The Paradise Review : ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ.. జడల్ పాత్రలో నాని వైలెన్స్ ఎలా ఉంది..?
The Paradise Movie Review : ఇన్నాళ్లు ఫ్యామిలీ హీరోలా మెప్పించిన నాని ఇటీవల యాక్షన్ హీరోగా మారుతున్నాడు.
Nani The Paradise Movie Review Rating
The Paradise Review : నాని, కయదు లోహర్ జంటగా తెరకెక్కిన సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24 రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
ఈ కథ 1940ల్లో మొదలయి 80 ల్లో ముగుస్తుంది. ఎక్కడ్నుంచో వచ్చి ప్యారడైజ్ అనే ప్రాంతంలో స్థిరపడతారు సవారీల జాతి. వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నా వాళ్లకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండదు. ప్యారడైజ్ ప్రాంతాన్ని, సవారీలను తన గుప్పిట్లో ఉంచుకొని చాలా దారుణాలు చేస్తూ ఉంటాడు శికంజా మాలిక్(మోహన్ బాబు, అతని కొడుకు(రాఘవ్ జుయల్). సమ్మక్క(సోనాలి కులకర్ణి) సవారీల గుర్తింపు కోసం పోరాడుతూ ఉంటుంది.
సమ్మక్క కొడుకు జడల్(నాని) చిన్నప్పుడే ఓ సంఘటనతో జైలుకు వెళ్లి 14 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తాడు. జడల్ కి చిన్నప్పట్నుంచి అమ్మ అంటే ఇష్టం ఉండదు. అసలు జడల్ జైలుకు ఎందుకు వెళ్తాడు? అతని చేతిపై ఉన్న ఆ పచ్చబొట్టు, జడలు కథేంటి? తల్లి అంటే ఇష్టపడని వాడు తల్లి చేసే పోరాటం కోసం, సవారీల కోసం ఎలా నిలబడతాడు? శికంజా మాలిక్, అతని మనుషులను జడల్ ఎలా ఎదిరిస్తాడు? మధ్యలో సుబ్బు(కయదు లోహర్) తో ప్రేమ కథేంటి? జడల్ సవారీలకు గుర్తింపు తీసుకొస్తాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
నాని ఇటీవల ఫ్యామిలీ హీరో నుంచి మెల్లిమెల్లిగా యాక్షన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 నాని కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ అనుకుంటే దాన్ని మించిన వైలెన్స్ తో ది ప్యారడైజ్ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా నుంచి రెండు జడలతో నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ఆసక్తి నెలకొంది. ఇక చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబు మెయిన్ విలన్, సంపూర్ణేష్ బాబు మొదటిసారి యాక్షన్ రోల్ చేయడంతో పాటు, రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా రిలీజ్ చేయకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఓపెనింగ్ జైలు ఫైట్ సీన్ తో అదిరిపోయే యాక్షన్ సీన్ తో మొదలు పెట్టారు. చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ తో, నాని కి ఎలివేషన్స్ ఇస్తూ, మోహన్ బాబు పాత్ర క్రూరత్వాలతో, హై యాక్షన్ సీక్వెన్స్ లతో సాగుతుంది. మధ్యలో లవ్ ట్రాక్ కొంత గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి అదిరిపోయే సీన్స్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా జడల్ చేసే పోరాటంతో సాగుతుంది. క్లైమాక్స్ కూడా మంచి ముగింపు ఇచ్చారు.
అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు లేని మనుషుల కోసం పోరాటం చేయడం గతంలో అనేక సినిమాల్లో చూసాము. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే. కాకపోతే కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తదే. స్క్రీన్ ప్లేలో కథని ఆరు చాఫ్టర్స్ గా చెప్పారు. మాములు స్క్రీన్ ప్లే తో ఈ కథ చెప్పొచ్చు కానీ దర్శకుడు అలా చెప్పాలనుకున్నాడేమో. ఇటీవల వచ్చిన టాక్సిక్ సినిమాలో అక్క ఎమోషన్ కోసం వాడిన పాయింట్ ఇక్కడ తల్లి పాత్రలో చూపించారు. ఈ సినిమాలో చూపించిన తల్లి ఎమోషన్ కూడా చాలా సినిమాల్లో ఉన్నదే. కానీ ఆ ఎమోషన్ ని బాగా పండించాడు దర్శకుడు. ఇక హీరోయిన్ పాత్రకు అలాంటి బ్యాక్ డ్రాప్ పెట్టాలన్న ఆలోచన దర్శకుడికి ఎందుకు వచ్చిందో. కథకు, ఆ బ్యాక్ డ్రాప్ కి ఎలాంటి సంబంధం ఉండదు. కేసీఆర్ పాత్రని పోలి ఉన్న రాజకీయ నాయకుడి పాత్ర సీన్స్ కూడా బాగానే ఉన్నాయి.
అయితే సినిమాలో యాక్షన్ తో పాటు హింస ఎక్కువగా చూపించారు. సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని వైలెన్స్ సీన్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. పిల్లలతో కలిసి చూడలేము ఈ సినిమాని. నాని ని ఒక కొత్త రూపంలో చూడాలి, హెవీ యాక్షన్, హింస చూడాలి అంటే ది ప్యారడైజ్ చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇన్నాళ్లు ఫ్యామిలీ హీరోలా మెప్పించిన నాని ఇటీవల యాక్షన్ హీరోగా మారుతున్నాడు. ఈ సినిమాతో పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా మారిపోయాడు అని చెప్పొచ్చు. రెండు జడలు, పర్ఫెక్ట్ జిమ్ బాడీతో, ముక్కుపుడకలు, గొలుసులు, స్పెషల్ డ్రెస్సులతో ఒక సరికొత్త లుక్ లో కనపడటమే కాక యాక్టింగ్ కూడా అదరగొట్టేసాడు. ఈ సినిమా కోసం జడలు వేసుకొని చాలానే ఇబ్బంది పడ్డాడు, కష్టపడ్డాడు అని తెలుస్తుంది. జడల్ పాత్ర కోసం నాని ప్రాణం పెట్టి పనిచేసాడు.
కయదు లోహర్ ఓ కొత్త పాత్రలో కనిపించి అందాలతో అలరిస్తూ నటనలో కూడా మెప్పించింది. బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో సోనాలికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత పూర్తి నెగిటివ్ పాత్రలో విలనిజం చూపిస్తూ అదరగొట్టారు. కిల్ సినిమాతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఇందులో నెగిటివ్ షేడ్స్ తో మెప్పించాడు. ఇప్పుడిప్పుడే నటిగా, హీరోయిన్ గా ఎదుగుతున్న విషిక కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో మెప్పించింది. ఇక సంపూర్ణేష్ బాబు మొదటిసారి కామెడీ కాకుండా సరికొత్త యాక్షన్ రోల్ లో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత సంపూర్ణేష్ బాబుకు వచ్చే పాత్రలు మారడం ఖాయం. ఈశ్వరరావు, ప్రియదర్శి.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : The Paradise First Review : ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా టాక్ ఏంటి.. ఇంటర్వెల్ మాత్రం..
సాంకేతిక విశ్లేషణ..
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా ప్లస్ అయ్యాయి. ప్రతి విజువల్ కొత్తగా డార్క్ కలర్ ప్యాలెట్ లో చూపించారు. ఇక అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు సినిమా రిలీజ్ కి ముందే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్యారడైజ్ అనే ఓ కొత్త ప్రపంచం సృష్టించడానికి బాగా కష్టపడ్డారు.
ఫైట్ మాస్టర్స్ కూడా యాక్షన్ సీక్వెన్స్ లలో కొత్తదనం కోసం బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. హీరోయిన్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. కథ పాతదే అయిన కొత్త కథనంతో కొత్త ప్రపంచం సృష్టించి సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
మొత్తంగా ‘ది ప్యారడైజ్’ ఓ కొత్త ప్రపంచంలో సవారీల జాతి గుర్తింపు కోసం జరిగే యాక్షన్ ఎమోషనల్ కథ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ &రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
