Maa Inti Bangaram Review : ‘మా ఇంటి బంగారం’ రివ్యూ.. అయ్య బాబోయ్ సమంత యాక్షన్ అదరగొట్టిందిగా..
Maa Inti Bangaaram Movie Review : సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 19, 2026 / 04:45 PM IST
Samantha Maa Inti Bangaaram Review Rating Movie Cast Sreemukhi Nandini Reddy Raj Nidimoru
Maa Inti Bangaram Review : సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి నిర్మాణంలో రాజ్ నిడిమోరు కథ అందించగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మా ఇంటి బంగారం సినిమా నేడు జూన్ 19న తెలుగు, తమిళ్ లో థియేటర్స్ లో రిలీజైంది.
కథ విషయానికొస్తే..
అనిరుధ్(దివంత్) స్వర్ణ(సమంత) ను ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఇంటికి దూరమవుతాడు. రెండేళ్ల తర్వాత చెల్లి(రచన) పెళ్ళికి అనిరుధ్, స్వర్ణ ఇంటికొస్తారు. అది పెద్ద కుటుంబం. ఆ ఇంట్లో చిన్నకొడలు అనసూయ(శ్రీముఖి) అందరికీ ఇష్టం. మంచి కోడలుగా అందర్నీ మెప్పిస్తుంది. స్వర్ణ తన ఫ్రెండ్ సాయంతో అనసూయని మించి అన్ని పనులు చేసి ఇంట్లో అందర్నీ మెప్పించి మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటుంది. కొన్ని పనులతో ఇంట్లో కొందర్ని మెప్పిస్తుంది. కానీ తన గతంకు చెందిన మనుషులు ఆమెని వెతుక్కుంటూ రావడంతో వాళ్ళను కొడుతుంది. అందులో ఒకడ్ని చంపేసి తన ఫ్రెండ్ సాయంతో ఊరవతల పడేస్తుంది.
దీంతో ఫ్రెండ్ అసలు నువ్వెవరు అని స్వర్ణ ను అడగడంతో తన చిన్నతనం, తన నక్సలైట్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. కరుణ(గుల్షన్ దేవయ్య) అనే నక్సలైట్ తనని వెతుక్కుంటూ వస్తాడు. అసలు స్వర్ణ నక్సలైట్ గా ఎందుకు మారింది? తోటి నక్సలైట్ కరుణ స్వర్ణ ను ఎందుకు వెతుకుతాడు? స్వర్ణ ఎందుకు నక్సలిజం వదిలేసింది? స్వర్ణ ఫ్లాష్ బ్యాక్ ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా? తన గతం తెలియకుండా ఇంట్లో ఎన్ని కష్టాలు పడింది? ఇంట్లో వాళ్ళందరిని మెప్పించి మంచి కోడలు అనిపించుకుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మొత్తం 1980 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఫస్టాఫ్ అంత స్వర్ణ తన భర్తతో తన భర్త ఇంటికి రావడం అక్కడ వాళ్లలో కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలతో సాగుతుంది. తన గతానికి సంబంధించిన వాళ్ళు వెతుక్కుంటూ రావడం, వాళ్ళను కొట్టడం, చంపడంతో అసలు ఈమె ఎవరు అనే ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ముందే ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఇంటర్వెల్ కి ఈమె కోసం వెతికే ఒక విలన్ ఉన్నాడు అని చూపించే సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పారు. సెకండ్ హాఫ్ అంతా స్వర్ణ తన ఫ్యామిలీని కాపాడుకోవాలి అంటూ సాగుతుంది క్లైమాక్స్ అంతా యాక్షన్ మోడ్ లో ఉంటుంది.
సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. కార్ ఛేజింగ్ సీక్వెన్స్, తెల్లవారుజామున ఒక ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్పి ఉంటే ఇంటర్వెల్ కి హీరోయిన్ గతం ఏంటి అనే ఉత్కంఠ నెలకొనేది. పాత పాట ముత్యమంతా పసుపు.. కొన్ని సీన్స్ లో వాడటం బాగుంది. సినిమా అంతా సమంత చీరలోనే కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ మైనస్ అయింది సమంత యాక్షన్ ట్రైలర్ చూసి ఫ్లాష్ బ్యాక్ హెవీ రేంజ్ లో ఆశిస్తారు జనాలు కానీ సింపుల్ గా, చాలా తక్కువ టైం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సమంతని మరింత పవర్ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేది. సమంత ఎందుకు నక్సలైట్ గా మారింది అనే కారణం బానే ఉన్నా నక్సలైట్ అయ్యాక చాలా పవర్ ఫుల్ గా తయారైందని ఇంకా బాగా చూపిస్తే తర్వాత చేసే యాక్షన్స్ కి ఒక అర్థం ఉండేది.
అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సాంప్రదాయ కుటుంబాలు అందులో కోడళ్ళు ఎలా ఉంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది అని సీన్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మోడ్ లోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తాయి. అయితే ఈ సినిమా, క్లైమాక్స్ కూడా అతడు సినిమా గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ అయితే అతడు క్లైమాక్స్ దించేసినట్టు అనిపిస్తుంది. అతడు సినిమా అంతా హీరో వర్షన్ అయితే ఇక్కడ హీరోయిన్ వర్షన్. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో అక్కడ హీరో కిల్లర్ అయితే ఇక్కడ హీరోయిన్ నక్సలైట్ అంతే తేడా. మిగిలిందంతా అతడు సినిమా గుర్తు చేస్తుంది. కానీ సమంతను హీరోయిన్ గా పెట్టి ఇలా ఫ్యామిలీ యాక్షన్ సినిమాని బాగానే తెరకెక్కించారు. సమంత ఫ్యాన్స్ కి అయితే పండగ. సినిమాకి సమంత యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు.
నటీనటుల పర్ఫామెన్స్..
సమంత అయితే అదరగొట్టేసింది. ఓ పక్కన మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలని మరోపక్క యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా బాగా నటించింది. సమంత కం బ్యాక్ అని చెప్పొచ్చు చాలా రోజుల తర్వాత సమంత నుంచి మంచి పర్ఫామెన్స్ చూసాము. గుల్షన్ దేవయ్య నెగిటివ్ పాత్రలో బాగా నటించారు. యాంకర్ శ్రీముఖికి మంచి కోడలు పాత్ర పడింది. ఈ సినిమా తర్వాత శ్రీముఖికి మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. సమంత భర్త పాత్రలో దిగంత బాగా నటించాడు. సమంత భర్త చెల్లెలు పాత్రలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు రచన క్యూట్ గా కనిపించి మెప్పించింది. శ్రీనివాస్ గవిరెడ్డి అక్కడక్కడ నవిస్తాడు. చైతన్యకృష్ణ కూడా మంచి పోలీస్ పాత్రలో మెప్పించాడు. గౌతమి, శ్రీలక్ష్మి, ఆర్యన్, ఆనంద్.. మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగానే నటించారు. వెన్నెల కిషోర్ గెస్ట్ అప్పీరెన్స్ లో కనిపించి నవ్విస్తాడు.
Maa Inti Bangaram OTT: సమంత మా ఇంటి బంగారం ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్స్ లు చాలా బాగా డిజైన్ చేసారు. ఒక పాట మాత్రమే బాగుంది. మిగిలినవి యావరేజ్. అతడు లాంటి కథ, స్క్రీన్ ప్లే తీసుకొని దానికి ఫిమేల్ వర్షన్ లో ఈ సినిమాని బాగానే రాసుకొని తెరకెక్కించారు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘మా ఇంటి బంగారం’ గతమంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించి తన భర్త కుటుంబంలో మంచిగా ఉండాలనుకున్న ఓ అమ్మాయి గతం తాలూకు మనుషుల నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
