SPB – Ilaiyaraaja: గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మ్యాస్ట్రో ఇళయరాజా మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీతం, స్వరం మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో వీరి మధ్య అనుబంధం కూడా అలాంటిదే. కొన్ని వందల పాటలకు ఇళయరాజా సంగీతం అందించగా, బాలు తన గాత్రంతో ప్రాణం పోశారు.
అలాంటి స్నేహితుడు బాలు తనను విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఇళయరాజా దుఃఖానికి అంతే లేదు. నేను లేచి రమ్మని పిలిచినా బాలు వినిపించుకోలేదంటూ ఇళయరాజా తన దుఃఖాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. అలాగే స్నేహితుడికి అంజలి ఘటిస్తూ ఓ స్మృతి గీతాన్ని కూడా ఇళయరాజా కంపోజ్ చేశారు.
బాలు అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇళయరాజా తిరువణ్ణామలై గుడిని సందర్శించి ప్రాణ స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలని దీపాన్ని వెలిగించి నివాళులు అర్పించారు.