MRP Review : ‘ఎంఆర్‌పీ’ మూవీ రివ్యూ.. ఓ శవం కిడ్నాప్ తో ముగ్గురు ఫ్రెండ్స్ పడ్డ బాధలు..

అసలు ఈ MRP సినిమా రిలీజ్ అవుతున్నట్టు జనాలకు ఎక్కువగా తెలీదు. పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. దీని మీద బజ్ కూడా లేదు. (MRP Review)

  • Updated on- July 17, 2026 / 07:07 AM IST

MRP Review

MRP Review : నరేశ్‌ అగస్త్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఎంఆర్‌పీ’. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్ పై శ్రవణ్ జేష్ఠ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. వెన్నెల కిశోర్, సుదర్శన్, డోనాల్ బిస్తీ, కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఎంఆర్‌పీ సినిమా జూలై 17న థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

మనోహర్(నరేష్ అగస్త్య), దూళ్ల రవి(కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు(సుదర్శన్) ఈ ముగ్గురూ కాలేజీ డేస్ నుంచ్చి ఫ్రెండ్స్. ఈ ముగ్గురూ ఓ రోజు SI శంకర్(చైతన్య జొన్నలగడ్డ) దగ్గరకు వచ్చి తమ బిజినెస్ ని ఎవరో పాడు చేసారు అని తమ కథని చెప్పడం మొదలుపెడతారు.

ఈ ముగ్గురూ హైదరాబాద్ లో బ్యాచిలర్ రూమ్ లో ఉంటూ జాబ్స్ చేస్తూ ఉంటారు. మనోహర్ బిజినెస్ పెట్టాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని చేస్తున్న జాబ్ ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో తన గర్ల్ ఫ్రెండ్ అమృత(డోనాల్ బిస్త్)తో గొడవ అయి బ్రేకప్ వరకు వెళ్తుంది. పరమేశ్వరరావు ర్యాపిడో డ్రైవర్ జాబ్ కూడా పోతుంది. దీంతో ఈ ఇద్దరూ కలిసి రవి జాబ్ పోగొడతారు. ఈ ముగ్గురూ కలిసి బిజినెస్ మొదలుపెడదామని ఇంట్లో వాళ్ళను డబ్బులు అడిగితే ఇవ్వరు. దీంతో దైవాజీ(నంద గోపాల్) అనే రౌడీ షీటర్ వద్ద మ్యాగ్నెట్(వెన్నెల కిషోర్) 50 లక్షలు అప్పు ఇప్పిస్తాడు. దైవాజీకి తన తండ్రి, తమ్ముడు భాను(గగన్ విహారి) అంటే అస్సలు ఇష్టం ఉండదు.

ఈ ముగ్గురూ బిజినెస్ పాడవడంతో వడ్డీ కట్టలేక దైవాజీ ఇంటికి వెళ్తే అప్పుడే దైవాజీ తండ్రిని తిట్టడం, అతను గుండెపోటుతో పడిపోవడం, వీళ్ళు హాస్పిటల్ లో చేర్చడం చేస్తారు కానీ అతను చనిపోతాడు. దైవాజీ అతని తమ్ముడు భాను మధ్య తండ్రి విషయంలో గొడవ జరగడంతో ఆ శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి తమ అప్పు తీర్చాలని అనుకుంటారు మనోహర్, పరమేశ్వరరావు, రవి. కానీ తీరా కిడ్నాప్ చేసాక దైవాజీ తండ్రి శవం బదులు మందాకిని అనే ఓ మహిళ శవం వస్తుంది. అసలు మందాకిని ఎవరు? దైవాజీ తండ్రి శవం ఎక్కడుంది? దైవాజీ ఫ్యామిలీ గొడవలు ఏంటి? ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అప్పు తీరుస్తారా? మనోహర్ ప్రేమ కథ ఏమైంది? పోలీసాఫీసర్(హర్షవర్దన్)తో ఈ ముగ్గురు ఎదుర్కున్న ఇబ్బంది ఏంటి? అసలు వీళ్ళు పెట్టిన బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్ ని ఎవరు నాశనం చేసారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Mister Middle Class Review : ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మూవీ రివ్యూ.. వెంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్.. ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ..

అసలు ఈ MRP సినిమా రిలీజ్ అవుతున్నట్టు జనాలకు ఎక్కువగా తెలీదు. పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. దీని మీద బజ్ కూడా లేదు. ముగ్గురు ఫ్రెండ్స్ పాత్రల పేర్లలోంచి మొదటి అక్షరాలని తీసి MRP అనే టైటిల్ పెట్టడం గమనార్హం. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఓ సమస్యలో చిక్కుకోవడం, ఆ సమస్య నుంచి బయటపడటానికి వాళ్ళు ఏం చేసారు అని కామెడీ సస్పెన్స్ కథాంశంతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలాంటిదే.

ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంటుంది. ముగ్గురు హీరోల పాత్రల పరిచయాలు, హీరో బిజినెస్ సాంగ్, హీరోయిన్ తో ఓ లవ్ సాంగ్ ఇవన్నీ బాగా సాగదీశారు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ వచ్చిన దగ్గర్నుంచి కాస్త కామెడీ మొదలవుతుంది. అప్పటి వరకు కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు. ఇక దైవాజీ తండ్రి మరణించడం, ఆయన శవం బదులు ఇంకో శవాన్ని ఈ ముగ్గురు తీసుకురావడం, అప్పుడే పోలీస్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఓ ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ దైవాజీ తండ్రి శవం కోసం ఈ ముగ్గురూ, మ్యాగ్నెట్, పోలీస్, భాను, దైవాజీ.. వీళ్లంతా వెతకడం, ఆ శవం తెలియకుండానే ఒకరి దగ్గర్నుంచి ఒకరి దగ్గరకు మారడం.. ఈ సీన్స్ అన్ని కాస్త సస్పెన్స్ గా బాగానే నడుస్తాయి. సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర్నుంచి సుదర్శన్, రాజ్ కుమార్ మాత్రం పోలీస్ తో చేసే కామెడీతో ఫుల్ గా నవ్వుకుంటాము. కానీ ఆ శవంతో ఆడిన ఆటలు కొంత సేపటి తర్వాత ఇంకెంతసేపురా బాబు అనిపించేలా సాగదీశారు. మందాకిని ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉంటుంది. క్లైమాక్స్ లో శవం మళ్ళీ ఈ ముగ్గురు దగ్గరికి రావడం, వీళ్ళు ఏం చేసారు అని ఆసక్తిగా రాసుకున్నారు. ఏదో టైం పాస్ కి చూడాలి అనుకుంటే ఈ MRP ని చూడటమే. లేదా ఓటీటీలోకి వచ్చాక ఫార్వార్డ్ చేసుకుంటూ చూడటమే. హీరో నరేష్ అగస్త్య గత సినిమా గుర్రం పాపిరెడ్డి కూడా సగం కథ శవం కిడ్నాప్ చుట్టే తిరగడం విశేషం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

నరేష్ అగస్త్య మెయిన్ లీడ్ లో పర్వాలేదు అనిపించాడు. సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ మాత్రం బాగా నవ్విస్తారు. వీళ్లిద్దరి వల్లే కాసేపైనా ఆ సినిమా చూడగగలిగాం అనిపిస్తుంది. వెన్నెల కిశోర్, హర్ష వర్ధన్ అక్కడక్కడా నవ్విస్తారు. 30 ఇయర్స్ పృథ్వీ ఓ రెండు సార్లు కనిపించి మెప్పించారు. హీరోయిన్ డోనాల్ బిస్త్ ఓ రెండు లవ్ సీన్స్, ఓ సాంగ్ లో కనిపించి పర్వాలేదు అనిపిస్తుంది. స్నేహ సింగ్ అందాలు ఆరబోస్తూ బాగానే నటించింది. నంద గోపాల్, చైతన్య జొన్నల గడ్డ, గగన్ విహారి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

Also Read : Madhuraapuri Sadana Review : ‘మధురాపురి సదన’ మూవీ రివ్యూ.. తెలుగు ఓటీటీలో కొత్త సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగోలేదు. రీ రికార్డింగ్ కూడా సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది. పాటలు కూడా బాగోలేవు. కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా సరిగ్గా లేదు. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా సీన్స్ కట్ చేస్తే బెటర్. ఓ శవాన్ని కిడ్నప్ చేసి దాని చుట్టూ సస్పెన్స్ కామెడీ అనే పాత కథ, కథనం తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా MRP ఓ శవం చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ సినిమా. ఫస్ట్ హాఫ్ ఓపికగా భరించి సెకండ్ హాఫ్ కాసేపు నవ్వుకోవాలి అనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.