Isakapatnam Review : ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. తండ్రి కూతుళ్ళ యుద్ధం..
ఏడు ఎపిసోడ్స్ తో అమెజాన్ ప్రైమ్ లో ఈ తెలుగు వెబ్ సిరీస్ ఇసకపట్నం వచ్చింది. (Isakapatnam Review)
- Saketh U
- Updated on- July 2, 2026 / 07:38 AM IST
Isakapatnam Review
Isakapatnam Review : సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మాణంలో గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో 7 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ తెరకెక్కింది. సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు జూలై 2 నుంచి ఇసకపట్నం వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే..
పోర్ట్, మత్స్యకారులతో ఇసకపట్నం అనే సముద్రం ఒడ్డున ఉండే ఊరు. 1985లో ఎక్కడ్నుంచో ఉద్యోగం కోసం వచ్చిన నాయుడు(సముద్రఖని) ఇసకపట్నంకి పెద్ద దిక్కైన చిన్నారావు(రాజీవ్ కనకాల) దగ్గర చేరి ఓ జాతరలో అందరి ముందు అతన్ని నరికేసి నాయుడు ఇసకపట్నంకు లీడర్ అవుతాడు. 15 ఏళ్ళ తర్వాత అప్పటికే ఇసకపట్నం మొత్తం నాయుడు, అతని మనుషుల చేతుల్లో ఉంటుంది.
దాన్ని దక్కించుకోవాలని బర్మా నుంచి వలస వచ్చిన పోతన(జ్వాలా కోటి), పక్క ఊరు జమిందార్ ప్రతాప్ వర్మ(రవివర్మ) ట్రై చేస్తూ ఉంటారు. నాయుడుని ఎలాగైనా సాక్షాలతో పట్టుకోవాలని కొత్తగా వచ్చిన SI(సునీల్) ట్రై చేస్తాడు. అయితే నాయుడు కూతురు భారతి(ఐశ్వర్యరాజేష్)తండ్రికి వ్యతిరేకంగా పనిచేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. భారతి నాయుడు దగ్గర డ్రైవర్ గా పనిచేసే సూరి(సుధాకర్ కోమాకుల)తో ప్రేమలో ఉంటుంది. భారతి కూడా తన తండ్రిని నాశనం చేసి ఆయన కుర్చీలో కూర్చోవాలని అనుకుంటుంది కానీ నాయుడు ప్రతాప్ వర్మతో భారతి పెళ్లి చేస్తాడు.
అదే ఊళ్ళో ఉండే ఓ మంచి ఆటోడ్రైవర్ పెద్దన్న(నరేష్ అగస్త్య) ఎలాగైనా నాయుడు మనుషులను ఎదురించి కార్పొరేట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇసకపట్నం అనే ఊరికి లీడర్ కావాలని అందర్నీ చంపుకుంటూ, భయపెట్టి పైకి వచ్చిన నాయుడుని ఎవరు ఓడిస్తారు? ఇసకపట్నంకు కొత్త లీడర్ ఎవరు అవుతారు? పెద్దన్న కార్పొరేటర్ అవుతారా? భారతి ఎందుకు తండ్రికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? భారతి – సూరి ప్రేమ కథ ఏమైంది? ఇసకపట్నం కుర్చీ కోసం వీళ్ళ పోరులో సామాన్య జనాలు పడ్డ ఇబ్బందులు ఏంటి? నాయుడుకు నమ్మకంగా ఉండే కోటయ్య(బెనర్జీ)- అతని కొడుకు శేఖర్(రాజా చేంబోలు) కథేంటి? SI ఏం చేసాడు.. ఇవన్నీ తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
Also Read : Theaters Percentage War : థియేటర్స్ పర్సంటేజ్ వార్.. మరోసారి కార్యాచరణ ప్రిపేర్ చేసే పనిలో ఎగ్జిబిట్లరు!
సిరీస్ విశ్లేషణ..
ఏడు ఎపిసోడ్స్ తో అమెజాన్ ప్రైమ్ లో ఈ తెలుగు వెబ్ సిరీస్ ఇసకపట్నం వచ్చింది. ఒక ఊరు, ఆ ఊరి ఆధిపత్యం కోసం జరిగే తండ్రి కూతుళ్ళ యుద్ధం కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. మొదటి ఎపిసోడ్ లో అన్ని పాత్రల పరిచయంతో సాగుతుంది. రెండు, మూడు, నాలుగు ఎపిసోడ్స్ కొంచెం సాగదీశారు. మూడు, నాలుగు ఎపిసోడ్స్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందని ప్రతి సీన్ చెప్పేయొచ్చు. ఐదో ఎపిసోడ్ లో భారతి చేసిన ఓ పనితో సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. చివరి మూడు ఎపిసోడ్స్ లో ఎవరు ఏ ఎత్తు వేస్తున్నారు? ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠతో సాగుతుంది.
అయితే క్లైమాక్స్ ఏంటో మొదటి నుంచి ఊహించేయొచ్చు కాకపోతే ఎలా జరుగుతుంది అనే ఆ కథనం కాస్త ఆసక్తిగా నడిపించారు. క్లైమాక్స్ లో రెండు ట్విస్టులు ఆసక్తిగా ఉన్నా ఓ ట్విస్ట్ ఊహించేయొచ్చు. అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ఆసక్తిగా సాగే సీన్స్ లో ఎలివేషన్స్ ఇద్దామని ట్రై చేసి భారీ డైలాగ్స్ సాగదీస్తూ చెప్పించారు. వెబ్ సిరీస్ అంటే ఈ మధ్య సాగదీతే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో కూడా చిన్న సీన్స్ ని కూడా సాగదీసి చూపించారు. అధికారం కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు అనేది బాగా సాగుతుంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. చాలా పాత్రలు వాటి చుట్టూ ఉండే లింక్స్ కూడా బాగానే రాసుకున్నారు. ఇలాంటి సిరీస్ ని కాస్త పవర్ ఫుల్ గా చూపించొచ్చు. మంచి కథ, సన్నివేశాలు ఉన్నా అవి పవర్ ఫుల్ గా, వావ్ అనేలా అనిపించవు. కన్నీళ్లు తెప్పించాల్సిన ఎమోషన్స్ ని కూడా సరిగ్గా పండించలేదు. భారతి ఫ్లాష్ బ్యాక్, తండ్రికి ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది ఇంకాస్త క్లారిటీ, ఎమోషన్ ఇస్తే బాగుండేది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇప్పటికే అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో సముద్రఖని మెప్పించాడు. ఈ సిరీస్ లో కూడా ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న నాయకుడిగా సముద్రఖని తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. వరుస సినిమాలతో మెప్పిస్తున్న తెలుగు నటి ఐశ్వర్య రాజేష్ ఒక సీరియస్ పాత్రలో కొత్తగా కనిపిస్తుంది. నరేష్ అగస్త్య ఎదురు తిరిగే ఓ సాధారణ వ్యక్తిగా కాస్త పవర్ ఫుల్ రోల్ లో మెప్పిస్తాడు. నరేష్ భార్య పాత్రలో మలయాళ నటి మెరిన్ ఫిలిప్ పర్వాలేదనిపిస్తుంది.
సీనియర్ నటుడు బెనర్జీకి చాన్నాళ్ల తర్వాత విలన్ పక్కనే ఫుల్ లెంగ్త్ లో ఉండే ఓ మంచి పాత్ర పడింది. సుధాకర్ కోమాకుల కూడా చాన్నాళ్ల తర్వాత కనిపించి ఐశ్వర్య రాజేష్ లవర్ పాత్రలో బాగానే నటించాడు. జ్వాలా కోటి కూడా బాగా నటించాడు. పోలీస్ పాత్రలో సునీల్ ఏదో చేసేస్తాడు అని సీరియస్ పాత్రలో కనిపించినా ఆ పాత్ర సింపుల్ గానే ఉంటుంది. రాజా చెంబోలు, రవి వర్మ, రాజీవ్ కనకాల, రోహిణి.. పలువురు నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also See : Pavithra Puri : దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఫోటోలు వైరల్..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో ఇంకా పవర్ ఫుల్ గా ఇస్తే బాగుండేది. అమ్మవారిపై వచ్చే ఒక సాంగ్ బాగుంది. ఒక ఊరి అధికారం, అక్కడ వచ్చే డబ్బు కోసం పలువురు పోటీ పడటం అనే రొటీన్ కథని తండ్రి – కూతురు మధ్య నడిపించి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో అక్కడక్కడా సాగదీస్తూ తెరకెక్కించాడు దర్శకుడు. పోర్ట్, జెట్టి, కొన్ని సెట్స్.. వీటి కోసం ఆర్ట్ డైరెక్టర్ మాత్రం బాగా వర్క్ చేసారు. నిర్మాణ పరంగా సిరీస్ కి బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ఇసకపట్నం’ తండ్రి కూతుళ్ళ మధ్య ఓ ఊరి మీద ఆధిపత్యం కోసం సాగే వెబ్ సిరీస్. ఈ సిరీస్ కి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ విశ్లేషణ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
