Godari Gattupaina : ‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ.. ఆటో డ్రైవర్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవ్వాల్సిందే..

గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో జరిగే రెగ్యులర్ ప్రేమకథ. ఓ ఆటో డ్రైవర్ - ఓ కాలేజీ స్టూడెంట్ ప్రేమకథతో పాటు తండ్రి ఎమోషన్ కూడిన సినిమా. (Godari Gattupaina)

Godari Gattupaina

Godari Gattupaina Movie Review : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా తెరకెక్కిన సినిమా గోదారి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మాణంలో సుభాష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జగపతి బాబు, దేవి ప్రసాద్, లైలా, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, రాజీవ్ కనకాల.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. గోదారి గట్టుపైన సినిమా మే 8న థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

రాజు(సుమంత్ ప్రభాస్) మంచి ఆటోడ్రైవర్. భీమవరం దగ్గర్లో ఓ పల్లెటూరు. రోజు వాళ్ళ ఊరి నుంచి భీమవరంకు ఆటో నడుపుకుంటాడు. తన చెల్లితో పాటు చదువుకునే మాయ(నిధి ప్రదీప్)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ గొడవలో మాయని చెంపదెబ్బ కొడతాడు రాజు. అప్పట్నుంచి మాయ కూడా రాజుని ఇష్టపడుతుంది. ఇద్దరూ దగ్గరయి ప్రేమించుకుంటూ తిరుగుతూ ఉంటారు.

మాయ తండ్రి శ్యామ్ బాబు(జగపతి బాబు)ఓ సెక్యూరిటీ గార్డ్. కూతురంటే ప్రాణం. కుతూర్లో మార్పు గమనించి కంగారు పడతాడు. రాజు పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి ఇకపై తనను కలవొద్దు అని కొట్టి మరీ చెప్పి దూరమవుతుంది మాయ. అసలు మాయ ఎందుకు దూరమయింది? రాజు – మాయ మళ్ళీ కలుస్తారా? శ్యామ్ బాబుకి కూతురు ప్రేమ విషయం తెలిసి ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Thimmarajupalli tv OTT: ఓటీటీలోకి రూరల్‌ కామెడీ డ్రామా.. ‘తిమ్మరాజుపల్లి TV’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సినిమా విశ్లేషణ..

దాదాపు 100 షార్ట్ ఫిలిమ్స్ తీసి గతంలో యూత్ ని మెప్పించిన డైరెక్టర్ సుభాష్ చంద్ర మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మేమ్ ఫేమస్ లాంటి మొదటి సినిమాతోనే హీరోగా, దర్శకుడిగా హిట్ కొట్టిన సుమంత్ ప్రభాస్ రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్, వాళ్ళ ఫ్యామిలీల పాత్రలు, పరిచయాలు, హీరో – అతని ఫ్రెండ్స్ చేసే కామెడీ, రాజు – మాయ ప్రేమలో పడి దగ్గరవడం, శ్యామ్ బాబు కూతురు గురించి భయపడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి మాయ రాజుని ఇంకెప్పుడు కలవొద్దు అని చెప్పడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ వీరి ప్రేమతో పాటు తండ్రి ఎమోషన్, అక్కడక్కడా కామెడీతో నడుస్తుంది.

గోదారి గట్టుపైన సినిమా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక రెగ్యులర్ ప్రేమకథ. ఓ ఆటో డ్రైవర్ – ఓ కాలేజీ స్టూడెంట్ ప్రేమకథతో పాటు తండ్రి ఎమోషన్ కూడిన సినిమా. చాలా స్ట్రిక్ట్ గా ఉండే అమ్మాయి ఒక అబ్బాయి చెంపదెబ్బ కొట్టగానే ప్రేమలో ఎలా పడిపోతుంది అనే లాజిక్స్ వదిలేస్తే సినిమా అంతా క్యూట్ గా ఉంటుంది. క్యూట్ లవ్ స్టోరీని చాలా న్యాచురల్ గా, పచ్చని పొలాలు, పల్లెటూళ్ళ మధ్య అందంగా చూపించారు. కామెడీ మాత్రం ఫుల్ గా నవ్వుకోవచ్చు. హీరో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్.. ఇలా అందర్నీ ఒక్కో మతానికి సంబంధించిన వాళ్ళని పెట్టి దానికి తగ్గట్టు సీన్స్ రాసుకొని ఈ మతాలు ప్రేమకు అడ్డురావు అనే రొటీన్ మెసేజ్ ఇవ్వడం గమనార్హం.

ఇక ఆటో డ్రైవర్స్ అయితే ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవ్వొచ్చేమో. హీరో ఆటో డ్రైవర్ కావడం, ఆటో రేసింగ్ సీన్స్, ఆటో డ్రైవర్ ప్రేమకథ, ఆటో డ్రైవర్స్ అంటే కొంతమంది తక్కువగా చూస్తారు, వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు అనే మెసేజ్ ఇవ్వడం.. ఇవన్నీ ఆటో డ్రైవర్స్ కి కనెక్ట్ అవ్వొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ప్రేమకథ, క్లైమాక్స్ బాగా సాగదీశారు. సుభాష్ చంద్ర షార్ట్ ఫిలింస్ లో ఉండే ఆ క్యూట్ నెస్ మాత్రం కనిపిస్తుంది. క్యూట్ గా, నిదానంగా సాగదీసే ప్రేమకథలు నచ్చేవాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు. గోదావరి బ్యాక్ డ్రాప్ కావడంతో మనుషులు అంతా మంచోళ్ళు అనే రేలంగి మామయ్య పాత్రలాగా హీరో, హీరో ఫ్యామిలీని మరీ అతి మంచితనంగా చూపించడం విశేషం. సమ్మర్ లో కాస్త సాగదీసిన ఓ క్యూట్ ప్రేమకథని చూడాలనుకుంటే గోదారి గట్టుపైన సినిమా చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సుమంత్ ప్రభాస్ చాలా బాగా, ఫుల్ ఎనర్జీతో నటించాడు. గోదావరి యాస కోసం చాలా బాగా కష్టపడ్డాడు. ఈ విషయంలో మాత్రం కొందరు హీరోలు సుమంత్ ని చూసి నేర్చుకోవాల్సిందే. నిధి ప్రదీప్ క్యూట్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. జగపతి బాబు కూతురు కోసం ఆలోచించే తండ్రి పాత్రలో మెప్పించారు. చాన్నాళ్ల తర్వాత ఒకప్పటి హీరోయిన్ లైలా ఈ సినిమాలో సైలెంట్ గా ఉండి అప్పుడప్పుడు ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడే పాత్రలో కనిపించడం గమనార్హం.

సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి కనపడిన ప్రతిసారీ ఫుల్ గా నవ్విస్తారు. రీను అనే నటి కూడా గలగలా మాట్లాడుతూ క్యూట్ గా మెప్పిస్తుంది. దేవి ప్రసాద్, శ్రీవాణి హీరో పేరెంట్స్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. శ్రీ లాస్య, వైవా రాఘవ, రోహిత్ కృష్ణ వర్మ, రాజీవ్ కనకాల, హర్ష వర్ధన్.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : AGADHA Teaser : గూస్ బంప్స్ తెప్పిస్తున్న అగ‌ధ టీజ‌ర్‌..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. భీమవరం, ఆ చుట్టుపక్కల చాలావరకు రియల్ లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు తన స్టైల్ లో తనకి తెలిసిన ఓ ప్రేమకథాని అందంగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు, నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘గోదారి గట్టుపైన’ సినిమా భీమవరం చుట్టుపక్కల జరిగే ఓ ఆటో డ్రైవర్ – కాలేజీ స్టూడెంట్ ప్రేమకథకి తండ్రి ఎమోషన్ జోడించి తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.