Purushaha Review : ‘పురుషః’ మూవీ రివ్యూ.. భార్యాబాధితులు చూడాల్సిందే.. నవ్వుకోవాల్సిందే..
పురుషః అనే టైటిల్, మూవీ యూనిట్ చేసే ప్రమోషన్స్ తో పెళ్లయిన మగవారి ఇబ్బందులను ఈ సినిమాలో కామెడీగా చూపించబోతున్నట్టు అర్ధమయింది.(Purushaha Review)
- Saketh U
- Updated on- May 22, 2026 / 12:15 AM IST
Purushaha Review
Purushaha Review : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘పురుషః’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. పురుషః సినిమా మే 22న రిలీజ్ కానుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. పమ్మి సాయి, విటివి గణేష్, వెన్నెల కిషోర్, గ్యాబి రాక్, రాజీవ్ కనకాల, అనంత్ శ్రీరామ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే..
గోవింద్(పవన్ కళ్యాణ్), సత్తిబాబు(సప్తగిరి), శ్రీను(కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. వీళ్ళ భార్యలు కమల(రాయంచ) లక్ష్మి(హాసిని), గీత(విషిక)విడాకులు కావాలని కోర్టులో కేసు వేస్తారు కానీ కోర్టుకు రారు. దీంతో కేసు వాయిదా వేస్తూ ఉంటారు. జడ్జి వీళ్ళ కథలని చెప్పమంటాడు. ఈ ముగ్గురికి తమ భార్యలతో ఏవో ఒక గొడవలు వస్తూ ఉంటాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తమ చిన్ననాటి ఫ్రెండ్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్తారు. అక్కడ కిస్సు డైరీలో వీళ్ళ చిన్నప్పటి చిలిపి వేషాలు, ప్రేమకథలు అన్ని భార్యలు చూస్తారు. అలాగే ఆ పెళ్ళికి వచ్చిన దేవిక(anaira guptha) అనే అమ్మాయితో గడిపారని అనుమానంతో ముగ్గురు భార్యలు గొడవ పెట్టుకొని కోర్టులో విడాకులు కావాలని కేసు వేస్తారు.
ఇక గోవింద్ లైఫ్ లో తన కంటే ముందే రోజీ(గ్యాబి రాక్)అనే అమ్మాయి ఉందని తెలిసి మోసం చేసాడని దూరం పెడుతుంది తన భార్య కమల. మరి ఈ ముగ్గురు భార్యలు కోర్టుకు వస్తారా? వీళ్లకు విడాకులు వస్తాయా? లేక భర్తలను అర్ధం చేసుకొని కలుస్తారా? గోవింద్ – రోజీ ప్రేమ కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Peddi: సుల్తాన్, దంగల్ తో ‘పెద్ది’కి పోలిక.. బోమన్ ఇరానీ ఎందుకు అలా అన్నాడు అసలు!
సినిమా విశ్లేషణ..
పురుషః అనే టైటిల్, మూవీ యూనిట్ చేసే ప్రమోషన్స్ తో పెళ్లయిన మగవారి ఇబ్బందులను ఈ సినిమాలో కామెడీగా చూపించబోతున్నట్టు అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా భార్యాభర్తల గొడవలు, కోర్టు సీన్స్, ఈ ఫ్రెండ్స్ చేసే కామెడీతో, హీరో ప్రేమకథతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కిస్సు పెళ్ళికి వెళ్లి అక్కడ వీళ్ళ చిలిపి పనులు బయటపడటంతో నెక్స్ట్ ఏం జరిగింది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో గోవింద్ గత ప్రేమకథ, కిస్సు డైరీ బయటపడ్డాక భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు, కోర్టు సీన్ తో నడుస్తుంది.
సొసైటీలో మగవారి కష్టాలను కూడా కామెడీగా చూస్తారు. అలా సినిమాలో కూడా మగవాళ్ళు పడే కష్టాలను కామెడీగానే చూపించారు. అసలు నిజం తెలియకుండా, చెప్పుడు మాటలు విని, ఊహించుకొని భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా వస్తాయి అని చూపించారు. ఎక్కువశాతం ఈ భార్యాభర్తల గొడవలు కామెడీగా చూపించారు. ఈ కామెడీ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గోవింద్ – రోజీ ప్రేమకథ బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించలేము. ఆ ట్విస్ట్ బాగున్నా ఫ్లాష్ బ్యాక్ లో ఏజ్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా హీరోయిన్ పాత్రని పెడితే బాగుండేది.
హీరో లవ్ బ్రేకప్ తప్ప కొన్ని చోట్ల ఎమోషన్ పండించాలని ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కోసం ముగ్గురు హీరోలు సూపర్ హీరోలుగా మారి భార్యలతో యుద్ధం చేసినట్టు చూపించారు కానీ అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చిన్నప్పుడు, కాలేజీ ఏజ్ లో అందరి లైఫ్ లో చిలిపి పనులు ఉంటాయి. వాటికే విడాకులు కావాలని వెళ్తారా అనేది స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించేసినట్టు అనిపిస్తుంది.
ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ కరెక్ట్ గా లేదు. ఓ సీన్ లో పమ్మి సాయి పాత్ర చెప్పే డైలాగ్స్ మాత్రం కామెడీగా చెప్పినా సొసైటీలో జరిగేది ఇదే కదా అని ఆలోచింపచేస్తాయి. ఈ సినిమా కొంతమంది సూడో ఫెమినిస్ట్ భావాలు దెబ్బతినేలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భార్యాభర్తలు కలిసి సినిమాకు వెళ్తే మాత్రం జాగ్రత్త. అక్కడక్కడా నవ్వుకోవడానికి ఈ సినిమా చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
కొత్త హీరో అయినా పవన్ కళ్యాణ్ బాగానే నటించాడు. కొన్ని చోట్ల హావభావాల కోసం కష్టపడ్డా డ్యాన్స్, ఎమోషన్స్ లో బాగానే మెప్పించాడు. కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్ ఫుల్ గా నవ్విస్తారు. సప్తగిరి, విటివి గణేష్, పమ్మి సాయి బాగానే నవ్వించారు. మెయిన్ హీరోయిన్ రాయంచ క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో మెప్పించే ప్రయత్నం చేసింది. విషిక, హాసిని సుధీర్ కాస్త ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ పాత్రలకు డైరెక్టర్ అలాగే చేయించారేమో. హరితేజ గెస్ట్ అప్పీరెన్స్ బాగుంటుంది. బ్రెజిల్ నటి గ్యాబి రాక్ మాత్రం క్యూట్ గా మెప్పిస్తుంది.
Also See : Sitara Ghattamaneni: పారిస్ వెకేషన్ లో మహేష్ బాబు కూతురు.. అన్నతో సితార ఘట్టమనేని క్యూట్ ఫోటోలు వైరల్
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. పాటలు మాత్రం బాగున్నాయి. ఈ కథకు స్క్రీన్ ప్లే సింపుల్ గా ఫ్లాష్ బ్యాక్ లో తీసుకొని లీనియర్ గానే రాసుంటే బాగుండేది. భార్యాభర్తల గొడవలను కామెడీగా చూపిస్తూనే అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసి బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ పరంగా అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్, ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ మార్చడం చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘పురుషః’ సినిమా పెళ్లయిన మగవాళ్ల కష్టాలను, భార్యాభర్తల మధ్య జీవితాన్ని కామెడీగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
