Ramba Oorvasi Menaka Reivew: ‘రంభ ఊర్వశి మేనక’ రివ్యూ.. భూమి పైకి రంభ, ఊర్వశి, మేనక తమ భక్తుడి కోసం దిగి వస్తే..

Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక భూమి మీదకు వస్తారు అనే సోషియో ఫాంటసీ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

  • Updated on- September 4, 2026 / 03:01 PM IST

Ramba Oorvasi Menaka Reivew

Ramba Oorvasi Menaka Reivew: అల్లరి నరేష్, సురభి జంటగా తెరకెక్కిన సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణంలో చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియ, తారక్ పొన్నప్ప, నరేష్, శ్రీనివాస రెడ్డి, కళ్యాణి రాజ్, వెన్నెల కిషోర్, హరితేజ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రంభ ఊర్వశి మేనక సినిమా నేడు సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

సూరి(అల్లరి నరేష్) పెద్దయ్యాక హీరో అవ్వాలని అనుకుంటాడు. ఇంట్లో తమ తాతల కలం నుంచి వస్తున్న ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మీద ప్యాట్రన్ కరెక్ట్ గా రాస్తే రంభ, ఊర్వశి, మేనక దిగి వచ్చి అడిగిన వరాలు ఇస్తారని సూరి బాబాయ్(నరేష్)చెప్తాడు. దాంతో వాళ్ళ అమ్మ(కళ్యాణి రాజ్) వద్దన్నా సూరి ఆ బుక్ పట్టుకొని చిన్నప్పట్నుంచి ట్రై చేస్తూ రంభ, ఊర్వశి, మేనకలను దేవతలుగా పూజిస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు తను గీసే ప్యాట్రన్ కరెక్ట్ అయి రంభ, ఊర్వశి, మేనక వచ్చి వరాలు ఇస్తారని ఊరంతా అప్పులు చేసి తన డ్రామా కంపెనీ బిజినెస్ కూడా ఆపేస్తాడు. తన చిన్ననాటి ప్రేమికురాలు చిన్ని(సురభి)ఊళ్లోకి వస్తుంది. సూరి, చిన్ని ప్రేమించుకుంటుంటే అదే ఊళ్ళో పోలీస్ అప్పలనాయుడు(తారక్ పొన్నప్ప) సూరి వల్లే చిన్ని తనకు చిన్నప్పుడే దూరమైందని అతనిపై పగ పెంచుకొని చిన్న తప్పు దొరికినా సూరిని అరెస్ట్ చేయాలనీ ట్రై చేస్తూ ఉంటాడు.

చిన్ని తండ్రి(గోపరాజు రమణ).. సూరి తన అప్పులన్నీ క్లియర్ చేస్తే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని లేకపోతే అప్పల నాయుడుకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. అదే సమయంలో సూరి తల్లి హాస్పటల్ పాలయి ఆపరేషన్ కి 50 లక్షలు అవసరం అవుతాయి. దీంతో సూరి బాధలో మందు తాగి బుక్ మీద ఏదో గీసేస్తే అది వర్కౌట్ అయి రంభ(రాశి సింగ్), ఊర్వశి(విష్ణుప్రియ), మేనక(ప్రిషా సింగ్) కిందకు వస్తారు. కానీ ఇంద్రుడు(వెన్నెల కిషోర్) వాళ్ళ పవర్స్ తీసేసుకుంటాడు. మరి రంభ ఊర్వశి మేనక పవర్స్ లేకుండా సూరి వరాలు తీర్చారా? ఇంద్రుడు వాళ్ళ పవర్స్ ఎందుకు తీసేసుకుంటాడు? సూరి తల్లి బతుకుతుందా? రంభ, ఊర్వశి, మేనక కిందకు వచ్చాక సూరి లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి? సూరి – చిన్ని ప్రేమకథ సక్సెస్ అవుతుందా? అప్పలనాయుడు సూరిని అరెస్ట్ చేస్తాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Sahaa Review : ‘సహా’ మూవీ రివ్యూ.. చిన్నప్పట్నుంచి ఒకే అమ్మాయిని ప్రేమించి..

సినిమా విశ్లేషణ..

గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్న అల్లరి నరేష్ కామెడీ సినిమాతో తనకు అచ్చొచ్చిన జానర్లో సినిమా చేయడం, రంభ ఊర్వశి మేనక భూమి మీదకు వస్తారు అనే సోషియో ఫాంటసీ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

కథ ప్రారంభంలోనే ఆ బుక్ గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. సూరి పెద్దయ్యాక అప్పులు చేసి ఏదో ఒక రోజు రంభ, ఊర్వశి, మేనక వస్తారని ఎదురు చూడటం, బుక్ మీద ప్యాట్రన్స్ గీస్తూ ఉండటం, చిన్నితో లవ్ స్టోరీ, అప్పలనాయుడుతో గొడవలతో సింపుల్ గా సాగిపోతుంది. సూరికి ఒకేసారి అన్ని సమస్యలు వచ్చాక కథ ఆసక్తిగా మారుతుంది. రంభ, ఊర్వశి, మేనక భూమి మీదకు వచ్చాక పవర్స్ లేకపోతే ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ రంభ, ఊర్వశి, మేనక వచ్చాక సూరికి వచ్చే కష్టాలతో, కామెడీతో, అదే సమయంలో తల్లిని కాపాడాలి అనే ఎమోషన్ తో నడిపించారు. చివర్లో ఓ రెగ్యులర్ మెసేజ్ ఊహించే క్లైమాక్స్ తో ముగించారు.

ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు సీన్స్ తప్ప పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ తో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ కోసం మాములుగా కొన్ని సీన్స్ షూట్ చేయొచ్చు కానీ AI విజువల్స్ ని ఎందుకు వాడారో దర్శకుడికే తెలియాలి. మధ్యలో అక్కర్లేని హీరో – హీరోయిన్ పాట వస్తుంది. రంభ, ఊర్వశి, మేనక వచ్చేంతవరకు సినిమా సో సోగా సాగదీశారు. రంభ, ఊర్వశి, మేనక ఎంట్రీ, ఇంద్రలోకం సెటప్ అన్ని బాగున్నాయి. ఒకప్పటి సోషియో ఫాంటసీ సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. రంభ, ఊర్వశి, మేనక వచ్చాక నరేష్ చేసే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దృశ్యం, ఓజి.. పలు సినిమాల స్పూఫ్స్ తో కామెడీ ట్రై చేసారు. అదే సమయంలో కాస్త సస్పెన్స్ తో ఇంద్రుడు ఇచ్చిన ఓ శాపంతో ఆసక్తిగా నడిపించారు.

మొదట్నుంచి తల్లి సెంటిమెంట్ ని కామెడీగానే చూపించి చివర్లో బాగా ఎమోషనల్ ట్రై చేసారు కానీ అంతగా పండలేదు. ఇంద్రుడు వర్సెస్ సామాన్య మానవుడు ఆడే ఆట అన్నట్టు స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నారు. మధ్యలో యముడి ఎంట్రీ సీన్స్ బాగానే ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ రొటీన్ సోషల్ మీడియా వైరల్ కాన్సెప్ట్ తో నడిపించారు. దేవుడు వరాలు ఇస్తాడు, ఎవరో ఏదో చేస్తారు అని కాకుండా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలనే మెసేజ్ తో ముగిస్తారు. ఒక్కసారి చూడొచ్చు. అనుకున్నంత కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

అల్లరి నరేష్ కామెడీ కింగ్ అని తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత మరోసారి కామెడీలో బాగానే నటించారు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం మెప్పించాడు. సురభి పర్వాలేదు అనిపిస్తుంది. రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ అందాలు ఆరబోస్తూనే ఎక్కువ డైలాగ్స్ లేకుండా సింపుల్ గా మెప్పించారు. ఈ ముగ్గురు కలిసి అల్లరి నరేష్ తో స్పెషల్ సాంగ్ లో మాత్రం స్టెప్పులు అదరగొట్టారు.

తల్లి పాత్రలో కళ్యాణి రాజ్ మెప్పిస్తారు. సీనియర్ నటుడు నరేష్ కూడా తన కామెడీతో ఫుల్ గా నవ్విస్తారు. శ్రీనివాస రెడ్డి బాగానే నవ్వించారు. తారక్ పొన్నప్ప పాత్ర కాస్త ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా కామెడీ చేస్తూ బాగానే సెట్ అయ్యారు. రచ్చ రవి, గోపరాజు రమణ, రవిశివతేజ, హరితేజ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Bethlehem Kudumba Unit Review: ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ రివ్యూ.. మలయాళంలో 200కోట్లు కొట్టిన మమిత బైజు సినిమా.. ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. ఒక్క రంభ ఊర్వశి మేనక పాట మాత్రమే బాగుంది. మిగిలిన పాటలు యావరేజ్. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. ఇంద్ర లోకం సెటప్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే బాగానే వర్క్ చేసింది. ఇంద్రలోకం సెటప్, రంభ ఊర్వశి మేనక కిందకు వచ్చే ఎఫెక్ట్స్ కి గ్రాఫిక్స్ కూడా బాగా కుదిరాయి. దేవుళ్ళు, యముడు కాకుండా రంభ ఊర్వశి మేనక కిందకు రావడం అనే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా రొటీన్ కథనంతోనే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా వాళ్ళు వచ్చి తన లైఫ్ ని మార్చేస్తారు అని ఎదురుచూసే ఓ వ్యక్తి కథ. వాళ్ళు వచ్చాక అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అని సస్పెన్స్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.