Kashi Majili : ‘కాశీ మజిలీ’ రివ్యూ.. రేణు దేశాయ్ నటించిన సినిమా ఎలా ఉందంటే..? ఏడేళ్లు చిన్నవాడితో ప్రేమ..
ఈటీవీ విన్ ఓటీటీలో కథ సుధా పేరుతో ప్రతి వారం అరగంట నిడివి ఉండే ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. (Kashi Majili)
- Saketh U
- Published on- September 13, 2026 / 03:22 PM IST
Kashi Majili Review
Kashi Majili : రేణు దేశాయ్ కథ, స్క్రీన్ ప్లే అందించి మెయిన్ లీడ్ లో నటించిన షార్ట్ ఫిలిం కాశీ మజిలీ. ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి వారం కథ సుధా పేరిట ఒక కొత్త షార్ట్ ఫిలిం వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 నిముషాలు నిడివి గల ఈ కాశీ మజిలీ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయింది. JK ఆర్ట్స్ బ్యానర్ పై కాళ్ళూరు జగదీశ్ కుమార్ నిర్మాణంలో యమునా కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికొస్తే..
కృప(రేణు దేశాయ్) కాశీకి వెళ్తే అక్కడ తన బ్యాగ్ పోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అదే సమయంలో కన్నన్(శంకర్ ఇందుచూడన్) కూడా తన బ్యాగ్ పోయిందని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అనంతరం వీళ్ళిద్దరూ కలిసి రాత్రి పూట కాశీలో తిరుగుతూ ఉంటారు. కృప తన బాధలు గంగా నదికి చెప్పుకొని ఏడుస్తుంది. సడెన్ గా కన్నన్.. నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? 7 ఏళ్ళు పెద్ద అయితే ఏమైంది? నా పేరెంట్స్ చనిపోయారు, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావు, పదేళ్ల తర్వాత మళ్ళీ ఇలా ఎందుకు కనిపించావు అంటూ కృపకు చెప్తూ ఏడుస్తాడు. దాంతో కృప నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్తుంది. పదేళ్ల క్రితం విడిపోయిన కృప – కన్నన్ మళ్ళీ ఒక్కటవుతారా? పోయిన వీళ్ళ బ్యాగులు దొరుకుతాయా? అసలు వీళ్ళ ప్రేమకథ ఏంటి.. తెలియాలంటే కాశీ మజిలీ షార్ట్ ఫిలిం చూడాల్సిందే.
Also Read : RaviTeja : ఇరుముడి సక్సెస్.. రవితేజను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.. ఫోటోలు
విశ్లేషణ.. ఈటీవీ విన్ ఓటీటీలో కథ సుధా పేరుతో ప్రతి వారం అరగంట నిడివి ఉండే ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. సున్నితమైన కథలనే ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ ఇటీవలే అడపాదడపా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాశీ మజిలీ అనౌన్స్ చేయడంతో ఈ షార్ట్ ఫిలింపై అంచనాలు నెలకొన్నాయి. అయితే టైటిల్ చూసి ఇది కాశీ ప్రయాణం, ఆధ్యాత్మికత ఉంటుంది అనుకుంటాం. కానీ కాశీ గొప్పతనం చెప్తూ ఒక లవ్ స్టోరీని చూపించారు.
కథనం చాలా నిదానంగా నడుస్తుంది. కొన్ని చోట్ల ఫార్వార్డ్ చేసుకుంటూ చూడాల్సిందే. మధ్యలో ఒక పాట కూడా ఉంది. లవ్ స్టోరీని పూర్తిగా బిల్డ్ చేయకుండా ఉన్న నిడివిలోనే డైలాగ్స్ తో మేనేజ్ చేసారు. తన కంటే ఏడేళ్లు చిన్న అయిన అబ్బాయితో లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ నడిచింది. అలాగే రాత్రి పూట కాశీ అందాలని చూపించారు. ఇక రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ ని ఆధారంగా కొన్ని డైలాగ్స్ రాసుకుందేమో అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక విశ్లేషణ.. రేణు దేశాయ్ 40 ఏళ్ళ ఒంటరి మహిళపాత్రలో, తనకంటే చిన్నవాడిని ప్రేమించిన పాత్రలో చాలా బాగా నటించింది. లుక్స్ పరంగా కూడా రేణు దేశాయ్ చాలా చక్కగా కనిపించింది. ఈ షార్ట్ ఫిలిం తర్వాత మరిన్ని అవకాశాలు ఆమెకు రావొచ్చు. శంకర్ ఇందుచూడన్ కూడా చక్కగా నటించాడు.
కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ లో కాశీని చక్కగా చూపించారు. ఈ సినిమాకు రేణు దేశాయ్ కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా కొన్ని డైలాగ్స్ రాసింది. అలాగే స్టైలిస్ట్ గా కూడా పనిచేసింది. ఉన్న ఒక్క పాట యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కాశీ వరకు వెళ్లి భక్తి, ప్రేమ కలిసిన క్యూట్ స్టోరీని బాగానే తెరకెక్కించారు.
