Memu Coplam Review : ‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ రివ్యూ.. సలార్ రాజు మిస్సింగ్..

కోడి మిస్సింగ్, కోడి కోసం పోలీసులు వెతకడం అనే కాన్సెప్ట్ ని కామెడీగా చూపించబోతున్నారని టీజర్, ట్రైలర్స్ తో తెలియచేసి ఈ సిరీస్ పై ఆసక్తి పెంచారు. (Memu Coplam)

  • Updated on- May 22, 2026 / 05:21 PM IST

Memu Coplam Review

Memu Coplam Review : నాగ‌బాబు, గెటప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమల ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’. రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాణంలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. రీతూ చౌదరి, కిరీటి, ప్రవీణ్ లక్కరాజు, సిరి పార్వతి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ నేడు మే 22 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే..

మహాదేవపట్నం ఊరిపెద్ద గజపతి రాజు(నాగబాబు). ఆయనకు కోడిపందాలు పిచ్చి. అన్ని పందాలలో తన కోళ్లే గెలుస్తాయి. రాబోయే సంక్రాంతి పందాలకు తన సలార్ రాజు(పందెం కోడి)ని తయారుచేస్తాడు. తన ఇంట్లో పెద్దవాళ్ళని, ఊరి జనాల్ని అందర్నీ పిలిచి పార్టీ ఇస్తాడు గజపతి రాజు. ఆ పార్టీ తర్వాత నుంచి సలార్ రాజు కనిపించకుండా పోతాడు. దీంతో ఈ కేసుని ఆ ఊరి పోలీసులు రవి సొటారి(రవితేజ నన్నిమల)- మోహన్ సొటారి(గెటప్ శ్రీను)లకు అప్పచెప్తారు.

ఈ కోడి మిస్సింగ్ కేసులో గజపతి రాజు శత్రువులు సుధాకర్, మహిపాల్ రెడ్డి, అతని కొడుకు ఆకాష్ ని విచారించడానికి వెళ్తే ఓ వీడియో బయటపడుతుంది. మోహన్, రవి ఈ కేసుని డీల్ చేస్తుంటే ఓ పక్క కొంతమంది రక్తం వాంతులు చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరో పక్క ఊళ్ళో గంజాయి అమ్ముతున్నారని తెలుస్తుంది. మరి మోహన్, రవి ఈ కేసులన్నింటినీ ఎలా డీల్ చేసారు? ఆ వీడియోలో ఏముంది? ఊళ్ళో గంజాయి అమ్మేది ఎవరు? సలార్ రాజు దొరికాడా ? అసలు సలార్ రాజుని తీసుకెళ్లింది ఎవరు? మధ్యలో గజపతి రాజు కూతురు సంఘవి(సిరి పార్వతి)ప్రేమకథేంటీ? ఆ ఊరి లోకల్ టీవీ రిపోర్టర్ మీనాక్షి(రీతూ చౌదరి) ఏం చేసింది.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..

Also Read : Ugly Story Review : ‘అగ్లీ స్టోరీ’ మూవీ రివ్యూ.. వామ్మో ఇదెక్కడి సైకో ప్రేమకథ..

సిరీస్ విశ్లేషణ..

కోడి మిస్సింగ్, కోడి కోసం పోలీసులు వెతకడం అనే కాన్సెప్ట్ ని కామెడీగా చూపించబోతున్నారని టీజర్, ట్రైలర్స్ తో తెలియచేసి ఈ సిరీస్ పై ఆసక్తి పెంచారు. ఇక వెబ్ సిరీస్ లు అంటే బాగా సాగదీస్తారని తెలిసిందే. చిన్న పాయింట్ చెప్పడానికి ఎపిసోడ్ అంతా సాగదీస్తారు. ఇందులో కూడా అక్కర్లేని సాగదీత సీన్స్ చాలానే ఉంటాయి.

గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఎంత పర్సనల్ గా తీసుకుంటారో చూపించారు. సంఘవి – ఆకాష్ ప్రేమకథ, వాళ్ళు ఎలా విడిపోయారు? ఆ తర్వాత సంఘవి – మోహన్ ప్రేమకథలు బాగుంటుయి. కోడిపందాలు ఆపాలని అబ్బా అనే ఓ టీమ్ చేసే పనులతో నవ్వించాలని ప్రయత్నం చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓ పక్క కోడి మిస్సింగ్ కేసు జరుగుతుంటూనే గంజాయి గురించి చెప్పి మరింత ఆసక్తి పెంచారు.

సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ అక్కడక్కడా కామెడీతో నడిపించి మంచి బ్యాంగ్ తో ఎండ్ చేసారు. మూడో ఎపిసోడ్ కొంత ల్యాగ్ ఉంటుంది. నాలుగో ఎపిసోడ్ నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. ఇక కథ అంతా మోహన్ – రవి ఇద్దరు పోలీసుల చుట్టే తిరుగుతుంది. మంచి పోలీస్ అయినా రవిని అందరూ కమెడియన్ గా చూస్తారు. అలాంటి రవి ఊరంతా మెచ్చుకునేలా ఏం చేసాడు అనే ఎమోషన్ బాగా పండించారు.

రవి – మోహన్ పాత్రల మధ్య ఎమోషన్ లాస్ట్ ఎపిసోడ్ లో బాగా వర్కౌట్ అయింది. అయితే కోడిని ఎవరు తీసుకెళ్లారు అనే ట్విస్ట్ సిల్లీగా ఉన్నా ఎవరనేది మాత్రం ఊహించలేము. అది ఈ సిరీస్ కి ప్లస్ అయింది. గంజాయిని ఎలా పట్టుకుంటారు అనే క్లైమాక్స్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇద్దరు పోలీసులతో ఒక ఊళ్ళో జరిగే ఆసక్తికర కథతో అక్కడక్కడా సాగదీస్తూ, అక్కడక్కడా నవ్విస్తూ బాగానే తెరకెక్కించారు ‘మేము కాప్‌లం’ సిరీస్. నెక్స్ట్ సీజన్ కూడా చేసుకునే అవకాశం ఉంది ఈ సిరీస్ కి.

నటీనటుల పర్ఫార్మెన్స్..

గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కామెడీ పోలీస్ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. తమ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. నాగబాబు ఊరిపెద్దగా బాగానే నటించారు. సిరి పార్వతి క్యూట్ గా ప్రతి ఎపిసోడ్ లో కాసేపు కనిపించి మెప్పిస్తుంది. రీతూ చౌదరి రిపోర్టర్ గా అక్కడక్కడా కనిపించి బాగానే మెప్పించింది. కిరీటి, చరణ్ లక్కరాజు, అనంత్ ప్రభు, కమల్, శ్రీధర్ రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Ramani Kalyanam Review : ‘రమణి కళ్యాణం’ మూవీ రివ్యూ.. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రియల్ విలేజ్ లొకేషన్స్ లో తీయడంతో విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా కొన్ని సాగదీత సీన్స్ కట్ చేస్తే బెటర్. ఓ సస్పెన్స్ కథని ఇద్దరు పోలీసులతో కామెడీగా బాగానే తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సిరీస్ కు బాగానే ఖర్చుపెట్టిన్నట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ కోడి మిస్సింగ్ కేసుతో మొదలయి ఊళ్ళో జరిగే సంఘటనలతో సాగిన సస్పెన్స్ కామెడీ కథ. ఒకసారి సరదాగా చూసేయొచ్చు. ఈ సిరీస్ కి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ వెబ్ సిరీస్ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.