నటుడు కాకముందు వాచ్‌మెన్‌గా పనిచేశాను – అప్పడు నా కోరిక అదొక్కటే..

Sayaji Shinde: షాయాజీ షిండే.. పరిచయం అక్కర్లేని పేరు.. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా ప్రేక్షకాభిమానులు అభిమానాన్ని పొందారు. మహారాష్ట్రలోని శంకర్‌వాడి అనే పల్లెటూళ్లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన షాయాజీ 1995 లో నటించడం మొదలుపెట్టారు.

సినిమా అంటే పిచ్చి, నటన అంటే ప్యాషన్ ఉండడంతో అందరిలాగే సినిమా కష్టాలు పడ్డారు. నటుడిగా ప్రయత్నాలు ప్రారంభించకముందు ఆయన కొన్నాళ్లపాటు మహారాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేశారు. అప్పుడు షాయాజీ నెల జీతం రూ.165.. అందులో రూ.150 ఇంట్లో ఇచ్చి, మిగిలిన పదిహేను రూపాయలు ఖర్చు పెట్టుకునేవారట. ఆ టైంలో ఆయనకున్న డ్రీమ్ ఏంటంటే రూ.400 లు జీతం అందుకోవాలని.

కట్ చేస్తే తెలుగులో టాప్ విలన్‌గా, ఇతర భాషల్లో విలక్షణ నటుడిగా లక్షల రూపాయల్లో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో షాయాజీ గురించి ఆర్టికల్ చూసి నటుడు మనోజ్ బాజ్‌పేయి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాయాజీ గురించి చెప్పడంతో ‘శూల్’ Shool సినిమాలో అవకాశమిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’ Tagore సినిమాతో తెలుగులో షాయాజీ జర్నీ స్టార్ట్ అయ్యింది. హిందీలో అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘కలకత్తా మెయిల్’ Calcutta Mail సినిమాను ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్ కలిసి నిర్మించారు. ఆ సమయంలో షాయాజీ నటనకు ఇంప్రెస్ అయిన అరవింద్ తెలుగులో తాను నిర్మించిన ‘ఠాగూర్’ మూవీలో షాయాజీకి విలన్ వేషం ఇచ్చారు.

ఆ సినిమా ఆయనకు మంచి పేరుతో పాటు బోలెడన్ని ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది. భాష నేర్చుకుని మరీ తన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం చూస్తే ఆయనకు నటనంటే ఎంత ప్యాషన్ అనేది అర్థమవుతోంది.