Jana Nayakudu Review : ‘జన నాయకుడు’ రివ్యూ.. విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉందంటే.. భగవంత్ కేసరి రీమేకేనా?

తమిళనాడు స్టార్ హీరో విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక ఇదే నా చివరి సినిమా అని జన నాయగాన్ ప్రకటించారు. (Jana Nayakudu Movie Review)

  • Updated on- July 23, 2026 / 01:40 PM IST

Jana Nayakudu Review

Jana Nayakudu Review : విజయ్, పూజాహెగ్డే, మమితబైజు, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ సినిమా జన నాయగన్. తెలుగులో జన నాయకుడు పేరుతో రిలీజ్ అయింది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ K నారాయణ నిర్మాణంలో H వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు జులై 23న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

దళపతి వెంట్రి కొండన్(విజయ్) జైల్లో ఖైదీగా ఉంటాడు. ఆ జైలు హెడ్(గౌతమ్ మీనన్) దళపతి తల్లి చావుకు వెళ్లనివ్వడంతో అతని జాబ్ పోతుంది. దళపతి జైలు నుంచి బయటకు వచ్చాక ఆ జైలు హెడ్ ని కలుస్తాడు. ఆ జైలు హెడ్ కూతురు విజ్జి(మమిత బైజు) దళపతికి క్లోజ్ అవుతుంది. అనుకోకుండా ఓ యాక్సిండెంట్ లో జైలు హెడ్ చనిపోవడంతో ఎవరు లేని విజ్జిని తనే పెంచుతాడు. తనని ఆర్మీ ఆఫీసర్ చేస్తానని విజ్జికి తండ్రికి ఇచ్చిన మాట కోసం దళపతి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విజ్జి ఓ అబ్బాయిని ప్రేమించి ఆర్మీ ఇష్టం లేదని దళపతిని దూరం పెడుతుంది.

టెర్రరిస్ట్ హెల్మర్(బాబీ డియోల్) ఓ బొమ్మల కంపెనీ సాయంతో ఇండియాలోకి తుపాకులను పంపిస్తూ ఉంటాడు. మరో పక్క రోజా రంగస్వామి(ప్రకాష్ రాజ్)సీఎం అవ్వాలని చూస్తూ ఉంటాడు. అనుకోకుండా విజ్జి హెల్మర్ కి సంబంధించిన ఓ ఘటనలో ఇరుక్కుంటుంది. దీంతో హెల్మర్ మనుషులు విజ్జి వెంట పడతారు. విజ్జి కోసం దళపతి రావడంతో హెల్మర్ – దళపతిలకు తమ గతం గుర్తొస్తుంది. అసలు హెల్మర్ గతం ఏంటి? గతంలో హెల్మర్ – దళపతికి ఉన్న సమస్య ఏంటి? విజ్జి ఆర్మీ ఆఫీసర్ అవుతుందా? టెర్రరిస్ట్ హెల్మర్ ఇండియాలో ఏం ప్లాన్ చేసాడు? దళపతి గతం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Vijay Title Card: విజయ్ లాస్ట్ సినిమా ‘జన నాయగన్’ రిలీజ్.. హీరో టైటిల్ కార్డ్ అదిరిందిగా.. వేరే లెవల్ అయ్యా..

సినిమా విశ్లేషణ..

తమిళనాడు స్టార్ హీరో విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక ఇదే నా చివరి సినిమా అని జన నాయగాన్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్, తమిళ ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఇక విజయ్ సీఎం అవ్వడం, ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ కి అక్కడ గత ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించడంతో ఈ సినిమాకు మరింత హైప్ నెలకొంది. ఇక ఇది మన బాలయ్య భగవంత్ కేసరి సినిమా రీమేక్ కావడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

భగవంత్ కేసరిలోని బాలకృష్ణ – శ్రీలీల కథ, కథనం, సీన్స్ మొత్తం మక్కీకిమక్కి ఈ సినిమాలో దించేశారు. అయితే బాలయ్య ఫ్లాష్ బ్యాక్ లో కొంత తీసుకొని దానికి అదనంగా ఇందులో మరో ఫ్లాష్ బ్యాక్ రాసుకున్నారు. భగవంత్ కేసరిలో ఓ వ్యక్తి, ఓ పొలిటీషియన్, ఓ ప్రాజెక్టు గొడవతో అయిపోతే ఇక్కడ టెర్రరిజం, మతాల గొడవలు, పాలిటిక్స్ అంటూ ఎక్కడికో తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా తలపతి, విజ్జి కథతోనే సాగుతుంది. మధ్యమధ్యలో విలన్ ఎలివేషన్ సీన్స్ కే 20 నిముషాలు తీసుకున్నారు. ఏదో ఆఫ్రికా దేశం, అక్కడ విలన్ హవా.. ఇదంతా ఇంత అవసరమా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి హీరో – విలన్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనే ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మాత్రం కొత్తగా రాసుకున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎక్కువ విలన్ కథనంతోనే ఉండటం గమనార్హం. ఇక క్లైమాక్స్ విలన్ చేసే మారణహోమం, ఎవరూ ఎదుర్కోలేని దాన్ని హీరో ఎదుర్కొని ఫైట్ చేయడం లాంటి మాస్ క్లైమాక్స్ తో ముగిస్తారు.

మొదటి నుంచి కూడా హీరో ఎలివేషన్స్ లో ఎక్కడా తగ్గలేదు. విజయ్ పార్టీకి తగ్గట్టు ఏనుగు సింబల్స్, పిడికిలి సింబల్, TVK పార్టీ పేరు.. ఇలా పొలిటికల్ గా విజయ్ కి పనికొచ్చే ఎలివేషన్స్ అన్ని బాగానే ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల మీద ఫుల్ సెటైర్లు వేశారు. పొలిటికల్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. తమిళ దివంగత నేత, హీరో MGR రిఫరెన్స్ లు కూడా బాగానే వాడుకున్నారు. విజయ్ లాస్ట్ సినిమా అని ట్రిబ్యూట్ లాగా డ్యాన్సులు, డైలాగ్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేసారు. ఫ్లాష్ బ్యాక్ మాత్రం బాగా సాగదీశారు. అక్కర్లేకపోయినా వచ్చే సాంగ్స్ కథకి అడ్డంగా ఉంటాయి.

భగవంత్ కేసరి కాజల్ పాత్ర కంటే ఇందులో పూజాహెగ్డే పాత్రను మాత్రం బాగా రాసుకున్నారు. కథకు కరెక్ట్ గా ఆ పాత్ర సెట్ అయింది అనిపిస్తుంది. ఆడపిల్లలు చదవాలి, ఎదగాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్.. అనే సీన్స్ మొత్తం భగవంత్ కేసరి నుంచి దించేశారు. క్లైమాక్స్ లో భవిష్యత్తులో రోబోటిక్ యుద్దాలు ఎలా జరుగుతాయి అనే ఓ శాంపిల్ సీన్ మాత్రం చూపించి భయపెడతారు. ఆ రోబోటిక్ యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక ఇండియాలో మతాలు, కులాలు గొడవలతో ప్రజలు విడిపోతున్నారు, ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యం అనే సందేశాలు ఇచ్చారు. భగవంత్ కేసరి చూసినా ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ మొత్తం మార్చుకున్నారు కాబట్టి ఈ సినిమా కూడా చూడొచ్చు. క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ఊహించము. హీరో టైటిల్ కార్డు మాత్రం బాగుంది. సీఎం విజయ్ అంటూ ఇచ్చిన ఇంట్రో అదిరిపోయింది. మొత్తంగా ఇది విజయ్ ఫ్యాన్స్ కి అయితే పండగ.

నటీనటుల పర్ఫార్మెన్స్..

విజయ్ ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. ఈసారి ఫ్యాన్స్ కోసం మరిన్ని డైలాగ్స్, ఎలివేషన్స్, డ్యాన్సులతో అదరగొట్టాడు. మమిత బైజు కూతురు పాత్రలో బాగానే నటించింది. ఇన్నాళ్లు క్యూట్ గా లవ్ స్టోరీలలో కనిపించిన మమిత ఇందులో అమాయకంగా, క్లైమాక్స్ లో యాక్షన్ తో బాగానే మెప్పించింది. పూజాహెగ్డే కూడా తన పాత్రలో బాగానే నటించింది.

బాబీ డియోల్ మాత్రం నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. ప్రకాష్ రాజ్ కూడా నెగిటివ్ షేడ్స్ లో మెప్పించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్, నరైన్, రేవతి, బాబా భాస్కర్, రైచెల్ రెబెక్కా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. క్లైమాక్స్ లో విజయ్ గత సినిమాల దర్శకులు, తమిళ్ స్టార్ డైరెక్టర్స్ నెల్సన్ దిలీప్, అట్లీ, లోకేష్ కనగరాజ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం గమనార్హం.

Also Read : Chiranjeevi Chennai Love Story : మెగాస్టార్ గెస్ట్‌గా.. కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టారు. హీరో, విలన్ ఎలివేషన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. పాటలు మాత్రం ఒక్కటి కూడా మెప్పించలేదు. ఎడిటింగ్ లో విలన్ సీన్స్, క్లైమాక్స్ లో కొన్ని గొడవల సీన్స్ కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం కొత్తగా రోబోస్ తో డిజైన్ చేసుకోవడం బాగుంది. భగవంత్ కేసరి కథ తీసుకున్నా దానికి అదనంగా మరింత ఫ్లాష్ బ్యాక్ రాసుకొని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు చాలా ఎక్కువే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘జన నాయకుడు’ సినిమా భగవంత్ కేసరి రీమేక్ తో పాటు విజయ్ పొలిటికల్ కి ఓ విజిటింగ్ కార్డు లాంటి సినిమా. విజయ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.