Director Yvs Chowdary About Ntr
NTR: ‘మహానుభావులు’ ప్రత్యేకించి బోధనలు ఏమీ చేయరు, నీతి సూత్రాలు వల్లె వేయరు. కానీ, తమ జీవనవిధానాల ద్వారా, తమ ఆశయాల సాధన ద్వారా.. మనలో మహత్తరమైన స్ఫూర్తిని నింపి వెళుతూంటారు. అటువంటి ‘మహానుభావుల’లో ముఖ్యులు.. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త ‘తెలుగు’ వారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’ మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు మరియూ ప్రతి ‘తెలుగు’వాడు ‘ఆయన’ని తమ సొంత మనిషిలా భావిస్తూ ఆత్మీయంగా పిలుచుకునే పేరు.. “ఎన్. టి. ఆర్.”..
“ఎన్. టి. ఆర్.”.. మాట పడడు.
“ఎన్. టి. ఆర్.”.. మాట తూలడు.
“ఎన్. టి. ఆర్.”.. మాట తప్పడు.
‘‘ఎన్. టి. ఆర్.’’ ది.. సుఖం కోరుకోని జీవనం.
‘‘ఎన్. టి. ఆర్.’’ ది.. అంతం లేని పయనం.
‘‘ఎన్. టి. ఆర్.’’ ది.. మరణం ఎరుగని జననం.
‘‘ఎన్. టి. ఆర్.’’ తలుచుకుంటే.. అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి, గమ్యాలు చిన్నవైపోతాయి.
‘‘ఎన్. టి. ఆర్.’’ ని తలచుకుంటే.. శక్తిసామర్ధ్యాలు పురుడుపోసుకుంటాయి, ధైర్యసాహసాలు సింహాలై గర్జిస్తాయి.
‘‘ఎన్. టి. ఆర్.’’ సాధించినివి తలచుకుంటుంటే.. యుగాలైనా క్షణాలై దొర్లిపోతాయి, రోష-పౌరుషాలు మీసాన్ని మెలేస్తాయి.
‘‘ఎన్. టి. ఆర్.’ తన పలుకులతో ‘తెలుగు’భాషకి విన్నూత్న ఒంపులు దిద్దాడు.
“ఎన్. టి. ఆర్.’’ తన చేతలతో ‘తెలుగు’వారిలో చైతన్యాన్ని నింపాడు.
‘‘ఎన్. టి. ఆర్.’’ తన విజయాలతో ‘తెలుగు’జాతికి నూతనోత్తేజాన్ని తెచ్చాడు.
‘ఆయన’తో స్నేహించిన ‘కాలం’.. అదృష్టమంటే నాదేనంటూ గర్వపడుతుంది.
‘ఆయన’తో కలహించిన ‘కాలం’.. ఆ అదృష్టాన్ని చూస్తూ అసూయ పడుతూంటుంది.
‘ఆయన’ని వీక్షించిన ‘కాలం’.. ఓ పురాణపురుషుడితో గడిపిన పుణ్యకాలం.
‘ఆయన’ని వీక్షించని ‘కాలం’.. ఆ పుణ్యం శ్రవణానికే పరిమితమైపోయిన సాధారణకాలం.
నమ్మిన సిద్ధాంతం కోసం మడమతిప్పకుండా పోరాటం చెయ్యటం ‘ఆయన’ ‘నైజం’.
ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవటమే ‘ఆయన’కున్న ఏకైక ‘ఇజం’.
ఒక్క అడుగు వెనక్కిపడిందంటే, తన సంకల్పబలంతో వంద అడుగులు ముందుకు వేసేవరకూ.. అహర్నిశలూ అలుపెరుగని యుధ్ధం చేయడమే ‘ఆయన’కున్న నిఖార్సైన ‘హీరోయిజం’.
ఇలా, ‘ఆయన’ ముచ్చట్లు.. అభిమానులు ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళుపాటు కూర్చుని ఊసులాడుకున్నా తరగనివీ, చెరగనివి.
కాబట్టే.. స్వయంగా ఆ ‘బ్రహ్మ’ దేవుడే..
కథ,
స్క్రీన్‌ప్లే,
మాటలు,
పాటలు,
ఆటలు,
పోరాటాలు,
దర్శకత్వం
మరియూ
నిర్మాణ బాధ్యతల్ని కూడా తన భుజస్కందాలపై వేసుకుని, ఆ ‘‘యుగపురుషుడ్ని’’ కధానాయకుడిగా పరిచయం చేసిన అపూర్వ ‘సజీవ’ చిత్రరాజమే..
“ఎన్. టి. ఆర్.” (నందమూరి తారక రామారావు)
‘విశ్వవిఖ్యాత దివ్యమోహన తేజోరూపం’..
ఆ ‘సజీవ’ చిత్రరాజానికి ఉపశీర్షిక.
‘తెలుగు’ జాతిరత్నంగా, ‘వెండితెర’వేల్పుగా.. ‘రుధిరోద్గారి’ నామసంవత్సరం, గ్రీష్మఋతువు, శుక్లపక్ష త్రయోదశి, తులారాశి, తులాలగ్నం, స్వాతినక్షత్రం 4వ పాదం నందు,
‘28 మే, 1923’ న మధ్యాహ్నం 04గం॥ 46ని॥ల మ్యాట్నీ’ ఆటతో, నిమ్మకూరులో విడుదలైన “ఎన్. టి. ఆర్.”.. ‘సజీవ’ చిత్రరాజం, ఆ తరువాయి ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఆటలు వేసినా.. విశ్రాంతి కార్డు లేకుండా, శుభం కార్డు పడకుండా, ‘ప్రేక్షకుల కళ్ళు’ అనే తెరపై అనంతంగా ప్రదర్శించబడుతూ, వాళ్ళ ‘మనసు’లపై ‘శాశ్వతముద్ర’ని ముద్రిస్తూనే ఉంది, ఉంటూనే ఉంటుంది.
‘ఇండియా’లోని ఓ ‘రిక్షా పుల్లర్’ నుండి ‘అమెరికా’లోని ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల’ వరకూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న చాలా మందికి, ‘ఆయన’ తన రూపం ద్వారా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు, తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా వారిలో ఇంకెంతో ఉద్వేగాన్ని నింపారు. దాంతోపాటు తన సినిమాల ద్వారా, హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన.. మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడి.. ఓ ‘కారణజన్ముడి’గా అవతరించారు.
అటువంటి ‘మహాపురుషుని’ మీద ఇష్టం ఏర్పడటం, ఆ ఇష్టం అభిమానంగా మారటం, ఆ అభిమానం ఆరాధనగా మారటం అనేది మానవ సహజం. అటువంటి ‘మహాయోధుని’ నుండీ స్ఫూర్తిని పొందటం, అటువంటి స్ఫూర్తిని పొందినందుకు కృతజ్ఞతగా ‘ఆయన’ గుణగణాలను, వ్యక్తిత్వాన్ని, విజయాల్ని.. జ్ఞాపకాల రూపంలో భావితరాలకు వారసత్వ సంపదగా తీసుకు వెళ్ళడం అనేది మన భారతీయ ‘సంస్క్రతి-సంప్రదాయం’.
వాటిలో భాగంగానే.. నేను నా ‘బొమ్మరిల్లు వారి’ బేనర్‌పై నిర్మించే ప్రతీ సినిమా ప్రారంభం.. ‘ఆయన’ ఫొటోపై ‘నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ..’ అంటూ ‘ప్రార్ధనాగీతం’తో మొదలై, మళ్ళీ సినిమా చివరిలో ‘ఆయన’ అదే ఫొటోపై ‘కృతజ్ఞతాభావం’తో పూర్తి అవ్వటం మరియూ ప్రతి సంవత్సరం వచ్చే ‘ఆయన’ యొక్క ‘జయంతి’, ‘వర్ధంతి’ల రోజున న్యూస్‌పేపర్లో ప్రత్యేక ప్రకటనతో స్మరించుకోవడమనే ‘సంస్క్రతి-సంప్రదాయాల’ను పాటిస్తున్నాను. నాలా ‘ఆయన’ ద్వారా స్ఫూర్తిని పొందిన మరెందరో ఆ విధానాన్నే ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు.
ఆ ‘యుగపురుషుని’ పేరు కలిసొచ్చేట్లుగా, నూతన కళాకారుల పరిచయ వేదికగా ‘New Talent Roars @‘ (‘NTR@‘) అనే బ్యానర్ ద్వారా నా మిత్రులు నా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ బ్యానర్ పేరు (‘NTR@‘) తోనే, నా ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్షలను ఆశించకుండా.. ‘ఆయన’ కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో.. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా.. ‘ఆయన’ సమకాలీకులు, సన్నిహితులు, సహచరులు, అధికారులు, ‘ఆయన’తో పనిజేసిన సిబ్బంది, ఇంకా ‘ఆయన’తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వారందరితో, మరీ ముఖ్యంగా ‘ఆయన’ అభిమానులతో… వారి వారికున్న అనుభవాల్ని, అనుబంధాల్ని.. ఉత్సుకతతో నిండిన, ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మలచి.. రాబోవు ‘ఆయన’ యొక్క ‘శత జయంతి’ (28 మే, 2022) రోజు నుండీ సంవత్సరం పాటు (27 మే 2023 వరకూ).. ఆ ఇంటర్వ్యూలను రకరకాల ‘డిజిటల్’ వేదికల ద్వారా.. ‘ఆయన’ జ్ఞాపకాల రూపంలో ప్రపంచ వ్యాప్త ‘తెలుగు’ ప్రజానీకానికి చేరువ చేయాలనే బృహత్తర ప్రణాళికకు.. రూపకల్పన చేయడం జరిగింది అని.. ఎన్. టి. ఆర్. 99వ ‘జయంతి’ సందర్భంగా, మీకందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. ఇలాంటి కార్యాచరణలతో మరెంతో మంది ‘అన్న’గారి అభిమానులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను, వస్తారని విశ్వసిస్తున్నాను.
ఇట్లు,
‘ఆయన’ వీరాభిమాని,
వై వి ఎస్ చౌదరి..