Second Marriage Review : ‘సెకండ్ మ్యారేజ్’ వెబ్ సిరీస్ రివ్యూ.. భార్యాభర్తలు చూడాల్సిందే.. శోభనం రాత్రి సీన్‌తో మొదలుపెట్టి..
Second Marriage Web Series Review: రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా, జంటగా నటించడంతో ఈ సిరీస్ పై కాస్త ఆసక్తి నెలకొంది.
- Saketh U
- Updated on- July 30, 2026 / 06:33 PM IST
Second Marriage Web Series Review And Rating
Second Marriage Web Series Review : రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ సెకండ్ మ్యారేజ్. తమడా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్, సందీప్ నిర్మాణంలో రవి మహాదాస్యం దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కినది. సెకండ్ మ్యారేజ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో నేడు జులై 30 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే..
ఆకాష్(రవి మహాదాస్యం), చాందిని(మౌనిక రెడ్డి) ఇద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత శోభనం రోజు రాత్రి సీన్ తో కథ మొదలవుతుంది. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లి. దాంతో మొదటి రోజు రాత్రి ఇద్దరూ తమ తమ విషయాలు, అభిప్రాయాలు చెప్పుకుంటారు. ఈ క్రమంలో చాందిని కొంచెం సమయం, స్పేస్ కావాలని అడగడంతో ఓకే చెప్తాడు. తన భార్యని ఇంప్రెస్ చేయడానికి, తన ప్రేమని చూపించడానికి ఆకాష్ అన్ని విధాలుగా ట్రై చేస్తున్నా చాందిని మాత్రం ఇంకా స్పేస్ అంటూ అతన్ని దూరం పెడుతుంది. కొన్ని సార్లు ఆకాష్ మీద అరుస్తుంది కూడా.
అన్ని సైలెంట్ గా భరించిన ఆకాష్ తన పుట్టిన రోజు కూడా చాందిని తనని పట్టించుకోకపోవడంతో మొదటిసారి చాందిని మీద అరుస్తాడు. దాంతో చాందిని చెప్పకుండా తన పుట్టింటికి వెళ్తుంది. చాందిని మళ్ళీ తిరిగి వస్తుందా? అసలు వీళ్లిద్దరి మొదటి పెళ్లిళ్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఆకాష్ పెట్టే ఎఫర్ట్స్ చాందిని అర్ధం చేసుకుంటుందా? చాందిని – ఆకాష్ కలిసి హ్యాపీ కపుల్ అవుతారా తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే..
Also Read : Srinivasa Mangapuram Review : ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ రివ్యూ.. మహేష్ అన్న కొడుకు హీరోగా మెప్పించాడా?
సిరీస్ విశ్లేషణ..
ఈ సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ ఎప్పుడో సంవత్సరం క్రితం గ్లింప్స్ వచ్చినా, గతంలోనే రిలీజ్ అనౌన్స్ చేసినా వాయిదా పడి తాజాగా రిలీజ్ అయింది. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ లతో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా, జంటగా నటించడంతో ఈ సిరీస్ పై కాస్త ఆసక్తి నెలకొంది. ఇది ఆరు ఎపిసోడ్స్ గా చిత్రీకరించారు.
ఫస్ట్ ఎపిసోడ్ శోభనం సీన్ లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళ అంతరాత్మలు అందుకు కౌంటర్ ఇవ్వడం కాస్త ఫన్నీగా సాగుతుంది. వీళ్ళు ఇద్దరూ ఆ మొదటి రాత్రి నుంచి సపరేట్ గానే పడుకుంటారు అని ముందే ఊహిస్తాం. ఇక సెకండ్ ఎపిసోడ్ నుంచి ఆకాష్ తన భార్య ప్రేమ దక్కించుకోవాలని చేసే పనులతో క్యూట్ గా సాగుతుంది. కానీ వాటిని చాందిని పట్టించుకోకపోవడం, తాను ఇంకోలా రియాక్ట్ అవ్వడంతో తన పాత్ర మీద కోపం, ఆకాష్ పాత్ర మీద జాలి కలుగుతాయి. సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఓ బ్యాంగ్ తో ఏం అవుతుంది నెక్స్ట్ అనే ఆసక్తి అయితే నెలకొంటుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ కి మంచి ముగింపు రాసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఆసక్తి కలిగించారు. లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించము. మొదటి నుంచి దాని గురించి ప్రస్తావించినా ఎక్కడా అనుమానం రాకుండా క్లైమాక్స్ లో రివీల్ చేయడం బాగుంటుంది. రెండో పెళ్లి జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇద్దరూ ఎలా దగ్గరవుతారు, వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు వస్తాయి అని చాలా బాగా రాసుకున్నారు.
భార్య కోసం భర్త చేసే పనులు క్యూట్ గా బాగుంటాయి. కొత్తగా పెళ్లయిన భార్య భర్తలు ఈ సిరీస్ చూడాల్సిందే. అబ్బాయిలు పెట్టే ఎఫర్ట్స్ అమ్మాయిలు ఎలా అర్ధం చేసుకోరు, చాలా సార్లు అమ్మాయిల ఫీలింగ్స్ అబ్బాయిలే అర్ధం చేసుకోవాలి అనే విషయాన్ని చాలా సీన్స్ లో బాగా చూపించారు. కొని సీన్స్ లో ఎమోషనల్ కూడా అవుతాము. అక్కడక్కడా నవ్వుకుంటాము. ఫస్ట్ పెళ్లి ట్రామా నుంచి ఇంకా బయటకు రాని చాందిని క్లైమాక్స్ లో ట్విస్ట్ తో వెంటనే మారిపోతుంది. కానీ తన భర్త పెట్టే ఎఫర్ట్స్ ఇంకా అర్ధం చేసుకోకుండా అలా సింపుల్ గా ముగించడంతో ముగింపు కరెక్ట్ గా రాసుకోలేదు అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ రాకముందు వరకు రియాలిటీకి దగ్గరగా అనిపించినా ఆ ఒక్క ట్విస్ట్ తో సినిమాటిక్ అయిపొయింది అనిపిస్తుంది.
చాలా డైలాగ్స్ ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారు. అవి అందరికి అర్ధం కాకపోవచ్చు. టైటిల్ కార్డు మ్యూజిక్, విజువల్స్ బాగుంది. సిరీస్ ఆల్మోస్ట్ 90 శాతం ఒక ఇల్లు, ఆఫీస్ లోనే చిత్రీకరించారు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే మంచి అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తుంది. సిరీస్ అంతా కూడా ఎక్కువగా సీన్స్ కంటే మాటలతోనే నడుస్తుంది. మాటలతోనే నడిచే సినిమాలు, సిరీస్ లు ఇటీవల చాలా తక్కువగా వస్తున్నాయి. లవ్ స్టోరీస్, ఎమోషనల్ కంటెంట్, లైట్ హార్టెడ్ సినిమాలు నచ్చేవాళ్ళు ఈ సిరీస్ చూడొచ్చు. అక్కడక్కడా కొంత సాగదీత అనిపించొచ్చు. అబ్బాయిలకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇది సీజన్ 1 అని ప్రకటించారు కాబట్టి సీజన్ 2 ఉండే అవకాశం ఉండొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
రవి మహాదాస్యం తన భార్య ప్రేమ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసే పాత్రలో చాలా బాగా మెప్పించాడు. మౌనిక రెడ్డి కూడా ఫస్ట్ పెళ్లి ట్రామా నుంచి ఇంకా బయటకు రాకుండా రెండో పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది అనే పాత్రలో బాగా నటించింది. మిగిలిన నటీనటులు గెస్ట్ పాత్రల్లో వచ్చి పర్వాలేదు అనిపించారు. సినిమా అంతా ఇద్దరి మీదే ఎక్కువగా నడిచినా బోర్ కొట్టకుండా సాగుతుంది.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒక ఇల్లు, ఆఫీస్ లోనే 90 శాతం సినిమా షూట్ చేసినా విజువల్స్ కొత్తగానే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు యావరేజ్. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని సాగదీత సీన్స్ కట్ చేస్తే బెటర్. రవి మహాదాస్యం మెయిన్ లీడ్ లో నటిస్తూనే దర్శకుడిగా రచయితగా చాలా బాగా డీల్ చేశాడు. నిర్మాణ పరంగా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సిరీస్ ని తెరకెక్కించారు అని తెలుస్తుంది.
మొత్తంగా ‘సెకండ్ మ్యారేజ్’ రెండో పెళ్లి తర్వాత భార్యాభర్తల రిలేషన్ మీద తీసిన క్యూట్ ఎమోషనల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కి 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
