కొత్త నిబంధనలు : వైద్య పరికరాల్లో లోపాలుంటే..రూ. కోటి కట్టాల్సిందే

  • Publish Date - November 4, 2019 / 02:14 AM IST

వైద్య చికిత్సకు ఉపయోగించే పరికరాల్లో లోపాలుండడం..అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే..రోగులు నష్టపరిహారానికి డిమాండ్ చేయొచ్చు. ఇకపై రూ. కోటి వరకు నష్టపరిహారం కోరవచ్చు. అలాంటి పరికరాల తయారీదారులు లేదా వాటిని దిగుమతి చేసుకున్న సంస్థలకు భారీగా అపరాధరుసుం, జైలు శిక్ష విధించేలా కొత్త నిబంధనలతో నీతి ఆయోగ్ ముసాయిదా బిల్లును రూపొందించింది.

వైద్య పరికరాల బిల్లు, 2019 పేరిట రూపొందించిన ముసాయిదాను నీతి ఆయోగ్ మంత్రుల పరిశీలనకు ఉంచింది. భారత్‌లో సురక్షిత, నాణ్యమైన వైద్య పరికరాల వినియోగం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ఈ నిబంధనలు స్థానికంగా తయారైన, దిగుమతి చేసుకున్న వైద్య పరికరాల అన్నింటికీ వర్తిస్తాయి. 

ముసాయిదా ప్రతిపాదనలు : – 
> ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా మార్కెట్‌లోకి వైద్య పరికరాన్ని తీసుకొస్తే..మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమాన..లేదా రెండింటినీ విధించే అవకాశం.
ప్రతిపాదిత నియమ నిబంధనలు ఉల్లంఘించి రూపొందించిన వైద్య పరికరాలు ఉపయోగించడం వల్ల ఎవరైనా గాయపడినా, అనారోగ్య పరిస్థితులకు ఎదురైనా..వారు నష్టపరిహారం కోరే అవకాశం. 
అన్ని రకాల వైద్య పరికరాల నమోదు తప్పనిసరి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ మెడికల్ డివైసెస్‌లో నమోదు చేసుకోవడంతో పాటు విశిష్ట గుర్తింపు సంఖ్యను కూడా లేబుళ్లపై ముద్రించాల్సి ఉంటుంది. 
క్లినికల్ ట్రయల్స్, వైద్య పరికరాల విక్రయాలకు సంబంధించిన నేరాలకు జరిమాన, జైలు శిక్షలు.