ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ : ఖరీదు రూ.222 కోట్లు..!

  • Publish Date - November 13, 2019 / 04:53 AM IST

ఒక వాచ్ ఖరీదు ఎంతుంటుంది? మహా అయితే రూ.లక్షల్లో ఉంటుంది. పోనీ ధనవంతులైతే వజ్రాలతో చేయించుకున్న వాచ్ అయితే ఇంకా కొంచెం ఖరీదు ఉంటుంది. కానీ ఓ వాచ్ ఖరీదు ఏకంగా లక్షలు కాదు కోట్లల్లో పలికింది. ఈ వాచ్ ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తయారుచేసే సంస్థల్లో ఒకటైన పాటక్ ఫిలిప్పీ తయారుచేసింది. 

పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ చిమ్ రెఫ్. 6300A-010 అనే అరుదైన చేతి గడియారాన్ని క్రిస్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల జెనీవాలో వేలం వేసింది. ఈ వాచ్ ను దక్కించుకోవటానికి ధనవంతులంతా పాల్గొన్నారు. కానీ వేలంపాటలో ఓ వ్యక్తి రూ.222 కోట్లతో ఈ వాచీని దక్కించుకున్నారు. ఊహించిన ధరకంటే ఈ వాచీ పన్నెండు రెట్లు ఎక్కువ ధర పలికిందని నిర్వాహకులు తెలిపారు. వేలంలో ఒక చేతి గడియారం ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని తెలిపారు. 

ఈ మోడల్‌లో సదరు సంస్థ ఒక్క వాచీనే తయారు చేసింది. ఈ విషయాన్ని డయల్ పైనే ద ఓన్లీ వన్ అని కూడా రాశారు. ఈ వాచ్ లో మరో ప్రత్యేకత ఏంటంటే.. 18 క్యారెట్ల బంగారంతో వాచీ డయల్‌ను రూపొందించినీ ఈ వాచ్ డయల్‌ను బ్లాక్, లైట్ పింక్ కలర్ లలోకి మార్చుకోవచ్చు.అంతేకాదు.. 20 రకాల ఫీచర్లతో ఈ వాచీ పనిచేస్తుందని తయారీదారులు తెలిపారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును కండర బలహీనతతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి ఖర్చు చేయనున్నట్లు క్రిస్టీస్ సంస్థ తెలిపింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వాచ్ అమ్మకంలో క్రిస్టీన్ స్వచ్ఛంధ సంస్థ పెద్ద మనస్సును చాటుతోంది.