Sbi
SBI: లోన్ ఇస్తామంటూ ఫోన్లు.. మెయిల్స్, మెసేజ్‌లు తీరా అన్నీ సరిచేసుకుని అప్లై చేశాక మీరు ఎలిజబుల్ కాదండీ అంటూ తప్పించుకోవడం షరా మామూలు అయిపోయింది బ్యాంకులకు. ఇలాగే ఓ ఉద్యోగిని లోన్ ఇస్తామని చెప్పిన ఎస్బీఐ బ్యాంకు.. డాక్యుమెంట్లన్నీ రెడీ చేశాక ఎలిజబుల్ కాదని చెప్పేసింది. అతను అక్కడితో వదిలేయలేదు. వినియోగదారుల ఫోరం వరకూ వెళ్లడంతో అతనికి రూ.50వేల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు వచ్చాయి.
ఎస్‌బీఐ తీరును రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుబట్టడానికి కారణమేంటి.. హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి స్థలం కొనుగోలుకు రూ.10 లక్షల రుణం కావాలని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఎస్‌బీఐ బ్రాంచిలో సంప్రదించారు. అంగీకరించిన బ్రాంచ్ అధికారులు.. అన్ని పత్రాలు తీసుకొచ్చాక అర్హత లేదని తిరస్కరించారు. ఆ ఉద్యోగి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు.
ఆ విషయాన్ని ముందు చెప్పకుండా అవసరమైన పత్రాలను తీసుకురమ్మనడం సరికాదని వ్యాఖ్యానించింది. వాటికి అయిన ఖర్చు రూ.20 వేలు, పరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని ఎస్‌బీఐని ఆదేశిస్తూ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ బుధవారం తీర్పు వెలువరించారు.
రుణాలు ఇచ్చే ముందు బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని, ఉద్యోగి జీతాన్ని పరిగణనలోకి తీసుకుని రుణం ఎంతమొత్తం వస్తుందో ముందే చెప్పొచ్చని గుర్తు చేసింది. ఎలిజబిలిటీ ఉందని చెప్పాక.. పత్రాలను సమర్పించుకోవచ్చని వివరించింది.
ఉద్యోగి 2017లో ఫ్లాట్ కొనుగోలుకు రూ.50 వేలు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నాడని, రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా ఫ్లాట్‌కు సంబంధించిన హక్కులు, ఈసీ, న్యాయసలహా తదితర పత్రాలను తీసుకురావాలని చెప్పిందని పేర్కొంది. అన్నీ సక్రమంగా ఉన్నా రుణ అర్హత లేదని 4 నెలల తరవాత చెప్పడం కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. రూ.10 లక్షల రుణం కోసం వచ్చినపుడు రూ.8 లక్షల అర్హత ఉందని చెప్పినా ఎటువంటి వివాదం ఉండేది కాదని చెప్పింది. పత్రాలన్నీ తీసుకురమ్మనడం, మొదట చేయాల్సింది తరవాత చేయడం బ్యాంకు సేవాలోపమని స్పష్టం చేసింది.