Dates : చలికాలంలో ఖర్జూరాలు తింటే గుండె సమస్యలు దూరం!..
చలికాలంలో శరీరంలోని ప్రొటీన్స్‌ను సమతుల్యం చేస్తాయి. బి1, బి2, బి3, బి5 విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఈ విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్లు వీటిని తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
- Guntupalli Ramakrishna
- Published On : November 10, 2021 / 12:34 PM IST
Dates
Dates : శీతాకాలంలో చర్మ వ్యాధులు అధికంగా వస్తుంటాయి. చర్మ సంరక్షణపై అందరిలో ఆందోళన ఉంటుంది. అయితే, ఖర్జూరం పండును ఆరగించడం వల్ల చర్మ సంరక్షణతో పాటు వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే చలికాలంలో ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరాలను పోషక విలువల రారాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఖర్జూరాలు ఒక వరం. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది.ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతి రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల గుండె సమస్యలు మీ దరిచేరవు. రోజుకు రెండు ఖర్జూరాలు తింటే శరీరంలో వేడిశాతం తగ్గకుండా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటుంది. కండరాల్ని గట్టిగా ఉంచడమేకాకుండా, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గులాంటి రోగాలను దరికి రానివ్వవు. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చేస్తుంది. ఖర్జూరం పండును తినడం వల్ల రక్తం పెరుగుతుంది.
చలికాలంలో శరీరంలోని ప్రొటీన్స్‌ను సమతుల్యం చేస్తాయి. బి1, బి2, బి3, బి5 విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఈ విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్లు వీటిని తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలతో సతమయ్యేవారికి చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి రెండు లేదా మూడు ఖర్జూరాలను తిని పడుకోవడం ద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు తొలగి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది.
చలికాలంలో ప్రతి ఒక్కరినీ దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఒక గ్లాస్ నీటిలో రెండు ఖర్జూరాలు, 5 నల్ల మిరియాలు వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిని వడబోసి తాగటం ద్వారా.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.ఆస్తమా సమస్యతో సతమతమయ్యే వారికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బాలింతలు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా ఖర్జూరాలతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ డి శరీరాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. వీటిలోని మినరల్స్ శరీరానికి ఎంతో అవసరం. కాబట్టి చలికాలంలో ఖర్జూరాలు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
