Dorothy Review : ‘డోరతి’ మూవీ రివ్యూ.. బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అయితే.. క్లైమాక్స్ ఏంట్రా బాబు ఇలా ఉంది..

తమిళ్ లో రిలీజయి యావరేజ్ గా నిలిచి, వివాదాల పాలయిన డోరతి సినిమా తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా అక్టోబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. (Dorothy Review)

  • Updated on- October 2, 2026 / 12:31 AM IST

Dorothy Review

Dorothy Review : సనంత్, రిషికాంత్, కీర్తి సురేష్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన తమిళ సినిమా ‘డోరతి’. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్త నిర్మాణంలో కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే తమిళ్ లో రిలీజయి యావరేజ్ గా నిలిచి, వివాదాల పాలయిన డోరతి సినిమా తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా అక్టోబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు రోజే ప్రీమియర్ షోలు కూడా వేశారు.

కథ విషయానికొస్తే..

సుబ్బు(సనంత్ కుమార్), కార్తీ (రిషికాంత్ రాజేంద్రన్) చిన్నప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సుబ్బు ఊర్లో పెద్ద కుటుంబం. అతని నాన్న, అన్నలు రౌడీ ఇజం, వడ్డీ వ్యాపారం చేస్తారు. కులం, పరువు పట్టింపులు ఎక్కువ. సుబ్బు చిన్నప్పుడు చాలా ర్యాష్ గా ఉండేవాడు. కార్తీ భయపడేవాడు. కానీ పెద్దయ్యాక ఇది రివర్స్ అవుతుంది. ఆడవాళ్లు లేని ఆ ఇంటికి సుబ్బు అన్న డోరతి(కీర్తి సురేష్)ని పెళ్లి చేసుకొని సడెన్ గా తీసుకొస్తాడు. అప్పట్నుంచి సుబ్బు డోరతికి దగ్గరగా ఉంటాడు. ఆమెతో పాటు అన్ని పనులు చేస్తాడు. ఓ రోజు సడెన్ గా డోరతి ఉరి వేసుకొని ఉంటుంది. ఉరి వేసుకొని చనిపోయిందని పోలీసులు కేస్ క్లోజ్ చేస్తారు. కానీ సుబ్బు తన అన్న, తండ్రి కలిసి చంపేశారని నమ్ముతాడు. డోరతి చనిపోయిన దగ్గర్నుంచి సుబ్బు ఒంటరిగా అయిపోతాడు.

అదే సమయంలో అనుకోకుండా సుబ్బు మీద దాడి, సుబ్బు కోసం కార్తీ ఒకర్ని చంపడంతో జాగ్రత్త కోసం కార్తీని వేరే రాష్ట్రానికి పంపిస్తారు. ఓ రోజు సడెన్ గా సుబ్బు అమ్మాయిలా మారడంతో ఇంట్లో వాళ్ళు దాడి చేయాలని ప్రయత్నిస్తే ఇంట్లోంచి పారిపోతుంది. మరి సుబ్బు పూర్తి హిజ్రాలా మారుతాడా? ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని సుబ్బు కుటుంబం ఏం చేస్తుంది? అసలు డోరతి ఎలా చనిపోయింది? బెస్ట్ ఫ్రెండ్ సుబ్బు అలా మారడాన్ని చూసి కార్తీ ఏం చేస్తాడు? చిన్నప్పట్నుంచి అబ్బాయిగా ఉన్న సుబ్బు ఒక్కసారిగా అమ్మాయిగా ఎందుకు మారాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Dont Trouble the Trouble Review: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ రివ్యూ.. పిల్ల దయ్యాన్ని హీరో కిడ్నాప్ చేస్తే..

సినిమా విశ్లేషణ..

కొంత మంది తమిళ దర్శకుల సినిమాలు అంటే కులం, వివక్షలు, సమాజంలో అంగీకరించని కొన్ని సంఘటనలపై సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. హిజ్రాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు హిజ్రాగా మారడం అనేది కొత్త పాయింట్ గా రాసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే రా & రస్టిక్ గా, పూర్తి తమిళనాడు నేటివిటీలో ఉంటాయి. తమిళ్ లో డోరతి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా LGBTQ వివాదంలో నిలవడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. దీంతో తమిళ్ లో ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా తమ ప్రయోగం తెలుగులో సక్సెస్ అవుతుందేమో అని భావించి ఇక్కడ రిలీజ్ చేసారు.

ఫస్ట్ హాఫ్ అంతా సుబ్బు, కార్తీ ఇద్దరు చిన్నప్పట్నుంచి క్లోజ్ గా ఉండటం, సరదా పనులు చేయడం, ఊళ్ళో ఘటనలు, సుబ్బు ఫ్యామిలీ గురించి సాగుతుంది. అక్కడక్కడా కామెడీతో నడిచి డోరతి ఎంట్రీతో కథ ఆసక్తిగా మారుతుంది. డోరతి వచ్చినదగ్గర్నుంచి సుబ్బు అమ్మాయిగా నటించడం చూసి ప్రేక్షకులు చిన్నప్పుడు ర్యాష్ గా ఉండేవాడు ఇలా అయిపోయాడేంటి అనే సందేహాలతో, క్యూరియాసిటీతో చూస్తారు. డోరతి చనిపోవడం, ఇంటర్వెల్ కి ఓ మర్డర్ చేయడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సుబ్బు అమ్మయిగా వేషం వేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ స్పందనలు, కార్తీ స్పందనతో, కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగదీశారు.

ఫస్ట్ హాఫ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. అమ్మాయిల ఎమోషన్ చూపించే ప్రయత్నం చేసారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే హీరో తల్లి, డోరతితో తల్లిని చూసుకోవడం, లేడీ ఫ్రెండ్ తో బాధలు చెప్పుకోవడం లాంటి ఎమోషన్స్ బాగానే పండించారు. ఇంటర్వెల్ కాస్త సాగదీశారు. ఇక సెకండ్ హాఫ్ లో సుబ్బు చీరకట్టుకొచ్చి చేసే మాస్ పర్ఫార్మెన్స్ తో మొదలయి కొంత ఫ్లాష్ బ్యాక్ తో, హిజ్రాగా మారిన తర్వాత సుబ్బు కష్టాలు, వాళ్ళ ఫ్యామిలీ, కార్తీ చేసే పనులతో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కొంత ఎమోషన్ వర్కౌట్ అయింది.

హిజ్రాలుగా మారడం, ఎలా మారతారు, చేసే పూజలు, ఉత్సవం.. ఇవన్నీ బాగా చూపించారు. సుబ్బు హిజ్రా గా మారాక కార్తీ తో కొంత ట్రావెలింగ్, వారి మధ్య ఉండే సీన్స్ సరదాగా అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంది. డోరతి అసలు ఎలా చనిపోయింది? చంపితే ఎందుకు చంపారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ కి మంచి ఎమోషన్ తో ముగించినా మళ్ళీ క్లైమాక్స్ లో అక్కర్లేని సీన్స్ తో సాగదీశారు. ఆ క్లైమాక్స్ సీన్స్ చూసి దర్శకుడికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అనుకోవడం గ్యారెంటీ. ఈ కథంతా 1990s బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కాసేపే కనిపించి వెళ్లిన డోరతి పాత్రని టైటిల్ గా ఎందుకు పెట్టారు అనేది జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు. ప్రయోగాత్మక సినిమాలు చూసేవాళ్ళు డోరతిని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

కీర్తి సురేష్ డోరతి పాత్రలు కాసేపే కనిపించినా క్యూట్ గా సింపుల్ గా బాగానే మెప్పించింది. అబ్బాయిగా, హిజ్రాగా సనంత్ అదరగొట్టేసాడు పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ మొత్తం సనంత్ అమ్మాయి లక్షణాలు ఉన్న అబ్బాయిగా పర్ఫార్మెన్స్ పీక్స్. సెకండ్ హాఫ్ మొత్తం తన భుజాలపై మోశాడు. రిషికాంత్ కూడా తన పర్ఫార్మెన్స్ తో, సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో బాగా మెప్పించాడు. రామచంద్రన్ దొరైరాజు, మిగిలిన తమిళ నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Premane Oorilo Review : ‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. కన్నడ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు తెలుగులో.. సాంగ్స్ సూపర్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ రా & రస్టిక్ గా బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో మంచి విజువల్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఒక డేరింగ్ కథని సింపుల్ స్క్రీన్ ప్లే తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘డోరతి’ సినిమా చిన్నప్పట్నుంచి అబ్బాయిగా పెరిగి సడెన్ గా హిజ్రాగా మారితే అతని కుటుంబం, అతని బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.