Bjp : తెలంగాణకు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు.. లోక్‎సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొత్త వ్యూహం

లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది.

Bjp : లోక్ సభ ఎన్నికలు సమీపించడంతో పార్టీలు జోరు పెంచాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ పర్వాన్ని భారీ ఈవెంట్ లా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానాలు పంపింది.

ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత..
లోక్ సభ ఎన్నికలకు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్స్ ను ఒక భారీ ఈవెంట్ లా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ అభ్యర్థులు.. రెండో దఫా ప్రచారాన్ని నామినేషన్స్ ర్యాలీతో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. నామినేషన్ల ర్యాలీలను భారీ ఈవెంట్ లా నిర్వహించేలా జాతీయ స్థాయి నేతలను ఆహ్వానిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చి పాల్గొనేలా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.

మెదక్ కు గోవా సీఎం, మల్కాజ్ గిరికి కేంద్ర మంత్రి..
రేపటి(ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులకు మద్దతుగా ముఖ్య అతిథులుగా జాతీయ నేతలు హాజరై ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. రేపు మెదక్ నుంచి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరుకానున్నారు. మల్కాజ్ గిరిలో రేపు ఈటల రాజేందర్ సైతం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అతీఫ్ సింగ్ హాజరుకానున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ నామినేషన్ వేయనున్నారు. అయితే, దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు అన్నది ఖరారు కాలేదు. రేపు ఉదయం కల్లా ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సికింద్రాబాద్ కు రాజ్ నాథ్ సింగ్.. జహీరాబాద్ కు సీఎం ఫడ్నవీస్..
ఈ నెల 19న సికింద్రాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మం నుండి వినోద్ రావు 19వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన కూడా సికింద్రాబాద్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. 22వ తేదీన జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారని తెలుస్తోంది. 22న చేవెళ్ల నుంచి కొండా విశ్వేశర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. నల్గొండ నుంచి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రిజిజు హాజరుకానున్నారు. 23న భువనగరి నుంచి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ వేయనున్నారు. దీనికి హాజరయ్యే ముఖ్య అతిథి ఎవరన్నది ఖరారు కావాల్సి ఉంది.

Also Read : కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత?

ట్రెండింగ్ వార్తలు