Pm Modi
Mission mode: దేశంలో ఏడాదిన్నరలో ‘మిషన్ మోడ్’లో 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో ఎన్నడూలేని విధంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టకపోవడం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియామకాలపై ఆయా మంత్రిత్వ శాఖలకు మోదీ ఈ కీలక సూచన చేయడం గమనార్హం.
Andhra Pradesh: ఆ హామీ ఇంకెప్పుడు అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురుచూస్తున్నారు: చంద్రబాబు
”దేశంలోని అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖల్లోని మానవ వనరుల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అలాగే, ఏడాదిన్నరలో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు” అని ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. కాగా, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ, కనీసం లక్షల్లోనయినా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నాయి. తదుపరి లోక్ సభ ఎన్నికలు 2024 మేలో జరగాల్సి ఉంది. ఉద్యోగాల కల్పన అంశాన్నే ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలోగా కనీసం 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే విమర్శల జోరు కాస్తయినా తగ్గుతుందని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.