Tarique Rahman: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బంగ్లా మాజీ ప్రధాని, దివంగత నాయకురాలు ఖలేదా జియా కుమారుడు, ఆ దేశ రాజకీయాల్లో ఒకప్పుడు “డార్క్ ప్రిన్స్”గా గుర్తింపు పొందిన తారిక్ రహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత తారిక్ రహమాన్ బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఆయన బంగ్లాకు వచ్చారు. ఆయన ఇన్నాళ్లు బంగ్లాలో లేకపోయిప్పటికీ ఆ దేశమంతటా బీఎన్‌పీ పోస్టర్లపై ఆయన ఫొటోలు కనపడ్డాయి. ర్యాలీల్లోనూ ఆయన ఆడియో సందేశాలు వినిపించాయి.
ఆందోళనల వల్ల బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం, ఆమె ఇండియాలో ఉంటుండడం వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. హింసతో కుదేలైన బంగ్లాదేశ్‌కు తారిక్ రహమాన్ తిరిగి రావడం కీలక ఘట్టం. చాలా మంది విశ్లేషకులు భారత్ ప్రాంతీయ భద్రతకు కూడా ఇది కీలకమని చెబుతున్నారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్లాక ఆ దేశ మధ్యంతర ప్రధానిగా మహమ్మద్ యూనస్ కొనసాగారు. అప్పటినుంచి ఇప్పటివరకు బంగ్లాలో తీవ్రవాద ఇస్లామిస్టులు రెచ్చిపోతున్నాయి. భారత్‌పై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమాత్ ఏ ఇస్లామీ తీరు ఆందోళనకరంగా ఉంది. అది పాక్ ఐఎస్ఐకు అనుబంధంగా పనిచేస్తోందన్న వాదనలు ఉన్నాయి.
బీఎన్‌పీపై భారత్ ఉద్దేశం ఏంటి?
బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలిచిన బీఎన్‌పీని భారతదేశం ఉదారవాద, ప్రజాస్వామ్య పార్టీగా ముందునుంచీ చూస్తోంది. అలాగే, భారత్ అనుకూల అవామీ లీగ్ పార్టీ సభ్యులను కూడా బీఎన్‌పీ తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు అదే బీఎన్‌పీ తారిక్ రహమాన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
యూనస్ పాలన ఇక ముగియనుండడంతో బంగ్లాలో మళ్లీ భారత అనుకూల ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు వస్తుందని భారత విశ్లేషకులు ఆశిస్తున్నారు. యూనస్ మధ్యంతర సర్కారుతో రహమాన్‌కు భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి.
రహమాన్ ఎవరు?
బంగ్లాదేశ్‌లో 2024 జూలైలో జరిగిన హింసాత్మక ఆందోళనల వేళ నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. అసలు రహమాన్ తిరిగి అధికారంలోకి రావడం ఓ నాటకీయ పరిణామంగా జరిగింది.
మాజీ ప్రధాని ఖలేదా జియా పుత్రుడిగా రహమాన్‌కు రాజకీయ వారసత్వం ఉంది. అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టు తర్వాత 2017లో దేశం విడిచారు. విమర్శకులు ఆయనను “డార్క్ ప్రిన్స్” అని పిలుస్తారు. 17 సంవత్సరాలు విదేశాల్లో గడిపి 2025 డిసెంబరులో బంగ్లాకే తిరిగి వచ్చారు.
“బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం నా వద్ద ప్రణాళిక ఉంది” అంటూ బీఎన్‌పీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ప్రణాళిక ఎలా అమలవుతుందని ఇప్పుడు భారత్, దక్షిణాసియా దేశాలు, అమెరికా ఎదురుచూస్తున్నాయి.
మోదీ స్పందన
చైనా, పాకిస్థాన్ కంటే ముందుగానే భారత్ రహమాన్ గెలుపుపై స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, రహమాన్, బీఎన్‌పీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందని చెప్పారు. “ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్” నిర్మాణంలో భారత్ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
బంగ్లాతో సత్సంబంధాలు సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత కూడా కీలకం. అక్రమ వలసలు, దేశీయ రాజకీయాలపై ప్రభావం, హిందూ వ్యతిరేక ఘటనలు ఇవన్నీ ఆందోళనకర అంశాలు. వాణిజ్యం కూడా ముఖ్యమైన అంశమే. బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు అవసరమైన పత్తిలో 80 శాతం భారత్ సరఫరా చేస్తోంది.
హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్-బంగ్లా సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. బీఎన్‌పీ అధికారంలో ఉంటే భారత్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి వేచి చూడాల్సిన దశలో ఉంది. బీఎన్‌పీ స్పష్టమైన మెజారిటీ వైపు సాగుతోంది. ఇస్లామిక్ సంస్థ జమాత్-ఎ-ఇస్లామీ ఆ కూటమిలో లేకపోవడం భారత్‌కు ఉపశమనం కలిగించే అంశం.