Maremma Reivew: ‘మారెమ్మ’ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడు కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఎలా ఉందంటే?
Maremma Movie Review: రవితేజ తమ్ముడు రఘు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ బాగుండటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రవితేజ రావడంతో సినిమాపై కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి.
- Saketh U
- Updated on- September 9, 2026 / 11:33 PM IST
Maremma Reivew
Maremma Reivew: రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘మారెమ్మ’. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మాణంలో మంచాల నాగరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ నటి దీప బాలు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. మారెమ్మ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్ షోలు వేశారు.
కథ విషయానికొస్తే..
మహిషాపురంలో మారెమ్మ అనే గ్రామ దేవత ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వర్షాలు, వ్యాధులు వచ్చి ఊరు నాశనమవుతుంటే అమ్మవారిని కాపాడమని కోరుకుంటారు. ఏం చేసినా శాంతించని అమ్మవారు ఓ దున్నపోతుని బలి ఇవ్వడంతో సమస్యలు తీరిపోతాయి. దీంతో ప్రతి పదేళ్లకు ఒకసారి దున్నపోతుని బలి ఇచ్చి జాతర చేయమని ఓ స్వామిజి చెప్తాడు. అలా కొన్నేళ్ల తర్వాత అమ్మవారికి బలి ఇవ్వాల్సిన దూడ పుడుతుంది. ఆ దూడని పెంచే బాధ్యత తీసుకున్న ఐలయ్య చనిపోవడంతో అతని కొడుకు కర్ణి దూడ(మారి)ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. కర్ణి(మాధవ్), ఆ దూడ ఇద్దరూ ఎదుగుతారు. దూడ కాస్తా దున్నపోతు అవుతుంది.
కర్ణి, అతని మరదలు మంజు(దీప బాలు)చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. కానీ కబడ్డీలో కర్ణి తనని ఓడించాడని డబ్బున్న పక్క ఊరి ఉత్తమ్(మనీష్) మంజుని పెళ్లి చేసుకోడానికి సంబంధం ఓకే చేయించుకుంటాడు. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనతో పక్కూరి జలంధర్(వికాస్ వశిష్ట) ఆ దున్నపోతుని చంపాలని పగతో ఉంటాడు. ఓ నాలుగు రోజుల్లో జాతర ఉందనగా దున్నపోతు కనిపించకుండా పోతుంది. మరి జాతర సమయానికి ఆ దున్నపోతు దొరుకుతుందా? జలంధర్ పగ ఏంటి? మంజు – కర్ణి ప్రేమకథ ఏమవుతుంది? దున్నపోతు మిస్ అవ్వడంతో ఊరివాళ్లంతా కర్ణిని ఏం చేస్తారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Ranabaali Teaser : ‘రణబాలి’ టీజర్ వచ్చేసింది.. సింగనమల బొబ్బిలిగా విజయ్ దేవరకొండ అదరగొట్టాడుగా..
సినిమా విశ్లేషణ..
రవితేజ తమ్ముడు రఘు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ బాగుండటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రవితేజ రావడంతో సినిమాపై కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి. అమ్మవారికి బలి ఇవ్వాల్సిన ఒక దున్నపోతు కనిపించకుండా పోతే ఏమైంది అనేదే కథ. గతంలో ఇదే కథతో పొట్టేలు అనే సినిమా వచ్చింది. అక్కడ పొట్టేలు, ఇక్కడ దున్నపోతు అంతే తేడా. ఈ మారెమ్మ కంటే ఆ పొట్టేలు కాస్తో కూస్తో బెటర్ అనిపిస్తుంది సినిమా చూశాక. పొట్టెల్ సినిమా ల్యాగ్ ఉన్నా ఎమోషన్, సస్పెన్స్ పండాయి. ఈ సినిమాలో ల్యాగ్ ఉండటమే కాక ఎమోషన్ పండలేదు, సస్పెన్స్ లేదు. దర్శకుడు ఆ సినిమా చూడలేదు లేక దాన్నుంచే ప్రేరణగా రాసుకున్నాడో..
ఫస్ట్ హాఫ్ AI విజువల్స్, వాయిస్ ఓవర్ తో ఊరి గురించి, దున్నపోతు గురించి చెప్పి కథలోకి వెళ్తారు. హీరో పాత్ర చిన్నప్పుడు దూడకు ఎలా దగ్గరయింది అని ఓ పాటతో సాగదీశారు. హీరో కబడ్డీ సీన్, హీరో – హీరోయిన్ మధ్య ఓ లవ్ సీన్, విలన్ పాత్ర, హీరోయిన్ కి పెళ్లి సెట్ అవ్వడం, ఊళ్ళో మనుషులు, సంఘటనలు, విలన్ పాత్ర దున్నపోతుని చంపడానికి క్షుద్రపూజలు చేసే ఓ మహిళ సహాయం తీసుకోవడం… ఇలా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ కి దున్నపోతు మిస్ అవ్వకపోయినా మిస్ అవుతుంది అనే క్లారిటీ ఇచ్చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా దున్నపోతు కోసం వెతకడంతో బాగా సాగదీశారు. ఊరి జాతర, మధ్యలో హీరోయిన్ సీన్స్, విలన్ సీన్స్ తో నడిపించారు.
చాలా చోట్ల అక్కర్లేని సీన్స్ మధ్యమధ్యలో వస్తూ ఉంటాయి. అక్కడక్కడా కామెడీ ట్రై చేసారు కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ కథ, కథనంతో ముక్కలు ముక్కలు సీన్స్ తీసి అతికించినట్టు ఉంటుంది. ఎక్కడా దున్నపోతు – హీరో మధ్య ఎమోషన్ పండలేదు. పైగా క్లైమాక్స్ ఒకటి చెప్పి చివర్లో దానికి వ్యతిరేకంగా వాయిస్ ఓవర్ చెప్పడం గమనార్హం. చూపించిన క్లైమాక్స్ కి చెప్పిన మెసేజ్ కి సంబంధమే లేదు. క్లైమాక్స్ చాలా సింపుల్ గా తేల్చేసారు. చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. ఇక సినిమా అంతా తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథ. పాపం చాలామంది తెలంగాణ యాస మాట్లాడటానికి చాలా కష్టపడ్డారు. కొంతమంది తెలంగాణ యాస, కొంతమంది మాములుగా మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ ఊళ్ళల్లో ఉండే గ్రామదేవత కల్చర్ మాత్రం కొంతవరకు బాగానే చూపించగలిగారు. డివోషనల్ కథగా సినిమాని మలచాలి అనుకున్నారు కానీ ఆ డివోషన్ ఎమోషన్ కూడా సరిగ్గా పండలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ ఎక్కడా మెయిన్ లీడ్ గా అనిపించడు. అసలు మాధవ్ హీరోనా లేక గెస్ట్ పాత్రో అర్ధం కాదు. మాధవ్ పై తప్ప అందరి చుట్టూ కథ నడిపించారు. క్లైమాక్స్ తప్ప ఎక్కడా మాధవ్ కి క్లోజ్ షాట్స్ పెట్టలేదు. ఎందుకంటే ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా పలకట్లేదు కాబట్టి అని తెలిసిపోతుంది. అక్కడక్కడా హీరోయిన్ పక్కన సిగ్గు పడటం, క్లైమాక్స్ సీన్ తప్ప ఎక్కడా మాధవ్ కష్టపడి నటించాడు అనిపించదు. మాధవ్ నటనలో ఇంకా చాలా మెరుగవ్వాలి. సాంగ్స్, యాక్షన్ సీన్స్ లో కూడా అంతగా పెర్ఫార్మ్ చేయలేదు.
తమిళ నటి దీపా బాలు గ్రామీణ యువతీ పాత్రలో క్యూట్ గా కనిపించి పర్వాలేదు అనిపించింది. రూపాలక్ష్మి చాన్నాళ్ల తర్వాత ఒక కొత్త గెటప్ లో కొత్త పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. వికాస్ వశిష్ట, మనీష్ నెగిటివ్ పాత్రల్లో పర్వాలేదు అనిపించారు. వినోద్ కుమార్ ఊరి పెద్దగా అక్కడక్కడా అజమాయిషీ చూపించారు. కవిత, దయానంద్ రెడ్డి, పటాస్ భాస్కర్, యాదమ్మరాజు, అనిల్ గీలా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు. దున్నపోతు, దూడ మాత్రం కథకు బాగా సహకరించాయి.
Also Read : Anand Deverakonda : వైష్ణవి చైతన్యతో రిలేషన్ షిప్.. క్లారిటీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. అసలు ఒక గ్రామీణ కథ అంటే విజువల్స్ చాలా అందంగా చూపించొచ్చు కానీ ఎక్కడా ఆ అందం కనపడదు. చాలా సీన్స్ కి కలర్ గ్రేడింగ్ చేయలేదు అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్స్ షార్ట్ ఫిలిం సీన్స్ లా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. సినిమాకు కాస్తో కూస్తో ప్లస్ అయ్యాయి అంటే పాటలే. పాటలు వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్, కథకు అడ్డంగా మధ్యలో వచ్చే సీన్స్ కట్ చేస్తే బెటర్. పాత కథ, రొటీన్ కథనం, సీన్స్ తో తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేసారు అని తెలుస్తుంది.
మొత్తంగా ‘మారెమ్మ’ దేవతకు బలి ఇచ్చే దున్నపోతు, దాన్ని కాపలా కాసే వ్యక్తి కథ. ఎమోషన్ పండకుండా సాగదీసిన కథ. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
