Greenko Group Donates 1000 Large Oxygen Concentrators First Lot Of 200 Lands In Hyderabad
Greenko Group: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమయ్యేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. మేము సైతం సాయం చేస్తామంటూ.. తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి ప్రత్యేకంగా వచ్చిన విమానంలోని వాటిని మంత్రి కేటీఆర్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు అందించారు.
గ్రీన్ కో సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి. కరోనా కట్టడికి సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచినందుకు మంత్రి కేటీఆర్ ఆ సంస్థ చైర్మన్ గోపికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, సమయానికి ఆక్సిజన్ అందించడమే సవాలుగా మారిందని అన్నారు.
ఇటువంటి సమయంలో అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సన్ట్రేటర్లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రెండొందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి సమానమని చెప్పారు.
మరోవైపు చైనా నుంచి తెలంగాణకి ప్యాసింజర్ ఫ్లైట్ ని ఉపయోగించి తీసుకువచ్చిన ఇండిగో సంస్థకు సైతం కేటీఆర్ కృతజ్జతలు తెలియజేశారు. హైదరాబాద్ సిటీ నలు దిక్కులా 4 రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులకు చికిత్స అందిస్తున్నందున… ఆ మేరకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరామని అన్నారు.
ఆక్సిజన్, మందుల సరఫరా విషయంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఆక్సిజన్ అందక జరిగిన దురదృష్టకర సంఘటనలు నమోదు కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని వివరించారు.