Venezuela Earthquake : వెనెజువెలా భూకంప విలయం.. కుమార్తెను కాపాడి ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాలర్ భార్య.. నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్టు
Venezuela Earthquake : వెనెజువెలా భూకంపం కారణంగా ఆ దేశ ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య ఆడ్రియా ప్రాణాలు కోల్పోయింది. ఏడాది వయసున్న కుమార్తెను కాపాడుకునే క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని చనిపోయింది.
- Harish Thanniru
- Updated on- June 28, 2026 / 12:06 PM IST
Venezuelan Earthquake Footballer Hector Bello wife dead
Venezuela Earthquake : వెనెజువెలా భూకంపం వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే, ఈ భయానక విపత్తు సమయంలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను కాపాడి.. తల్లి ప్రేమ ఎంతగొప్పదో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినా.. తన ఏడాది కుమార్తెను మాత్రం గుండెలకు హత్తుకొని చివరి శ్వాస వరకు కాపాడింది.. భవనం శిథిలాల తొలగింపు సమయంలో ఆమెను చనిపోయినట్లు గుర్తించి బయటకు తీస్తుండగా.. ఆమె ఒడిలో ఏడాది పాపను గుర్తించిన సహాయక సిబ్బంది.. ఆ పాపను బయటకు తీయగా ప్రాణాలతో సురక్షితంగా ఉంది.. తల్లి మాత్రం మరణించింది.. ఆమె ఎవరో కాదు.. వెనెజువెలా ప్రముఖ ఫుల్‌బాలర్ హెక్టర్ బెల్లో సతీమణి. ప్రాణాలతో బయటపడిన బిడ్డ వారి కుమార్తె. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ హెక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
వెనెజువెలాలో భూకంపం విలయం సృష్టించింది. వరుసగా వచ్చిన రెండు భూ ప్రకంపనలతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.. వేలాది మంది ప్రజలు భవన శిథిలాల కింద సమాధులయ్యారు. ఈ భూకంపం సృష్టించిన విలయానికి 1500 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 3వేల మందికిపైగా గాయపడ్డారు. 69వేల మంది ఆచూకీ ఇంకా లభించలేదు. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ గుట్టలుగుట్టలుగా శవాలు బయటకొస్తున్నాయి. ఇదేసమయంలో కొంతమంది కొనఊపిరితో శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. అయితే, భూకంపం సృష్టించిన విలయానికి వెనెజువెలా ఫుట్ బాలర్ తన భార్యను కోల్పోయాడు.. ప్రస్తుతం అతను పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
వెనెజువెలా భూకంపం కారణంగా ఆ దేశ ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య ఆడ్రియా ప్రాణాలు కోల్పోయింది. ఏడాది వయసున్న కుమార్తెను కాపాడుకునే క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని చనిపోయింది. అయితే, తల్లిప్రేమను చాటుతూ తన ఒడిలో భద్రంగా దాచుకున్న కూతురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. తన భార్య మరణం విషయాన్ని ఆమె భర్త, ఫుట్ బాల్ ప్లేయర్ హెక్టర్ బెల్లో విషణ్ణవదనంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం అందరి హృదయాలను కలిచివేసింది.
తమ బిడ్డను కాపాడి, భార్య శిథిలాల కింద బలైందని హెక్టర్ బెల్లో భావోద్వేగానికి గురయ్యాడు. తన ఏడాది కుమార్తె ఆలనాను కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోయిందని రాసుకొచ్చారు. ‘అమ్మ చనిపోయిందన్న విషయం నా కూతురుకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా భార్య ప్రాణాలకు తెగించి కాపాడిన నా బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటాను. తల్లి వీరత్వాన్ని ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు చేశారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు కన్నీటి పర్యాంతమవుతూ.. ఆ అమ్మ దీవెనెలు ఆ బిడ్డకు ఎప్పుడూ ఉంటాయంటూ మాతృప్రేమను కొనియాడుతున్నారు.
వెనెజువెలాకు చెందిన హెక్టర్ బెల్లో మార్టియో లా గ్వాయిర్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. అయితే, జూన్ 24న భూకంపం సంభవించిన సమయంలో హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా తన బిడ్డతో కలిసి ఇంట్లోనే ఉంది. భూకంపం ధాటికి ఆ భవనం నేలమట్టం కావడంతో ఆమె భనవం శిథిలాల కింద చిక్కుకొని చనిపోయింది. అయితే, తాను చనిపోతూ ఏడాది వయస్సు కలిగిన తన బిడ్డను కాపాడింది. కుమార్తెను తన పొత్తిళ్లలో భద్రంగా దాచుకొని రక్షించింది. సహాయక చర్యల్లో భాగంగా ఆండ్రియా మృతదేహాన్ని శిథిలాల కింద నుంచి తీస్తున్న క్రమంలో పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆండ్రియా మృతదేహాన్ని బయటకు తీసి చూడగా ఆమె చేతుల్లో తన బిడ్డ అలానా మృత్యుంజయురాలిగా ఉంది. దీంతో ఆ విషయాన్ని హెక్టర్‌కు తెలియజేయగా.. ఆయన ఘటన స్థలికి చేరుకొని భార్య మృతదేహాన్ని గట్టిగా పట్టుకొని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ దృశ్యం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది.
