ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హల్వా. ఈ తీపి వంటకం చేశాకే బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రారంభిస్తారు. హల్వా చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది.
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హల్వా. ఈ తీపి వంటకం చేశాకే బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రారంభిస్తారు. హల్వా చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. దశాబ్దాలుగా మన నాయకులు ఫాలో అవుతున్నారు. అసలు బడ్జెట్‌కి, హల్వాకి సంబంధం ఏంటి.. బడ్జెట్ ప్రింటింగ్ ముందు కేవలం హల్వానే ఎందుకు చేస్తారు.. బడ్జెట్ హల్వా కనెక్షన్ వెనుక అసలు కథ ఏంటి…
ఎప్పటిలాగే ఈసారి కూడా హల్వాతోనే బడ్జెట్ ప్రింటింగ్ షురూ చేశారు. నార్త్‌బ్లాక్‌లో 2019, జనవరి 21వ తేదీ సోమవారం ఆర్థిక కార్యాలయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా హల్వా వేడుకను ప్రారంభించారు. సిబ్బంది హల్వా పంచి పెట్టారు. దీంతో బడ్జెట్ కాగితాల ముద్రణ మొదలైంది. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.
హల్వా వెనుక అసలు కథ:
ప్రతి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. భారతీయ వంటకమైన హల్వాను చేశాకే బడ్జెట్ కాగితాల ముద్రణ మొదలుపెడతారు. ఆర్థిక మంత్రి సమక్షంలో హల్వాను సిబ్బందికి పంచుతారు. ఈసారి ఆర్థిక మంత్రి జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లడంతో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ హల్వా పంచారు.
10 రోజుల పాటు సిబ్బంది అంతా ప్రింటింగ్ ప్రెస్‌లో ఉండి బడ్జెట్‌కు సంబంధించిన పేపర్లను ముద్రిస్తారు. వారు తిరిగి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే బయటికి వస్తారు. ఈ సమయంలో వారికి కనీసం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఉండదు. దీనికి తోడు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీంతో వారిని ముందుగా కొంత తృప్తి పరిచడానికి, ఆనందింపజేయడానికి, ఉత్సాహం నింపడానికి బడ్జెట్ ప్రింటింగ్‌కు ముందు హల్వా వండడం ప్రారంభమైంది.
హల్వా పెట్టడం వెనుక మరో ప్రధాన ఉద్దేశం:
సాధారణంగా మనం ఏదైనా మంచి పని చేసే ముందు వేడుక చేసుకుంటాం. కొందరు నాన్‌వెజ్‌తో, ఇంకొందరు స్వీట్లు పంచి పనులు మొదలు పెడతారు. పొలాల్లో కోత కోసే ముందు యాటలు కోస్తారు… అలాగే ఇది కూడా. బడ్జెట్ కూడా దాదాపుగా అలాంటిదే. దేశ ప్రగతికి, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే మార్గదర్శి. అలాంటి బడ్జెట్ ప్రింటింగ్ స్టార్ట్ చేసే ముందు పండగ చేసుకోవాలి కదా. అందుకే అలా హల్వా లాంటి తీపి వంటకం వండడం ప్రారంభమైంది. ఇదీ… బడ్జెట్‌కు ముందు హల్వా వండడం వెనుక ఉన్న అసలు కథ.