Some leaders instigating party workers says Gehlot
Rajasthan: రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు భగ్గు మంటోంది. తాజాగా కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్‌పై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ విరుచుకుపడ్డారు. పైలట్ పేరెత్తకుండా కొంత మంది లీడర్లు పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తమను గుర్తించట్లేదని, బాగా చూసుకోవడం లేదని కార్యకర్తలను మభ్యపెడుతూ వారిని పార్టీకి వ్యతిరకంగా ఉసిగొల్పుతున్నారని అన్నారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మనలోని కొంత మంది లీడర్లే.. పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. పార్టీ వారిని సరిగా చూసుకోవడం లేదని, వారికి సరైన గౌరవం ఇవ్వడం లేదని నమ్మబలికించి కార్యకర్తల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ఇదంతా అవాస్తవం. పార్టీ కార్యకర్తల్ని తక్కువగా చేసి చూసినట్లు మీరెప్పుడైనా గమనించారా? అసలు వీళ్లు చెప్పే గౌరవ, మర్యాదలు ఏంటో మీకు తెలుసా?’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మేము పార్టీలో కార్యకర్తలుగా పని చేసి లీడర్ల స్థాయికి ఎదిగాము. కార్యకర్త నుంచి మాకు గౌరవ, మర్యాదలు ఉన్నాయి’’ అని అన్నారు.
గెహ్లోత్ పేరు బయటికి చెప్పకపోయినా సచిన్ పైలట్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా ముదిరింది. అనంతరం పైలట్ తిరుగుబాటు చేయడం, అధిష్టానం బుజ్జగించడం లాంటి తతంగాలు కూడా అయిపోయాయి. అయితే 9 ఏళ్ల ఒక దళిత బాలుడి మరణం ప్రస్తుతం రాజస్తాన్‌ను కుదిపివేస్తోంది. ఆ బాలుడిని న్యాయం చేయాలంటూ పైలట్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యకర్తలతో జరిగే సమావేశాల్లో గౌరవం, ప్రాధాన్యం గురించి తరుచూ మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలు గెహ్లోత్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.