Save The Tigers 3 Review : ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 రివ్యూ.. మళ్ళీ ఫుల్ గా నవ్వించారుగా..
ముగ్గురు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సిరీస్ గా సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించింది. (Save The Tigers 3 Review)
- Saketh U
- Updated on- June 19, 2026 / 06:49 AM IST
Save The Tigers 3 Review
Save The Tigers 3 Review : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, సుజాత,పావని, దేవియని.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సిరీస్ సేవ్ ది టైగర్స్ కి సీజన్ 3 వచ్చేసింది. త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ పై శివ మేక, సాహితి నిర్మాణంలో మహి వి రాఘవ సమర్పణలో శ్రీరామ్ ఎరగం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ నేడు జూన్ 19 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
కథ విషయానికొస్తే..
రెండో సీజన్ ఎండ్ నుంచే మొదలుపెడతారు. విక్రమ్(చైతన్య కృష్ణ) నుంచి విడాకులు కావాలని రేఖ(దేవయాని శర్మ)వేసిన కేసు కోర్టులో నడుస్తుంది. భార్య హైమావతి(జోర్దార్ సుజాత) పోరు పడలేక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొన్న గంట రవి(ప్రియదర్శి)కి అక్కడ పద్ధతులు నచ్చక భార్యతో గొడవ పడుతూ ఉంటాడు. రాహుల్(అభినవ్ గోమఠం) భార్యతో పాటు బెంగుళూరుకు వెళ్లి తన రైటింగ్ వదిలేసి అక్కడ ఇష్టం లేని జాబ్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు ముగ్గురూ కలిసి కూర్చొని తాగుతూ పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయిస్తారు అంటే మన పెళ్లి లైఫ్ లు ఇలా ఉండటానికి కారణం ఇంద్రుడే అని అతన్ని తిడుతారు. ఇదంతా చూసిన ఇంద్రుడు(వెన్నెల కిషోర్) వీళ్ళ సంగతేంటో చూడమని తన అసిస్టెంట్ గుప్తా(గుండు సుదర్శన్)కి చెప్తాడు.
దీంతో గుప్తా వేరే లోకంలో వీళ్ళ లాగే ఉన్న మరో ముగ్గుర్ని తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడించి వాళ్ళను ఇక్కడికి వీళ్ళను అక్కడికి పంపిస్తారు. కొత్త లోకంలో అంతా సేమ్ ఇదే ఫ్యామిలీతో ఉంటుంది కానీ పరిస్థితులు వేరు ఉంటాయి. గంట రవి ఎమ్మెల్యేగా, రాహుల్ పెద్ద రైటర్ గా, విక్రమ్ పెద్ద కంపెనీకి సీఈఓగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కన్న కలలు అక్కడ కనిపించడంతో సంతోషిస్తారు. మరి ఈ ముగ్గురు వేరే లోకంలోనే ఉంటారా? ఆ లోకం నుంచి ఇక్కడకు వచ్చిన వాళ్లకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? దీని వల్ల ఎవరికీ ఏ ఇబ్బందులు వస్తాయి? మళ్ళీ ఎవరి లోకంలోకి వాళ్ళు ఎలా వస్తారు? ఇంద్రుడు ఏం చేస్తాడు? భార్యలతో ముగ్గురికి ఉన్న సమస్యలు తీరతాయా? భార్యలు భర్తల్ని అర్ధం చేసుకుంటారా.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Vanda Devullu Review : ‘వంద దేవుళ్ళు’ మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు..
సిరీస్ విశ్లేషణ..
భార్య – భర్తల మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య గొడవలతో ముగ్గురు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సిరీస్ గా సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించింది. దీంతో సీజన్ 3 పై కూడా అంచనాలు నెలకొన్నాయి. రెండో సిరీస్ లో మూడు జంటల మధ్య ఏదో ఒక సమస్య పెట్టి ఎండ్ చేసారు. అక్కడ నుంచే ఈ సీజన్ కథ మొదలవుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్ తో ప్రతి ఎపిసోడ్ సింపుల్ బ్యాంగ్ తో తెరకెక్కించారు.
భార్యల నుంచి తప్పించుకోవాలి, ఈ లైఫ్ వద్దు అనుకునే భర్తలకు వేరే లోకంలోకి షిఫ్ట్ అవ్వడం, తాము కోరుకున్న లైఫ్ ఉండటం అనే పాయింట్ తో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. రెండు లోకాలు అందరూ ఇద్దరు ఇద్దరుగా ఉండే కాస్త కన్ఫ్యూజన్ పాయింట్ తో ఈ సిరీస్ ని కూడా కామెడీగానే తెరకెక్కించారు. అయితే వేరే లోకం లైఫ్ లో డబ్బున్నా ఉండే కష్టాలు ఏంటి? వేరే లోకం వాళ్ళు ఇక్కడ ఏం కష్టాలు పడ్డారు అని ఈ సిరీస్ సాగుతుంది.
ఎప్పట్లాగే భార్య – భర్తల రిలేషన్ మీద చివర్లో కాస్త ఎమోషనల్ గా వర్కౌట్ చేయాలని ప్రయత్నించారు. కాసేపు అసలు వరల్డ్, కాసేపు ఇంకో వరల్డ్ అటు ఇటు చూపిస్తూ కామెడీతో కన్ఫ్యూజన్ తో ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నడిపించారు. పెళ్లి తర్వాత అమ్మ – భార్యల మధ్య భర్త రిలేషన్, భార్యల అనుమానాలు, భర్తలు నచ్చని పని చేయడం.. లాంటి పాయింట్స్ ని చర్చించారు. ఇక వెన్నెల కిషోర్ ని ఇంద్రుడిగా చూపించి అది కూడా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్చి కామెడీగా చూపించడంతో ఇంద్ర లోకంలో కొన్ని డైలాగ్స్, సీన్స్ మరీ ఓవర్ గా అనిపిస్తాయి.
ఎక్కడా బోర్ కొట్టకుండా అక్కడక్కడా నవ్వుతూ చూడొచ్చు. ఓపెనింగ్ లోనే గంట రవి, రాహుల్, విక్రమ్.. ఒకేలా ఉన్న ఇద్దరు ఇద్దర్ని చూపించి ఆశ్చర్యపరిచి అసలు కథలోకి తీసుకెళ్లారు. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కాస్త సాగదీశారు. చివరకు పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఎవరు ఏం చేయలేరు అనే రొటీన్ ఎండ్ మాములే. మరోసారి సేవ్ ది టైగర్స్ సిరీస్ లో ముగ్గురు భార్య – భర్తలు బాగానే నవ్విస్తారు. మరి సీజన్ 4 ఉంటుందా ఉండదా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఎలాంటి లీడ్ కూడా ఇవ్వలేదు. వుమెన్ ఎంపవర్మెంట్, మంచి చెడులు, అసలైన ఫెమినిజం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. యముడికి మొగుడు, దరువు.. లాంటి సినిమాలోని సీన్స్ గుర్తొస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్..
మొదట్నుంచి అందర్నీ మెప్పిస్తున్న మూడు జంటలు ప్రియదర్శి – హైమావతి, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ – దేవియని శర్మ ఈ సిరీస్ లో కూడా తమ పాత్రలతో బాగా నటించి మెప్పిస్తారు. అభినవ్ గోమఠం బాగా నవ్విస్తాడు కూడా. ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ పాత్ర గెస్ట్ అప్పీరెన్స్ లా మెరిపిస్తుంది. జబర్దస్త్ రోహిణి పాత్ర అలాగే కంటిన్యూ చేస్తూ క్లైమాక్స్ లో అదిరిపోయే యాక్షన్ తో ఆశ్చర్యపరుస్తుంది. గంగవ్వ, గుండు సుదర్శన్, హర్షవర్ధన్, ఝాన్సీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో వారు బాగానే నటించారు.
Also Read : Maa Inti Bangaram First Review : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ రివ్యూ.. సమంత సినిమా టాక్ ఏంటి?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. రెండు రెండు పాత్రలతో వేరే లోకం వాళ్ళను ఇక్కడకు ఇక్కడి వాళ్ళను వేరే లోకంలోకి మారిస్తే ఏం జరుగుతుంది అని ఆసక్తికర పాయింట్ తీసుకొని అదే భార్య భర్తల కాన్సెప్ట్ తో బాగానే రాసుకొని తెరకెక్కించారు దర్శక రచయితలు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ కూడా మొదటి రెండు సీజన్స్ లాగే నవ్విస్తుంది కానీ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. హ్యాపీగా చూసేయచ్చు. ఈ సిరీస్ కి 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
