SSC CGL 2025 Vacancies: ఎస్సెస్సీ సీజీఎల్‌లో 15,130 ఉద్యోగాలు.. ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్ అప్లికేషన్ విండో ఒపెన్.. ఈ తప్పులు చేస్తే మెరిట్ ఉన్న జాబ్ రాదు..!
SSC CGL 2025 Vacancies : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ పోస్టుల తుది జాబితా వచ్చింది. మొత్తం 15,130 పోస్టులను భర్తీ చేయనున్నారు.
- Dharani Pilli
- Published On : March 10, 2026 / 08:17 AM IST
SSC CGL 2025 Vacancies Increased to 15130 Option Cum Preference window open on march 9 available for 12th
SSC CGL 2025 Vacancies : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసే వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో పలు ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) సీజీఎల్ (కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. గ్రూప్ బీ, గ్రూప్ సీ కింద వచ్చే పోస్టులైన ఆడిటర్, అకౌంటెంట్, టాక్స్ అసిస్టెంట్, ఎస్ఐ, ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా ఎస్ఎస్‌సీ సీజీఎల్ పోస్టుల తుది జాబితాను విడుదల చేశారు.
మొత్తం 15,130 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్ అప్లికేషన్ తేదీలను, విధానాన్ని కూడా ఎస్ఎస్‌సీ జారీ చేసింది. ఈ మొత్తం పోస్టుల్లో.. అధిక భాగం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) విభాగంలోనే అత్యధిక పోస్టులు ఉన్నాయి. దీని ఆధ్వర్యంలోని ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులు 6,626 ఖాళీలు ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 1,306 ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎస్ఎస్‌సీ టైర్ 1, టైర్ 2 పరీక్షలను నిర్వహించింది. ఈ సంవత్సరం జనవరి 18, 19 తేదీల్లో టైర్ 2 పరీక్ష నిర్వహించారు. దీనికి హాజరైన అభ్యర్థులు ఎస్ఎస్‌సీ అధికారిక పోర్టల్ ద్వారా తమ పోస్ట్ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం.. ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్ సమర్పణ విండో మార్చి 9 సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది మార్చి 12 సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
మార్చి 12 వరకు అవకాశం
టైర్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థి తన మెరిట్, ఆసక్తిని బట్టి ఏ పోస్టుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ శాఖలో చేరాలనుకుంటున్నారు వంటి వివరాలను తెలిపే ప్రక్రియనే ఆప్షన్ ఫామ్ లేదా ప్రిఫరెన్స్ సమర్పణ అంటారు. అభ్యర్థి తన ప్రాధాన్యతలను ఆప్షన్ ఫామ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈ ప్రక్రియ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో జరిగేది. కానీ ఇప్పుడు టైర్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. స్టూడెంట్ లాగిన్ వివరాల ద్వారా ఆన్‌లైన్‌లోనే తమ పోస్ట్ ప్రాధాన్యత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. టైర్ 2 పరీక్ష ముగిసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ కు ముందు ఎస్ఎస్‌సీ ఈ విండోను ఓపెన్ చేసింది. మార్చి 12, సాయంత్రం 6 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
ఫామ్ సమర్పించకపోతే జాబ్ రాదు..
అభ్యర్థులు తమ ప్రిఫరెన్స్‌లో ఏ విభాగంలో పోస్టును కోరుకుంటున్నారో దానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే.. వారికి మంచి మార్కులు వచ్చినా.. ఆ పోస్టును కేటాయించరు. అలానే అభ్యర్థులు వారు ఎంచుకున్న పోస్టుకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులను సాధించాలి. ఒకసారి ప్రిఫరెన్స్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత.. గడువు ముగిశాక.. దాన్ని మార్చుకోవడానికి అవకాశం లేదు. అభ్యర్థులు ఈ ఫామ్ ను సమర్పించకపోతే.. వారు మెరిట్ జాబితాలో ఉన్నా సరే.. ఏ పోస్టునూ కేటాయించరు. కనుక ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి.
నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్ట్ కోడ్‌లను జాగ్రత్తగా ఓ పేపర్‌పై ముందుగా రాసుకుని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తే పోస్ట్ స్వభావం, పోస్టింగ్ ఏరియా, జీతం, అర్హతల్లో గందరగోళం లేకుండా ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాలను గమనించి ముగింపు గడువులోగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్‌ను సమర్పించాలని కమిషన్ సూచించింది. అలానే మీరు ఎంచుకున్న పోస్ట్ డెస్క్ జాబ్ లేక ఫీల్డ్ జాబా.. లొకేషన్ ఎక్కడ.. జీతం ఎంత అనే వివరాలను చెక్ చేసుకుని.. ఆ తర్వాత ప్రిఫరెన్స్ సమర్పించాలని సూచించింది.
