Tatvam Review : ‘తత్వం’ మూవీ రివ్యూ.. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..

మన దగ్గర థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అది. (Tatvam Review)

  • Published on- October 2, 2026 / 07:03 AM IST

Tatvam Review

Tatvam Review : దినేష్‌ తేజ్‌, దష్విక జంటగా తెరకెక్కిన సినిమా ‘తత్వం’. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ పై శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ నిర్మాణంలో అర్జున్‌ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తత్వం సినిమా నేడు అక్టోబర్ 2న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు.

కథ విషయానికొస్తే..

రామాపురం అనే ఊళ్ళో మూర్తి(సుక్కురెడ్డి), నాగమణి అనే జంటని వాళ్ళ మతిస్థిమితం లేని కొడుకు సుధ చంపాడనే నెపంతో ఆ ఊరి వాళ్లంతా సుధని పట్టుకొని కొడతారు. అదే సమయంలో ఆ ఊరికి సౌమ్య(దాశ్విక)ని పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తాడు కానిస్టేబుల్ కళ్యాణ్(దినేష్ తేజ్). దీంతో ఆ మర్డర్ కేసు రిపోర్ట్ రాసుకు రమ్మని SI కళ్యాణ్ కే చెప్తాడు. ఊళ్ళో అందరూ ఆ హత్యలు సుధనే చేసాడని చెప్పినా సౌమ్య అతను అలాంటి వాడు కాదు అని చెప్తుంది. రెండు రోజులు అయినా ఏమి తేలకపోవడంతో SI ఫోన్ చేసి సుధని తీసుకొని వచ్చేయమంటాడు.

తీరా అక్కడికి వెళ్లి చూస్తే రామాపురంకు చెందిన వడ్డీ వ్యాపారి కిషోర్ బాబే(శరత్ బాబు) ఆ హత్య రిపోర్ట్ రాసి ఇచ్చి సుధనే మర్డర్ చేసాడని కేసు క్లోజ్ చేయించమంటాడు. SI.. కళ్యాణ్ కి ఆ కేసు వదిలేయమని చెప్పి వేరే కేసుని ఇస్తాడు. కానీ కళ్యాణ్ కి కొన్ని అనుమానాలు రావడంతో మళ్ళీ రామాపురం వెళ్లి విచారణ మొదలుపెడతాడు. అసలు మూర్తి, నాగమణి లను ఎవరు చంపారు? సుధ నిజంగానే వాళ్ళని చంపాడా? సౌమ్య ఎందుకు సుధకు సపోర్ట్ చేస్తుంది? ఈ కేసుని కళ్యాణ్ ఛేదించాడా? మూర్తి, నాగమణిల కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Dorothy Review : ‘డోరతి’ మూవీ రివ్యూ.. బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అయితే.. క్లైమాక్స్ ఏంట్రా బాబు ఇలా ఉంది..

సినిమా విశ్లేషణ..

థ్రిల్లర్ స్టైల్ లో ఉన్న ట్రైలర్ తో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది. మన దగ్గర థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అది. ఫస్ట్ హాఫ్ లో ఊళ్ళో మర్డర్ జరగడంతో మొదలయి కళ్యాణ్ పాత్ర పరిచయం, కళ్యాణ్ ఊరికి రావడం, అక్కడ మర్డర్ గురించి ఊళ్ళో వాళ్ళతో చర్చలు, సౌమ్యతో ట్రావెలింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి SI సుధని తీసుకొని కళ్యాణ్ ని వచ్చేయమనడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది? హంతకుడు ఎవరు అనేది ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా విచారణ కొనసాగించి ప్రీ క్లైమాక్స్ లో అసలు ఏం జరిగిందో ఓ ట్విస్ట్ తో రివీల్ చేస్తారు.

ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసారు. అక్కర్లేని ఓ సాంగ్, కొన్ని వర్కౌట్ అవ్వని కామెడీ సీన్స్ తో ల్యాగ్ చేసారు. ఫస్ట్ హాఫ్ లో అసలు విచారణ ఎక్కడా సరిగ్గా జరగదు. మధ్యమధ్యలో హీరో – హీరోయిన్ క్యూట్ సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా మర్డర్ ఎవరు చేశారనే క్యూరియాసిటీ, అందరి మీద అనుమానాలతో సాగుతుంది. వేరే కేసు డీల్ చేస్తుంటే అది ఈ కేసుకి కనెక్ట్ అయ్యే లింక్స్ బాగా రాసుకున్నారు. అసలు ఎవరు చేసారు ఈ మర్డర్ అనేది ఊహించలేము. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఎవరూ ఊహించలేరు. ఆ ట్విస్ట్ సినిమాకు చాలా ప్లస్ అయినా, దానికి బ్యాక్ డ్రాప్ చెప్పిన కథ మాత్రం గతంలో చాలా సినిమాల్లో ఉన్నదే. సీక్వెల్ ప్రకటించకపోయినా ఓపెన్ ఎండింగ్ తో పార్ట్ 2 ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళు ఫస్ట్ హాఫ్ కొంత ఓపిక పడితే ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

దినేష్ తేజ్ కానిస్టేబుల్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ చేసే పాత్రలో బాగా నటించాడు. లవ్ సీన్స్ లో కూడా మెప్పించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన తెలుగమ్మాయి దష్విక క్యూట్ గా హాఫ్ శారీలలో పల్లెటూరి యువతి పాత్రలో మెప్పించింది. తనకు నటన పరంగా అంత స్కోప్ లేకపోయినా భవిష్యత్తులో మంచి లవ్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మానసిక స్థితి సరిగ్గా లేని పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా నటించాడు. ప్రమోదిని, కృష్ణ, ఆనంద్ భారతి, సుక్కు రెడ్డి, శరత్ బాబు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Dont Trouble the Trouble Review: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ రివ్యూ.. పిల్ల దయ్యాన్ని హీరో కిడ్నాప్ చేస్తే..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు బాగున్నాయి. సినిమా అంతా ఏలూరు, చుట్టుపక్క గ్రామాల్లో రియల్ లొకేషన్స్ లో తీయడంతో రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి విజువల్స్. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఓ సాంగ్, కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ కట్ చేయాల్సింది. మిక్సింగ్ లో సౌండ్ లెవల్స్ సరిగ్గా సెట్ చేసుకోలేదు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. మర్డర్ మిస్టరీలో థ్రిల్లింగ్ పాయింట్ ని బాగానే రాసుకున్నా అక్కర్లేని సీన్స్ తో కొంత సాగదీసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘తత్వం’ సినిమా ఓ ఇన్వెస్టిగేషన్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.