SPB Bharat Ratna: గాన గంధర్వులు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఐదు దశాబ్దాలకు పైగా తన పాటతో ఆబాల గోపాలాన్ని అలరించిన మహాగాయకుడిని ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించాలని సంగీతాభిమానులు, బాలు అభిమానులు కోరుకుంటున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాలుకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. తాజాగా ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, బాలుకు అత్యంత సన్నిహితులు అయిన తనికెళ్ళ భరణి బాలుకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని 10 టీవీతో అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో ఇంతటి ఘనత సాధించింది ఒకరు అన్నమాచార్యుల వారు, రెండు బాలు గారు.. అన్నమాచార్య 80 ఏళ్లు జీవించి 32 వేల కీర్తనలు రాస్తే, బాలు 74 ఏళ్లల్లో 40 వేల పాటలు పాడారు.
బాలు గారు యావత్ భూగోళంలో ఉన్న తెలుగు వాళ్లందరి గుండెలను పాటల దారంతో కుట్టి ఏకం చేసి ఆ మాలను భారతమాత మెడలో వేశారు.
భారతరత్నకు ఆయన బతికి ఉన్నప్పుడే అర్హులు.. కానీ మన దురదృష్టం.. ఇప్పటికైనా అందుకు సంకల్పించిన ఏపీ సీఎంకు కృతజ్ఙతలు తెలియచేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో భారతరత్నకు సరితూగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాలు ఒక్కరే’’.. అన్నారు భరణి.
ఇంకా మాట్లాడుతూ.. ‘‘బాలుతో స్నేహం ఓ వ్యసనం.. బాలసుబ్రహ్మణ్యం షణ్ముఖుడు.. పాడారు, నటించారు, డబ్బింగ్ చెప్పారు, సినిమాలు నిర్మించారు, సంగీత దర్శకత్వం వహించారు. బాలు నటించే క్రమంలో నేను ఆయనతో ‘మిథునం’ సినిమా చేయడం నా పూర్వజన్మ పుణ్యఫలం’’.. అన్నారు తనికెళ్ల భరణి.