firing In USA : మసాజ్ పార్లర్, స్పాల వద్ద కాల్పులు..8 మంది మృతి
- nagamani
- Published On : March 17, 2021 / 12:17 PM IST
Usa 8 People Killed In Atlanta Area Massage Parlor Firing
firing In USA : అమెరికాలో గన్ కల్చర్ ఏమాత్రం తగ్గటంలేదు. ఈక్రమంలో అట్లాంటాలో కాల్పుల కలకలం సృష్టించారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అట్లాంటాలోని రెండు స్పాల వద్ద, ఓ మసాజ్ సెంటర్ దగ్గర ఓ వ్యక్తి చోరీలకు పాల్పడడానికి యత్నించాడు. వీటిని అడ్డుకోవటానికి యత్నించటంతో సదరు వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. 2021 మార్చి 16 రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆసియాకు చెందిన ఆరుగురు, మరో ఇద్దరు శ్వేత జాతీయులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.
అట్లాంటా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత రాత్రి ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి అట్లాంటాలోని మసాజ్ పార్లర్, స్పాల్లో గత రాత్రి చోరీలకు పాల్పడడానికి నిందితుడు రాబర్ట్ ఆరోన్ లాంగ్ ప్రయత్నించాడు.
దీంతో ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని గుర్తించి, అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడున్న వారిపై రాబర్ట్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.
అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉన్నారు. మొదట అతడు రెండు స్పాల వద్ద, అనంతరం ఓ మసాజ్ సెంటర్ దగ్గర కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. కాగా కాల్పులు జరిపిన వ్యక్తి పేరు రాబర్ట్ ఆరోన్ లాంగ్ అనే 21 ఏళ్ల యువకుడిగా తెలుస్తోంది.
