Nandyala Ravi : కరోనాతో ప్రముఖ యువ రచయిత – దర్శకుడు నంద్యాల రవి మృతి..

ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం మృతిచెందారు.. రచయితగా పలు సినిమాలకు పని చేసిన రవి.. నాగశౌర్య, అవికా గోర్ నటించిన ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ మూవీతో దర్శకుడిగా మారారు..

Nandyala Ravi: ‘‘నేనూ సీతామహాలక్ష్మీ’, ‘పందెం’, ‘అసాధ్యుడు’ వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని… ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ చిత్రంతో దర్శకుడిగా మారి… తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటూనే… రచయితగా వస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న యువ ప్రతిభాశాలి నంద్యాల రవి (42)ని కరోనా కాటేసింది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఈరోజు (మే 14) ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

రవికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రవి స్వస్థలం పాలకొల్లు సమీపంలోని సరిపల్లి (గణపవరం పక్కన). రవి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా అతనికి పలువురు ఆర్థిక సాయం అందించారు. ఇక కోలుకుని ఇంటికి వచ్చేస్తున్నరనగా… కరోనా ఆయణ్ణి బలి తీసుకోవడం బాధాకరం.

రవి అకాల మరణం పట్ల ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్ బాబు, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్.. ప్రముఖ దర్శకులు విజయ్ కుమార్ కొండా, ప్రముఖ నటులు సప్తగిరి, ధన్ రాజ్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ కొండా-రాజ్ తరుణ్ కలయికలో రీసెంట్ గా వచ్చిన ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘పవర్ ప్లే’ చిత్రాలకు రవి రచయితగా పని చేశారు..

 

ట్రెండింగ్ వార్తలు