Oh Sukumari Review : ‘ఓ..! సుకుమారి’ మూవీ రివ్యూ.. హీరోయిన్ ని ముట్టుకుంటే షాక్ కొడితే..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే కొత్త కాన్సెప్ట్ తో కామెడీ ఎమోషనల్ గా ఈ సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. (Oh Sukumari Review)

  • Published on- July 17, 2026 / 12:56 PM IST

Oh Sukumari Review

Oh Sukumari Review : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి నిర్మాణంలో భరత్ దర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నేడు జూలై 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

దామిని(ఐశ్వర్య రాజేష్)ని చిన్నప్పట్నుంచి ఎవరు ముట్టుకున్నా షాక్ కొడుతుంది. దాంతో ఊరివాళ్లంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. యాదగిరి(తిరువీర్) తన ఊరికి ఎప్పటికైనా సర్పంచ్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. యాదగిరి తండ్రి, బాబాయ్ కి గొడవలు ఉంటాయి. యాదగిరి లేదా అతని బాబాయ్ కొడుకు(శ్రీనివాస్ గవిరెడ్డి)కి ఎవరికైనా వారసుడు పుడితే 80 ఎకరాలు ఆస్తి వస్తుందని యాదగిరి తాత వీలునామా రాస్తాడు. దీంతో యాదగిరి తమ్ముడు ఎవర్నో మార్వాడి పిల్లని తీసుకొస్తాడు. యాదగిరి ఒక ఊరికి పెళ్లి చూపులకు వెళ్లి ఆ అమ్మాయిని కాకుండా అక్కడ దామినిని చూసి ఇష్టపడతాడు.

దామిని వల్ల ఇబ్బందులు పడుతున్న ఆ ఊరంతా కలిసి యాదగిరికి ఏమి చెప్పకుండా ఈ పెళ్లి చేసేయాలని నానా తంటాలు పడి పెళ్లి చేస్తారు. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు యాదగిరికి షాక్ కొట్టినా మగధీర ఎఫెక్ట్ అనుకుంటాడు. కానీ పెళ్లయి ఫస్ట్ నైట్ రోజు అసలు నిజం తెలుస్తుంది. దామినిని ముట్టుకుంటే ఫుల్ షాక్ కొట్టి ఎగిరి పడుతూ ఉంటాడు. అసలు దామినికి ఆ సమస్య ఎలా వచ్చింది? దామిని వల్ల భర్త, ఊరి జనాలు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఈ విషయం తెలిసి యాదగిరి ఏం చేస్తాడు? దామినికి ఆ సమస్య తగ్గుతుందా? యాదగిరి సర్పంచ్ అవుతాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : MRP Review : ‘ఎంఆర్‌పీ’ మూవీ రివ్యూ.. ఓ శవం కిడ్నాప్ తో ముగ్గురు ఫ్రెండ్స్ పడ్డ బాధలు..

సినిమా విశ్లేషణ..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే కొత్త కాన్సెప్ట్ తో కామెడీ ఎమోషనల్ గా ఈ సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఈ సినిమాపై అంచనాలు లేకపోయినా తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల కంటెంట్ మీద నమ్మకం ఉంది అని అనుకున్నారు ప్రేక్షకులు. ఓపెనింగ్ ఓ పిల్లల కిడ్నాప్ సీన్, అక్కడ ఓ విలన్, దామిని పాత్ర పరిచయంతో కథ మొదలయింది. ఆ విలన్ మళ్ళీ వస్తాడు అనుకుంటాము కానీ ఎక్కడా కనపడడు. యాదగిరి ఫ్యామిలీ పరిచయం కాస్త కన్ఫ్యూజ్ తో సాగుతుంది. అక్కడ కామెడీ ట్రై చేసారు కానీ వర్కవుట్ అవ్వలేదు.

దామిని పాత్ర, ఆమె షాక్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన సీన్స్ నవ్విస్తాయి. యాదగిరి దామినిని చూసిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. వాళ్ళ పెళ్లి అయ్యి, శోభనం సీన్ దాకా ఆ ఊరి వాళ్ళు షాక్ ఎఫెక్ట్ ని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు బాగానే నవ్వు తెప్పిస్తాయి. ప్రీ ఇంటర్వెల్ ఫుల్ గా నవ్వుకుంటాము. ఇంటర్వెల్ కి శోభనం రోజు యాదగిరికి బలంగా షాక్ కొట్టడంతో సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో భార్య భర్త ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్, సర్పంచ్ ఎన్నికల గురించి సాగదీస్తూ కొంత బోరింగ్ తో నడిపించారు. సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ ఎక్కువయి సాగదీశారు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కోడలు వచ్చి ఇంట్లో వాళ్ళను మార్చాలనుకోవడం, విలన్స్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకోవడం, హీరో ని నెగిటివ్ చేసి మళ్ళీ ప్రేమతో మంచివాడిగా మారడం.. లాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూసినవే.

దామినికి వచ్చిన ఆ షాక్ ఎఫెక్ట్ ఫ్లాష్ బ్యాక్ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో ఆ షాక్ వల్ల జరిగిన మంచి కూడా చూపించడం విశేషం. ఇక హీరోయిన్ ఉచ్ అనే ఊతపదం ఎందుకు వాడుతుందో దర్శకుడికే తెలియాలి. సర్పంచ్ ఎన్నికలు, పదవి గురించి చాలా కథ నడిపించి దాని గురించి చివర్లో ఏమి క్లారిటీ ఇవ్వకుండానే వదిలేసారు. సినిమాకు లీడ్ గతంలో ఓ ఇద్దరు వ్యక్తులకు ఇలాంటి సమస్య ఉన్నట్టు చరిత్రకు సంబంధించిన కొన్ని క్లిప్స్ చూపించడం గమనార్హం. చివర్లో ఓ నవ్వించే సీన్ తో పార్ట్ 2 కూడా అధికారికంగా ప్రకటించారు. హీరో లేదా హీరోయిన్ కి సమస్య ఉండటం, ఆ సమస్యని తమ భాగస్వామి అర్ధం చేసుకోవడం అనే కాన్సెప్ట్ లతో అనేక సినిమాలు వచ్చాయి. తిరువీర్ గత సినిమా పాపం ప్రతాప్ లో హీరోకి సమస్య ఉంటుంది, అక్కడ హీరోయిన్ అర్ధం చేసుకోవాలి. ఈ సినిమా కూడా అలాంటి సినిమాల కోవలోకి చెందినదే.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఐశ్వర్య రాజేష్ షాక్ కొట్టించే గ్రామీణ అమ్మాయి పాత్రలో తన పర్ఫార్మెన్స్ తో బాగా మెప్పించింది. సినిమా అంతా తన భుజాల మీద మోసిందని చెప్పొచ్చు. తిరువీర్ కూడా చాలా బాగా నటించాడు. ఐశ్వర్య తండ్రి పాత్రలో సీనియర్ నటుడు ఆనంద్ మెప్పించారు. ఝాన్సీ కూడా అక్కడక్కడా నవ్వించింది. మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, ఆమని, జీవన్ కుమార్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Mister Middle Class Review : ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మూవీ రివ్యూ.. వెంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్.. ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. లొకేషన్స్ మాత్రం రియల్ తెలంగాణ పల్లెల్లో షూట్ చేసి చాలా రియలిస్టిక్ విజువల్స్ చూపించారు. కథ రొటీన్ అయినా కథనం మాత్రం ఆసక్తిగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ఓ సుకుమారి’ ఓ అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే సమస్య ఉంటే దాంతో ఊరి ప్రజలు, భర్త ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.