Korean Kanakaraju Review : ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ.. వరుణ్ తేజ్ అదరగొట్టాడుగా.. హిట్ కొట్టాడా మరి?

వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. (Korean Kanakaraju Review)

  • Updated on- August 7, 2026 / 12:34 AM IST

Korean Kanakaraju Review

Korean Kanakaraju Review : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాణంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొరియన్ కనకరాజు సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు

కథ విషయానికొస్తే..

కొరియాలో ఓ వ్యక్తి చనిపోగా అతని అస్థికలు ఓ సీసాలో భద్రపరుస్తారు. అనుకోకుండా ఆ సీసా చేతులు మారుతూ పెనుగొండకు వస్తుంది. కనకరాజు(వరుణ్ తేజ్) పెనుగొండలో ఓ భజన బృందం నడుపుతూ, ఫోటోగ్రాఫర్ అయిన తన ఫ్రెండ్ కృష్ణప్ప(సత్య)తో తిరుగుతూ ఉంటాడు. ఆ ఊళ్ళో ఉన్న చెంగారెడ్డి(సునీల్), అతని మనుషులతో కనకరాజుకు గొడవలు ఉంటాయి. పెనుగొండ కియా కంపెనీలో పనిచేసే చైత్ర(రితిక నాయక్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు కనకరాజు. కొరియన్ కంపెనీ కావడంతో కియా కంపెనీలో చాలా మంది కొరియన్స్ ఉంటారు.

చైత్ర ఎప్పటికైనా కొరియాకి వెళ్లాలనుకుంటుంది. ఓ రోజు కనకరాజు చెంగారెడ్డి మనుషులతో గొడవపడుతూ అనుకోకుండా ఆత్మ ఉన్న సీసా మూత తీసి అందులో మందు పోసుకొని తాగుతాడు. దాంతో అందులో ఉండే ఆ కొరియా ఆత్మ కనకరాజు శరీరంలోకి వస్తుంది. ఆ ఆత్మ వచ్చాక కనకరాజు ఎలా మారతాడు? చైత్ర, ఆ ఆత్మ, కనకరాజు, సత్య కొరియాకు ఎలా వెళ్తారు? అసలు ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? కొరియాలో అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? కొరియాకు వెళ్ళాక అక్కడ వీరికి ఎదురైన సంఘటనలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Korean Kanakaraju First Review: ‘కొరియన్‌ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా వరుణ్ తేజ్ హిట్ కొడతాడా..?

సినిమా విశ్లేషణ..

వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. సత్య కామెడీ కూడా ఉండటంతో ఈసారి వరుణ్ హిట్ కొడతాడని అంత ఫిక్స్ అయ్యారు. ఒక ఆత్మ ఎక్కడ్నుంచో వచ్చి ఒకరి శరీరంలోకి దూరడం, తన ప్లేస్ కి వెళ్లడం.. లాంటి కథ చాలా పాతదే. కానీ దానికి పెనుగొండ, కొరియా బ్యాక్ డ్రాప్ తీసుకొని కొత్తగా రాసుకున్నారు.

ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ పాత్రల పరిచయాలు, హీరో హీరోయిన్ వెంట పడటం, హీరోయిన్ కొరియా ఇష్టాలు, ఊళ్ళో హీరో గొడవలతో సాగుతుంది. కొరియన్ ఆత్మ హీరో శరీరంలోకి వచ్చిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి వీళ్ళు కొరియా వెళ్ళాక అక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ హీరోలో ఆత్మ చేసే పనులు, అతన్ని ఎవరు చంపారు అని వెతకడం, కనకరాజు ఆత్మని ఎలా వదిలించుకోవాలి అనే సీన్స్, మధ్యలో కొన్ని కామెడీ ట్రాక్స్, చివర్లో ఓ ట్విస్ట్ తో సాగుతుంది.

ఫస్ట్ అరగంట రొటీన్ గా పాత్రల పరిచయాలు, ఫైట్స్ తో, అక్కర్లేని ఓ పాటతో కాస్త సాగదీశారు. హీరో శరీరంలో ఆత్మ ఎంటర్ అయిన దగ్గర్నుంచి సత్య చేసే కామెడీతో నవ్విస్తూనే, ఆత్మ కనకరాజు శరీరంలో ఉండి చేసే యాక్షన్ సీన్స్ తో కథపై ఆసక్తి కలిగించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ట్రైలర్ లో లీడ్ ఇచ్చేసినా ఆ యాక్షన్ సీన్ తో సెకండ్ హాఫ్ పై హైప్ ఇస్తారు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ హిలేరియస్ గా నవ్వుకుంటాం. మధ్యలో బుల్లిరాజు కామెడీ ట్రాక్ తో సాగదీశారు అనిపిస్తుంది. చివర్లో ఇచ్చే ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ లో సింపుల్ గా ఎమోషన్ తో ఎండ్ చేసే ఆస్కారం ఉన్నా అక్కర్లేని సిల్లీ సీన్స్ తో ఊహించని ఓ క్లైమాక్స్ తో ముగించడం నిరాశ కలిసాగిస్తుంది. సినిమా అంతా బాగా నడిపించి, నవ్వించి, యాక్షన్ తో మెప్పించి చివర్లో ఏంటి ఇలా సిల్లీగా చేసారు అనిపిస్తుంది. డివోషనల్ టచ్ లేకుండా క్లైమాక్స్ వేరే వర్షన్ రాసుకోవాల్సింది. చాలా చోట్ల కొరియన్ డైలాగ్స్ ఉంటాయి. కొన్నిటికి తెలుగులోనే డైలాగ్స్ చెప్పారు కానీ కొన్ని అలాగే వదిలేసారు. వాటికి తెలుగు సబ్ టైటిల్స్ అయినా వేయాల్సింది.

సత్య కామెడీ ట్రాక్స్ కి మాత్రం ఫుల్ గా నవ్వుకుంటాం. కొరియాకు సంబంధించిన సీన్స్, హీరోయిన్ పాత్ర సెటప్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సీరియస్ గా ఆత్మను పోగొట్టడానికి చేసే పూజలు కూడా సిల్లీగా కామెడీగా రాసుకోవడం విడ్డూరం. ఈ సినిమాకు పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫుల్ గా నవ్వుకోడానికి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు ఈ సినిమాని.

నటీనటుల పర్ఫార్మెన్స్..

వరుణ్ తేజ్ రెండు వేరియేషన్స్ తో నటన పరంగా అదరగొట్టాడు. కొరియన్ గ్యాంగ్ స్టర్ లుక్ లో స్టైలిష్ గా కొత్తగా కనిపించాడు. ఆ పాత్ర కోసం బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది. రితిక నాయక్ క్యూట్ గా కనిపిస్తూనే కొరియా అంటే ఇష్టం ఉండే పాత్రలో బాగా మెప్పించింది. సత్య ప్రతి సీన్ లోనూ ఫుల్ గా నవ్వించాడు. సినిమాకు సత్య చాలా ప్లస్ అయ్యాడు. చాలా వరకు సత్యనే సినిమాని నడిపించాడు. మురళీధర్ గౌడ్ అక్కడక్కడ బాగా నవ్వించారు.

విలన్ పాత్రలో కొరియా నటుడు బాగానే నటించాడు. అవసరాల శ్రీనివాస్ గెస్ట్ పాత్రలో మెప్పించాడు. చాలా మంది కొరియన్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటించి బాగానే మెప్పించారు. చిన్నా, తులసి, సునీల్, టెంపర్ వంశీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వలేదనిపించారు.

Also Read : Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రేపే రిలీజ్.. హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొరియా బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ మరింత స్టైలిష్ గా ఉన్నాయి. పాటలు అన్నీ పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పెనుగొండ, కియా కంపెనీ, కొరియా లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొదట్లో, సెకండ్ హాఫ్ బుల్లిరాజు ట్రాక్స్ కొంత ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. కామెడీ పంచ్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. పాత కథే అయినా కొరియా బ్యాక్ డ్రాప్ లో కొత్త కథనంతో రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘కొరియన్ కనకరాజు’ ఓ కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ పెనుగొండలో ఉండే కనకరాజు అనే వ్యక్తి శరీరంలోకి వస్తే ఏం జరిగింది అని కామెడీ యాక్షన్ తో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.