలుగా అమెరికా అధికారులతో ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కూడా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ అంశం భారత్-అమెరికా సంబంధాలతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై చూపే ప్రభావాన్ని కూడా అమెరికా ప్రతినిధులకు వివరించినట్లు తెలిపింది.