Gedela Raju Kakinada Taluka Review: ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ మూవీ రివ్యూ.. విలన్ సెంట్రిక్ సినిమా.. ఎలా ఉందంటే..?

Gedela Raju Kakinada Taluka Review: రఘు కుంచె ఇటీవల నెగిటివ్ పాత్రలు వేస్తూ నటుడిగా మెప్పిస్తున్నాడు. (Gedela Raju Kakinada Taluka)

  • Updated on- April 24, 2026 / 02:24 PM IST

Gedela Raju Kakinada Taluka Review - Rating

Gedela Raju Kakinada Taluka Review : రఘుకుంచె టైటిల్‌ పాత్ర పోషించిన సినిమా ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనేది ట్యాగ్‌లైన్‌. రఘు కుంచె సమర్పణలో మోటూరి టాకీస్ బ్యానర్ పై వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాణంలో చైతన్య మోటూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి, మహబూబ్ బాషా, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేడు ఏప్రిల్ 24న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

కాకినాడలో పెద్ద రౌడీ షీటర్ గేదెల రాజు(రఘుకుంచె). అతనికి పెద్ద శత్రువు దుర్గ(శ్రీకాంత్ అయ్యంగార్). వీళ్ళిద్దరూ కార్పొరేట్ సీట్ కోసం పోటీ పడతారు. గేదెల రాజుని ఎవరో రాత్రి పూట ఒంటరిగా ఉన్నప్పుడు హత్య చేస్తారు. ఆ హత్య పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గేదెల రాజుకు చాలా మంది శత్రువులు ఉంటారు. అయితే హత్య జరిగినప్పుడు శివయ్య(రవి ఆనంద్) అల్లుడు డెక్కా అటు వైపు వెళ్లాడని తెలియడంతో పోలీసుల నుంచి అతన్ని కాపాడుకోవడానికి శివయ్య గేదెల రాజు శత్రువులే అతన్ని చంపారంటూ అందరి మీద పుకార్లు పుట్టిస్తాడు.

అసలు గేదెల రాజుని ఎవరు చంపారు? గేదెల రాజు కథేంటి? శివయ్యకు గేదెల రాజుకి ఉన్న సంబంధం ఏంటి? విజయ్ – సత్య(టీనా శ్రావ్య) ప్రేమకథ, రిచ్(వికాస్) – మీరా(మౌనిక) ప్రేమకథలకు గేదెల రాజుకు సంబంధం ఏంటి? పోలీసులు అసలు హంతకుడిని పట్టుకున్నారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Vaazha 2 Review in Telugu : ‘వాలా 2’ మూవీ రివ్యూ.. మలయాళంలో 200 కోట్లు కొట్టిన చిన్న సినిమా.. ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ..

రఘు కుంచె ఇటీవల నెగిటివ్ పాత్రలు వేస్తూ నటుడిగా మెప్పిస్తున్నాడు. ఈ సినిమా విలన్ సెంట్రిక్ సినిమా అని ప్రమోట్ చేయడం, మర్డర్ మిస్టరీ కావడం, రఘు కుంచె మెయిన్ లీడ్ కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి.

ఫస్ట్ హాఫ్ గేదెల రాజు మర్డర్ తోనే కథ ఓపెన్ చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో గేదెల రాజు చుట్టూ జరిగే కథలు, పోలీసులు ఈ మర్డర్ గురించి విచారణ చేయడం చూపిస్తారు. ఓ 15 ఏళ్ళ క్రితం గేదెల రాజుపై దాడి జరిగిన సంఘటనతో ఇంటర్వెల్ ఇస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజ్ గా, సాగదీతగా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా పెద్ద ఎఫెక్ట్ గా ఏమి అనిపించదు కానీ అదే ఇంటర్వల్ క్లైమాక్స్ కి కనెక్ట్ చేయడంతో బాగుంది అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ అంతా గేదెల రాజు చుట్టూ అతనిపై కోపం పెంచుకునే శత్రువులు, అతనికి ఎవరెవరు శత్రువులు ఉన్నారు, రెండు ప్రేమకథలు, ఆ ప్రేమకథల్లోకి గేదెల రాజు ఎలా వచ్చాడు అని సాగుతుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించలేరు. గేదెల రాజుని చంపింది ఎవరు అని మన ఊహించే వాళ్లలోనే ఉంటారు కానీ అతను ఎవరు, అతను ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే సినిమాకు హైలెట్.

సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం సాగదీసినా క్లైమాక్స్ లో ఒక్కో ముడి విప్పుతూ ట్విస్ట్ లు రివీల్ చేయడంతో మంచి ముగింపు ఇచ్చారు అనిపిస్తుంది. సినిమా అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చాలా చోట్ల కన్ఫ్యూజ్ చేస్తూ, సాగదీస్తూ, బోర్ కొట్టిస్తూ, అక్కర్లేని రౌడీ షీటర్ల సీన్స్ తో, రొటీన్ పాత కాలం రౌడీ క్యారెక్టర్ తో నడిపించినా ముగింపు మాత్రం బాగా ఇచ్చారు. మహాభారతంలోని కణిక నీతిని చివర్లో చాలా బాగా చెప్పారు. ఫ్యామిలీలతో చూడటం కష్టమే. చాలా వరకు కాకినాడలోని రియల్ లొకేషన్స్ లో రా & రస్టిక్ గా తెరకెక్కించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

గేదెల రాజు పాత్రలో రఘు కుంచె నెగిటివ్ షేడ్స్ లో బాగానే నటించాడు అని చెప్పొచ్చు. సినిమాలో రవి ఆనంద్ తన పర్ఫార్మెన్స్ తో హైలెట్ గా నిలుస్తాడు. వికాస్ ముప్పాళ, రామచంద్రం పుణ్యమూర్తుల కీలక పాత్రల్లో బాగానే నటించారు. టీనా శ్రావ్య, కలపాల మౌనిక ప్రేమకథల్లో క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించారు.

శ్రీకాంత్ అయ్యంగార్, దివ్య, కిట్టయ్య, మహబూబ్ బాషా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. అయితే కొన్ని కీలక పాత్రల్లో మాత్రం క్యాస్టింగ్ సెట్ అవ్వలేదు. పోలీస్ పాత్రలు ఎవరూ కూడా యాక్టివ్ గా నటించలేదు. మిగిలిన చిన్న చిన్న పాత్రలకు కూడా కాకినాడ లోకల్ వాళ్ళను తీసుకొని ఎవరో ఒకర్ని పెట్టాలి అని పెట్టరేమో అనిపిస్తుంది.

Also Read : Tamannaah Bhatia: తమన్నా కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం.. నటుడు అన్నూ కపూర్‌ షాకింగ్ కామెంట్స్

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. రొటీన్ మర్డర్ మిస్టరీ, రొటీన్ విలన్ పాత్రే అయినా మంచి ముగింపుతో రాసుకున్నాడు దర్శకుడు. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్, ప్రేమ సాంగ్ కట్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. దర్శకుడే నిర్మాత కావడం, తన ఊరు కాకినాడలోనే మొత్తం షూటింగ్ చేయడంతో చాలా చోట్ల లిమిటెడ్ బడ్జెట్ తో చేసినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ ఓ రౌడీ షీటర్ గురించి, అతని మర్డర్ మిస్టరీతో సాగదీస్తూ తెరకెక్కించిన సస్పెన్స్ సినిమా. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.