Premane Oorilo Review : ‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. కన్నడ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు తెలుగులో.. సాంగ్స్ సూపర్..

ప్రేమనే ఊరిలో సినిమా చూస్తే చాలా గ్యాప్ తర్వాత యాక్షన్, వైలెన్స్ లేని లవ్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది. (Premane Oorilo Review)

  • Updated on- October 1, 2026 / 10:58 PM IST

Premane Oorilo Review

Premane Oorilo Review : శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘ప్రేమనే ఊరిలో’. కన్నడలో గతవారం రిలీజయి పెద్ద విజయం సాధించిన ఈ కన్నడ సినిమా నేడు అక్టోబర్ 2న తెలుగులో రిలీజ్ అయింది. వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై మమత దేవేంద్ర ఈ సినిమా నిర్మించగా మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో మహారత్న ప్రొడక్షన్స్, SK పిక్చర్స్ బ్యానర్ పై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి రిలీజ్ చేసారు. ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

నాగన్న(రంగాయన రఘు) భార్య చనిపోవడంతో ఇంకో పెళ్లి చేసుకోకుండా తన కొడుకు సంతోష్ ని పెంచుతాడు. సంతోష్(శ్రీరామ్) చదువుకోకుండా పొలం పనులు చేసుకుంటూ ఊళ్ళోనే తండ్రికి సపోర్ట్ గా ఉంటాడు. నాగన్న అప్పుడప్పుడు తను గతంలో చేసిన ఓ తప్పుని తలుచుకుంటూ బాధపడతాడు. ఊళ్ళోనే చదువులేకుండా మగరాయుడులా తిరిగే వసంత(రమిక శివు) ఫ్రెండ్ మాటలు విని తన బావ సంతోష్ తనని ఇష్టపడుతున్నాడు అని కలలు కంటూ ఉంటుంది. నాగన్న తన కొడుక్కి బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేయాలని పట్టుబడతాడు. సంతోష్ కండిషన్స్ తో వచ్చే పెళ్లి సంబంధాలు అన్ని వెనుతిరుగుతాయి.

అమెరికా నుంచి తిరిగొచ్చిన రుక్మిణి(తపస్విని పూనాచ)ని తన బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అనుకోకుండా సంతోష్ రుక్మిణిని చూసి, ఆమె మాటలు విని ఇష్టపడతాడు. దాంతో ఆమె ఎవరో, ఎక్కడ ఉంటుందో వెతకడం మొదలుపెడతాడు. ఓ రోజు సడెన్ గా నాగన్న తన కొడుకుని ఓ పెళ్లి మండపానికి రమ్మని తన ఫ్రెండ్ కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయింది, పెళ్లి చేసుకొమ్మని లేదంటే నా చావు చూస్తావని రిక్వెస్ట్ చేస్తాడు. మరి సంతోష్ తండ్రి చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? రుక్మిణిపై తన ప్రేమని వదులుకుంటాడా? వసంత సంతోష్ కి తన ప్రేమని చెప్తుందా? నాగన్న చేసిన తప్పేంటి? తను చేసిన తప్పే కొడుకు చేస్తాడేమో అని నాగన్న ఎందుకు బాధపడతాడు? పెళ్ళికి సంతోష్ పెట్టె కండిషన్స్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Bigg Boss Telugu 10 : ఇంత ఓపెన్ గా గ్రూపిజమా.. అగ్నిపరీక్ష బ్యాచ్ మరీ ఇంత చీపా? వేరే టీమ్స్‌లో ఉన్నా వాళ్లకు వాళ్ళు.. బిగ్‌ బాస్ 10 డే 24 ఎపిసోడ్‌..

సినిమా విశ్లేషణ..

కన్నడలో మంచి విజయం సాధించినా ప్రేమనే ఊరిలో సినిమాకు తెలుగులో అంత బజ్ రాలేదు. ఎమోషన్ ఉన్న ప్రేమ కథలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఒకప్పుడు తెలుగులో చాలా వచ్చేవి. ప్రేమనే ఊరిలో సినిమా చూస్తే చాలా గ్యాప్ తర్వాత యాక్షన్, వైలెన్స్ లేని అలాంటి లవ్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ ఓ పక్క సంతోష్, అతని ఊరు, మరదలు వసంత, వాళ్ళ కామెడీ, ఊళ్ళో సంఘటనలు, సంతోష్ పెళ్లి సంబంధాలు చూపిస్తూనే మరో వైపు రుక్మిణి బ్రేకప్ ఎమోషన్ చూపిస్తారు. ఓ క్రికెట్ మ్యాచ్ తో వసంతకి తన ఫ్రెండ్ సంతోష్ కి నువ్వంటే ఇష్టం అని ఊహించి చెప్పడంతో అక్కడ్నుంచి కథ క్యూట్ గా సాగుతుంది. వసంత వన్ సైడ్ లవ్ ట్రాక్, సంతోష్ రుక్మిణి కోసం వెతకడంతో నడిచి ఇంటర్వెల్ కి నాగన్న కొడుకుని ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా పెళ్లి, పెళ్లి తర్వాత లైఫ్, మనస్పర్థలు, వసంత ఎమోషన్, నాగన్న ఫ్లాష్ బ్యాక్, మధ్యలో హీరోని ఇష్టపడని ఓ వ్యక్తి, అతని వల్ల వచ్చే సమస్యలు.. ఇలాంటి సంఘటనలతో క్యూట్ గా సాగుతూనే చివరి అరగంట ఎమోషనల్ గా నడిపించారు.

ఫస్ట్ హాఫ్ కొంత సాగదీసినట్టు సిల్లీ కామెడీ సీన్స్, తండ్రి – కొడుకు ఎమోషన్స్ తో సాగుతుంది. వసంత వన్ సైడ్ లవ్ స్టోరీ క్యూట్ గా చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఉన్నా ముందే వచ్చిన ఓ సీన్ వల్ల ఆ ట్విస్ట్ ఊహించేయొచ్చు. సెకండ్ హాఫ్ పెళ్లి తర్వాత భార్య భర్తల క్యూట్ సీన్స్ బాగా సాగదీసారు. ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన పాయింట్ పాతదే అయినా బాగానే కనెక్ట్ అవుతుంది. ఇక వసంత ట్రాక్ తో బ్రేకప్ ఎమోషన్ కూడా బాగా పండించారు. లాస్ట్ అరగంట ఎమోషన్ ని బాగా పండించారు. ఓ రెండు సీన్స్ లో కన్నీళ్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. క్లైమాక్స్ హెవీ ఎమోషన్ తో ముగించారు. కాకపోతే సెకండ్ హాఫ్ బాగా సాగదీశారు.

ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు ఈ సినిమా చూడాలి. ఓ రిలేషన్ లో ఉండే అనుమానాలు, మనస్పర్థలు వంటి అంశాలను చక్కగా డీల్ చేసారు. తండ్రి కొడుకు ఎమోషన్ ని కూడా బాగా పండించారు. ఈ సినిమా చూస్తుంటే ఒకప్పుడు తరుణ్ తీసిన కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ జనరేషన్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వస్తే మాత్రం సినిమాని మెచ్చుకుంటారు. అయితే టైటిల్ ని ఒక సాంగ్ లో వాడారు కానీ సినిమాకు ఆ టైటిల్ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. డైరెక్ట్ గా చెప్పకపోయినా అంతర్లీనంగా అమ్మాయిల విషయంలో ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. అలాగే రైతుల గురించి కొన్ని సీన్స్, మంచి డైలాగ్స్, రైతుల ఎమోషన్ ని కామెడిగానే చెప్తూ బాగా చూపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

హీరో శ్రీరామ్ తన పాత్రలో పర్వాలేదనిపించాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ లో అతని పాత్రపై కోపం వచ్చేలా బాగా నటించాడు. రమిక శివు మగరాయుడిలా నటించి తర్వాత హాఫ్ శారీలో క్యూట్ గా అలరించింది. బ్రేకప్ ఎమోషన్ ని బాగా పండించింది. తపస్విని పూనాచ క్యూట్ సీన్స్ లో తన నటనతో మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదనిపించింది. కన్నడ సీనియర్ నటుడు రంగాయన రఘు మాత్రం తన పాత్రలో అదరగొట్టేసాడు. ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను కూడా ఎమోషన్ అయ్యేలా చేసారు. హీరో బామ్మ పాత్రలో నటించిన నటి కూడా చక్కగా మెప్పించింది. హీరోయిన్స్ ఫ్రెండ్ పాత్రల్లో నటించిన ఆర్టిస్టులు, హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటులు, మిగిలిన కన్నడ నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

Also Read : Nakshatra : బాబోయ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందాలు ఆరబోస్తున్న తెలుగమ్మాయి.. మొదటి సినిమాకే.. ‘నక్షత్ర’ ఫొటోలు వైరల్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ప్రతి పాట అర్థవంతంగా, వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. రిపీటెడ్ మోడ్ లో వినొచ్చు పాటలు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. పచ్చని పల్లెటూళ్లలో, ఊరికి దూరంగా పొలాల్లో ఉండే ఇళ్లలో, ఓ పెద్ద శివుడి గుడి.. ఇలా ప్రతి లొకేషన్ ని అందంగా ప్రతి ఫ్రేమ్ లో చూపించారు. తెలుగు డైలాగ్స్ డబ్బింగ్ లో మాత్రం కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని అక్కర్లేని కామెడీ ట్రాక్ లు, సెకండ్ హాఫ్ లో సాగదీసిన క్యూట్ సీన్స్ కట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉండేది. ఒక సింపుల్ కథని హెవీ ఎమోషన్స్ తో చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ప్రేమనే ఊరిలో’ సినిమా క్యూట్, హెవీ ఎమోషన్స్ తో చివర్లో ఓ మెసేజ్ తో సాగిన ప్రేమకథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.