Ramani Kalyanam Review : ‘రమణి కళ్యాణం’ మూవీ రివ్యూ.. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..
ట్రైలర్, టీజర్స్ చూడగానే నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ అని తెలిసి సినిమాపై ఆసక్తి నెలకొంది. (Ramani Kalyanam Review)
Ramani Kalyanam Review
Ramani Kalyanam Review : సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా తెరకెక్కిన సినిమా రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మాణంలో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రమణి కళ్యాణం సినిమా మే 22న రిలీజ్ అవుతుండగా ముందురోజే ప్రీమియర్స్ వేశారు. యాంకర్ శ్యామల, శ్రీనివాస్ రెడ్డి, చైతన్య జొన్నలగడ్డ.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే..
సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకుంటుంది. కానీ అన్ని పనులు చేసుకుంటూ కిషోర్(శ్రీనివాస రెడ్డి) పబ్ లో సింగర్ గా పనిచేస్తూ నలుగురు పిల్లలు, ఓ బామ్మతో బతుకుతూ ఉంటుంది. తను బ్లైండ్ అని చెప్పుకోడానికి ఇష్టపడదు. అది అసలు సమస్యే కాదు అన్నంత ధీమాగా బతుకుతుంది సంజన. కిషోర్ ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. వీల్ చైర్ కే అంకితం. సంజన అతనితో అనుకోకుండా గొడవ పడి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.
అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమలో పూర్తిగా మారిపోతాడు. సంజన మరోపక్క ఆర్జేగా కూడా పనిచేస్తుంది. సంజన – రాజ్ తమ ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్దాం అనుకుంటారు. మరి వీళ్ళ పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే అంకితమయ్యాడు? సంజనకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ నలుగురు పిల్లలు ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Purushaha Review : ‘పురుషః’ మూవీ రివ్యూ.. భార్యాబాధితులు చూడాల్సిందే.. నవ్వుకోవాల్సిందే..
సినిమా విశ్లేషణ..
ట్రైలర్, టీజర్స్ చూడగానే నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ అని తెలిసి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ సంజన, రాజ్ పాత్రల పరిచయం, వారు ప్రేమలో పడటంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ ఎమోషన్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా సాగుతుంది. వీళ్ళ పెళ్లి జరుగుతుందా లేదా అనే ఓ టెన్షన్ నెలకొల్పుతారు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించలేము. క్లైమాక్స్ లో మరింత ఎమోషనల్ గా నడిపించారు.
అందరికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని చూపిస్తూ జీవితంలో ఆగిపోకుడదు ముందుకు వెళ్ళాలి అనే ఓ మెసేజ్ చెప్తూనే అలాంటి వాళ్లకు కూడా ఓ మంచి ప్రేమకథ ఉండొచ్చు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రేమకథని క్యూట్ గా చూపించారు. అయితే ఫస్ట్ హాఫ్ బాగా సాగదీశారు. ఇక హీరోయిన్ తో ఉండే నలుగురు పిల్లలు, బామ్మ ఎవరు అనేది అసలు క్లారిటీ ఇవ్వలేదు. హీరోకి ఏదో ఆరోగ్య సమస్య ఉందని చెప్పిందగ్గర్నుంచి స్క్రీన్ ప్లే మళ్ళీ రొటీన్ గా రాసుకున్నారు. క్లైమాక్స్ ఎమోషన్ మాత్రం గతంలో చాలా సినిమాల్లో చూసిందే. రమణి కళ్యాణం అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్..
దీప్షిక చంద్రన్ కళ్లులేని అమ్మాయి పాత్రలో పర్ఫెక్ట్ గా చాలా బాగా నటించింది. నిజంగానే ఈ అమ్మాయికి కళ్ళు లేవేమో అనేంత బాగా నటించింది. సూర్య వసిష్ఠ కూడా సినిమా అంతా వీల్ ఛైర్ లోనే ఉండి నడవలేని పాత్రలో బాగానే నటించాడు. శ్రీనివాస రెడ్డికి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది. ఎప్పుడూ నవ్వించే శ్రీనివాసరెడ్డి ఈ సారి ఎమోషనల్ పాత్రలో మెప్పించాడు. యాంకర్ శ్యామల, లోహిత్ కుమార్, చైతన్య జొన్నలగడ్డ, ప్రభావతి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు యావరేజ్. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలతో ఓ ప్రేమకథ రాసి మెప్పించడం కష్టమే. దీన్ని తెరకెక్కించడానికి దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘రమణి కళ్యాణం’ సినిమా నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ &రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
