ఉదయ్ కిరణ్, తేజ కలయికలో తెరకెక్కిన మొదటి సినిమా ‘చిత్రం’ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మూవీ ‘చిత్రం (THE PICTURE)’.. తేజ, ఉదయ్ కిరణ్, రీమాసేన్, ఆర్.పి.పట్నాయక్, రసూల్ ఎల్లోర్ వంటి వారి కెరీర్‌కు పునాది వేసింది ఈ చిత్రమే.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన ‘చిత్రం’ 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2020 జూన్ 16 నాటికి విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అంతేకాదు దర్శకుడు తేజ మెగాఫోన్ చేతబట్టి కూడా నేటితో 20 వసంతాలు పూర్తి కావడం విశేషం.
కాలేజ్ వయసులో ప్రేమ అనేది అప్పటివరకు చాలా సినిమాల్లో చూశాం కానీ పెళ్లికి ముందే ఆ జంట తల్లిదండ్రులు కావడం దాని ద్వారా ఫ్యామిలీ మరియు సొసైటీలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలతో తేజ తెరకెక్కించిన ‘చిత్రం’కి క్లాస్, మాస్, యూత్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు అందరూ బ్రహ్మరథం పట్టారు. కొత్తవారైనా ఉదయ్ కిరణ్, రీమాసేన్‌ల నటన ఆకట్టుకుంటుంది.
తొలిచిత్రంతోనే లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆర్.పి.పట్నాయక్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. రసూల్ సినిమాటోగ్రఫీ సినిమాకు వన్నె తెచ్చింది. చాలా తక్కువ బడ్జెట్‌తో(దాదాపు రూ.44 లక్షలు) తెరకెక్కిన ‘చిత్రం’ వసూళ్ల పరంగా పెద్ద సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం.