ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో.. తెలుగువారు కూడా ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటారు. అసలు మీకు ఉగాది అంటే ఏమిటో అర్థం తెలుసా? ఉగాది అనే పదం ఎలా వచ్చిందో తెలుసా..? ఉగాది అనే పదం ‘యుగాది’ నుండి పుట్టుకొచ్చింది. ఉగాదిలో “ఉగ” అంటే నక్షత్ర గమనం. ”ఆది” అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట. అలా యుగానికి ఆది ‘యుగాది’ అయింది. ‘యుగాది’కి మరో పేరు ‘ఉగాది’ అయింది.
ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పించిమనం సేవించడం మన సంప్రదాయం. ఉగాది పచ్చడి సేవనం వల్ల జీవితంలో ఏర్పడే ఒడడిదొడుకులను తట్టుకునే శక్తితో పాటు, శరీరంలో జరిగే మార్పులకు తట్టుకునే ఆరోగ్య పరమైన శక్తి కూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధ గుణాలు వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటారు. అందుకే ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రంగురంగుల దుస్తులు, చీరలు ధరించి, కాళ్ళకు పసుపు, తలలో మల్లెలు పెట్టుకుని ఎంతో అందంగా రేడీ అయి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. వేపపూత, మావిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారుచేసే ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు వంటి అన్నీ రకాల రుచులు కలిసి ఉంటాయి. వాటిని షడ్రుచులు అంటారు.
ఈ షడ్రుచులను కోపం, ద్వేషం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు. జీవితంలో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండవని, కష్టసుఖాలు కూడా కలగలిసి ఉంటాయని చెప్తుంది ఉగాది పచ్చడి. దేనికీ పొంగిపోక, కుంగిపోక ప్రతిదాన్నీ సమదృష్టితో చూడాలని తెలియజేసేదే ఉగాది. ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే మనకు కనబడుతుంటాయ. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నాయి. మల్లెలు, మావిడి పిందెలు, వేపపూత.. అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ప్రకృతిలో ప్రతిదీ ఉగాదికి సంకేతమే. ఇలా అంతా కొత్తదనం కనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం.
ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆ రోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా.. అతివృష్టి, అనావృష్టి లాంటివి ఉన్నాయా.. తుఫానులు, భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా.. దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటుచేసుకుంటాయి.
మనది చంద్రమాన కాలెండర్ కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు. శక కాలెండర్ చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఇంగ్లిష్ నెలలను అనుసరించి చూస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణి వాళ్ళకి కూడా ఉగాది పర్వదినమే కొత్త సంవత్సరం. తెలుగువారికి నూతన జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.