Pochamma : ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఆహా ఓటీటీలో కొత్త సిరీస్..

ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లు కాస్త డివోషనల్ టచ్ ని జోడించి తెరకెక్కుతున్నాయి. (Pochamma)

  • Updated on- April 17, 2026 / 05:49 PM IST

Pochamma

Pochamma : రెగ్యులర్ గా కొత్త సినిమాలు, సిరీస్ లు తీసుకొచ్చే ఓటీటీ ఆహా తాజాగా ‘పోచమ్మ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. పోచమ్మ వెబ్ సిరీస్ నేడు ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మాణంలో రమేష్ ఇందిర దర్శకత్వంలో ఈ సిరీస్ ని తెరకెక్కించారు.

కథ విషయానికొస్తే..

అరకు దగ్గర్లోని ఓ ఎస్టేట్ కి ఫ్రెడ్రిక్(రమేష్ ఇందిర) తన ఫ్యామిలీతో కలిసి షిఫ్ట్ అవుతాడు. ఓ రోజు అతని చిన్న కూతురు జెస్సి(స్నేహాల్ కామత్) పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది ఆ ఎస్టేట్ లో ఉన్న పోచమ్మ విగ్రహం తీసేయడం వల్లే అని ఎస్టేట్ మేనేజర్ రఘుపతి(అచ్యుత్ కుమార్), చుట్టుపక్క జనాలు చెప్తారు.

కానీ జెస్సి రఘుపతి కొడుకు సురేష్(వివేక్ సింహ) వల్లే చనిపోయిందని, అతను తన చెల్లిని ఇబ్బంది పెట్టాడని ఇవా(శ్రీ పూజ రెడ్డి) పోలీసులకు చెప్తుంది. ఈ కేసులో పోలీసులు ఇవా భర్త డేవిడ్(అర్జున్ అంబటి)ని కూడా అనుమానిస్తారు. అసలు జెస్సి ఎలా చనిపోయింది? నిజంగా పోచమ్మ శాపమా? సురేష్ – జెస్సి మధ్య ఏం జరిగింది? పోచమ్మ విగ్రహం తీసేసిన తర్వాత ఫ్రెడ్రిక్ ఇంట్లో జరిగిన సంఘటనలు ఏంటి? పోలీసులు ఈ కేసుని చేధించారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Papam Prathap Review: ‘పాపం ప్రతాప్’ మూవీ రివ్యూ.. పాపం అంటూనే నవ్వుకోవచ్చు..

సిరీస్ విశ్లేషణ..

ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లు కాస్త డివోషనల్ టచ్ ని జోడించి తెరకెక్కుతున్నాయి. ఈ పోచమ్మ కూడా అలాంటిదే. మర్డర్ మిస్టరీ చుట్టూ కథ నడుస్తుంది. ఓపెనింగ్ జెస్సి మరణంతోనే సిరీస్ ని ప్రారంభించి అసలు ఏం జరిగింది అంటూ రెండు ఎపిసోడ్స్ ఒక్కొక్కరి కోణంలో ఫ్లాష్ బ్యాక్ మొత్తం కాస్త సాగదీసి చెప్తారు. దీంతో జెస్సి ఎవరి వల్ల చనిపోయింది అనే క్యూరియాసిటీ బాగా నెలకొంటుంది. చివరి వరకు దర్శకుడు ఆ సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేయగలిగాడు.

పోచమ్మ విగ్రహాన్ని వాడుకొని దాని చుట్టూ కథ నడిపారు కానీ ఆ డివోషనల్ టచ్ ని మరింత బలంగా చూపిస్తే బాగుండేది. కేవలం ఆ విగ్రహం ఎలా వచ్చింది అని కథ కోసం వాడారు కానీ జరిగే కథలో ఆ దైవాన్ని జోడిస్తే మరింత ఆసక్తిగా ఉండేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. అసలు జెస్సి చావుకు కారణం ఎవరు? ఎందుకు చంపారు అనేది మాత్రం అస్సలు ఊహించలేం. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ సిరీస్ కి చాలా ప్లస్ అయింది.

సిరీస్ కాబట్టి బాగా సాగదీశారు. చివర్లో ఓ మెసేజ్ కూడా ఇవ్వడం గమనార్హం. ఇక ఇది మొదటి సీజన్ మాత్రమే. అదే పోచమ్మ విగ్రహంతో దాని చుట్టూ కథలు రాసుకొని మరిన్ని సీజన్స్ వస్తాయని తెలుస్తుంది. మరి మున్ముందు సీజన్స్ లో అయినా ఆ దేవత గురించి మరింత చెప్పడం, సంఘటనలకు డివోషనల్ టచ్ ఇవ్వడం చేస్తారేమో చూడాలి. ఈ సిరీస్ ని కన్నడ నిర్మాత, దర్శకుడు, కొంతమంది కన్నడ నటీనటులతో తెలుగులో తెరకెక్కించడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

జెస్సి పాత్రలో స్నేహాల్ కామత్ క్యూట్ గా కనిపిస్తూనే మెప్పించింది. శ్రీ పూజ రెడ్డి తన అందాలతో అలరిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. సీరియల్ నటుడు అర్జున్ అంబటి కాసేపే కనిపించినా బాగానే మెప్పించాడు. కీలక పాత్రలో అచ్యుత్ కుమార్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా చాలా సింపుల్ గా నటించి మెప్పిస్తాడు. వివేక్ సింహ, రమేష్ ఇందిర, ప్రియా శతమర్శన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Thimmarajupalli TV Review: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్ కి ప్లస్ అయింది. సిరీస్ అంతా ఆల్మోస్ట్ ఎక్కువ భాగం ఒకటే లొకేషన్ లో తెరకెక్కించడం గమనార్హం. సింపుల్ మర్డర్ మిస్టరీని పోచమ్మ దేవత పేరుతో ఎలా పక్కదారి పట్టించారు అనే రెగ్యులర్ కథని ఆసక్తికర స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు. నిర్మాణ పరంగా తక్కువ ఖర్చుతోనే ఈ సిరీస్ ని తెరకెక్కించారు.

మొత్తంగా ‘పోచమ్మ’ సిరీస్ డివోషనల్ టైటిల్ తో సస్పెన్స్ జానర్ లో తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ. ఈ సిరీస్ కి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.