Toxic Review : ‘టాక్సిక్’ మూవీ రివ్యూ.. పిల్లల్ని మాత్రం తీసుకెళ్లొద్దు.. కేవలం పెద్దలకు మాత్రమే..
Toxic Movie Review : ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
- Saketh U
- Updated on- August 26, 2026 / 12:24 PM IST
Toxic Review
Toxic Review : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి వచ్చిన ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టాక్సిక్ సినిమా నేడు ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ నారాయణ నిర్మాణంలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటించారు.
కథ విషయానికొస్తే..
ఈ కథ 1947 స్వాతంత్య్రం వచ్చాక గోవాలో పోర్చుగీస్ పాలన ఉన్నప్పుడు జరుగుతుంది. రాయ(యశ్), అతని అక్క గంగ(నయనతార) 20 ఏళ్ళ క్రితం తమ తండ్రిని చంపిన వాళ్ళని చంపి గోవాని ఏలాలి అనుకుంటారు. ఈ క్రమంలో ఫెర్నాండేజ్ ని చంపి గోవాని ఏలుతున్న అతని అన్న సెల్వడర్(డారెల్ సిల్వా)తో చేతులు కలిపి ఓపియం డ్రగ్స్ బిజినెస్ ని విస్తరించి పెద్ద గ్యాంగ్ స్టార్ అవుతాడు రాయ. సెల్వడర్ కూతురు రెబెకా(తారా సుతారియా)తో రాయ తన ఎదుగుదల కోసం సంబంధం పెట్టుకొని పెళ్లి దాకా వెళ్తాడు. ఈ మధ్యలో అక్కడ సర్కస్ ని నడిపించే నదియా(కియారా)ని ఇష్టపడి ఆమెని ప్రేమిస్తాడు రాయ.
నదియా ప్రగ్నెంట్ కూడా అవుతుంది. సెల్వడర్, రెబెకాలకు రాయ – నదియాల రిలేషన్ షిప్ నచ్చదు. సెల్వడర్ నదియాని చంపేస్తానని రాయకి చెప్తాడు. మరి రాయ ఏం చేస్తాడు? గోవాని ఏలుతాడా? నదియాకి పుట్టిన బిడ్డ ఏమవుతాడు? రాయ నదియాతో ఉంటాడా? రెబెకాతో ఉంటాడా? ఈ మధ్యలో సెల్వడర్ దగ్గర ఉండే ఎలిజిబిత్ ఏం చేస్తుంది? గంగ తన తమ్ముడిని ఎలా మారుస్తుంది? ఎవరు ఎవరికి శత్రువులు అవుతారు? ఈ కథలోకి మెలిసా(రుక్మిణి) ఎక్కడ్నుంచి వచ్చింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Toxic Twitter Review : టాక్సిక్ ట్విట్టర్ రివ్యూ.. యశ్ అదరగొట్టాడు.. కానీ..?
సినిమా విశ్లేషణ..
కెజిఎఫ్ తర్వాత సినిమా కావడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్ లో అడల్ట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్స్ కూడా వస్తాయని అంచనా వేశారు. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేసారు.
ఫస్ట్ హాఫ్ కియారా సీన్ తో లీడ్ ఇచ్చి రాయ(యశ్) కొడుకు కథని నేరేట్ చేస్తున్నట్టు మొదలుపెడతారు. రాయ, గంగ చిన్నప్పటి సీన్స్, వాళ్ళ ఎమోషన్స్ తో రొటీన్ సీన్స్ తోనే ఫ్లాష్ బ్యాక్ ని చెప్పారు. సెల్వడర్ తో చేతులు మొదలు పెట్టి బిజినెస్ చేస్తున్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారినా రొటీన్ డ్రగ్స్ బిజినెస్, గ్యాంగ్ స్టర్ గొడవలు, సెల్వడర్ కూతురుతో రొమాన్స్, తాగడం, ఫైట్స్ తోనే సరిపోతుంది. కియారా ఎంట్రీ నుంచి కథ ఆసక్తిగా మారడం అక్కడో చిన్న ట్విస్ట్. రాయ – నదియా రొమాన్స్ లతో కాస్త ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించలేని ఓ షాకింగ్ సీన్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఊహించిన సీన్ తోనే మొదలయి మళ్ళీ రాయ ఇంకా ఎదిగినట్టు రొటీన్ తాగుడు, అమ్మాయిలు, కాసినో, యాక్షన్ సీక్వెన్స్ లతో బాగా సాగదీశారు. రుక్మిణి ఎంట్రీ సేన్ బాగున్నా ఆ తర్వాత మళ్ళీ రుక్మిణితో కూడా మాములే. అయితే ప్రీ క్లైమాక్స్ లో యంగ్ యశ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్. అసలు ఆ ట్విస్ట్ మాత్రం ఊహించము.
హాలీవుడ్ స్టైల్ లో ఎమోషన్స్ పండిద్దాం, కొత్తగా విజువల్స్ చూపిద్దాం అనుకున్నా ఆ ఎమోషనల్ సీన్స్ ఏవి కూడా పండలేదు. తండ్రి కొడుకుల ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు. అక్క తమ్ముడు ఎమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ స్టోరీ, కెజిఎఫ్ తర్వాత చాలా సినిమాల్లో వచ్చిన రొటీన్ యాక్షన్ సీక్వెన్స్. నరుక్కోవడం,కాల్చడం, పేల్చడం.. ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం కొత్తగా ట్రై చేసారు. హీరో వరుసపెట్టి అమ్మాయిలతో రొమాన్స్ చేయడం లాంటి సీన్స్ అడల్ట్ సీన్స్ రేంజ్ లో చూపించారు. ఇక తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ గూగుల్ ట్రాన్స్ లేషన్ చేసినట్టు అచ్చ తెలుగు పాత పదాలతో ఉన్నాయి. కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. అయితే అసలు బేసిక్ కథ అంటూ ఏమి లేదు. ఇంటర్వెల్ తర్వాత రాసుకున్న కథ పూర్తయినా క్లైమాక్స్ కోసం సెకండ్ హాఫ్ లో అక్కర్లేని రాటెన్ గ్యాంగ్ స్టర్ సీన్స్ తో సాగదీశారు. అసలు కథ లేకుండా స్క్రీన్ ప్లేలో కొంత కన్ఫ్యూజ్ వస్తుంది. కెజిఎఫ్ చూసి అవసరాలేకపోయినా సీన్స్ మధ్యలో బ్లాంక్ సీన్స్ పెట్టే ఆలోచన వచ్చినట్టుంది దర్శకురాలికి. యశ్ ఎంత కష్టపడ్డా సరైన కథ, స్క్రీన్ ప్లే లేకపోతే అది వృధానే అవుతుంది. కెజిఎఫ్ లో తల్లి కోసం ఎదుగుతాడు హీరో. ఇక్కడ అక్క కోసం ఎదుగుతాడు హీరో. అంతే తేడా. అందులో ఎమోషన్ పండింది. ఇందులో ఎమోషన్ పండలేదు. క్లైమాక్స్ లో మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా గుర్తొస్తుంది. యాక్షన్ అడల్ట్ సినిమా కాస్త ఒక్కసారిగా సైకాలజీ సినిమాగా మారిపోతుంది. పిల్లలతో, పేరెంట్స్ తో అయితే వెళ్లడం కష్టమే. ఎలాగో A సర్టిఫికెట్ సినిమా కాబట్టి పిల్లని రానివ్వరు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించడం అనే కాన్సెప్ట్ తో ఈ కథ రాసుకున్నట్టు సినిమా అంతా అయ్యాక అర్ధమవుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
యశ్ మాత్రం తన స్టైలిష్ లుక్స్ తో, పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. కెజిఎఫ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఈ సినిమాలో కూడా అదే మెయింటైన్ చేసాడు. ముసలివాడిగా, యంగ్ కుర్రాడిగా కూడా మూడు వేరియేషన్స్ లో కొత్త లుక్ లో కూడా తన నటనతో మెప్పిస్తాడు యశ్. కియారా అద్వానీ సర్కస్ ఫీట్స్ చేసే మహిళ పాత్రలో కనిపించి ఎమోషన్స్ బాగానే పండించింది. అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో కూడా రెచ్చిపోయి మరీ నటించింది కియారా.
తారా సుతారియా కూడా రొమాన్స్ సీన్స్, ఓ ఎమోషనల్ సీన్ లో బాగానే నటించింది. హ్యూమా ఖురేషి పర్వాలేదు అనిపించింది. నయనతార మాత్రం సెటిల్డ్ పాత్రలో తమ్ముడ్ని చూసుకునే పాత్రలో పర్వాలేదు అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లతో కూడా మెప్పిస్తుంది నయన్. రుక్మిణి వసంత్ చివర్లో వచ్చి మోడ్రన్ లుక్స్ లో నటన పరంగా పర్వాలేదు అనిపిస్తుంది. చివరి వరకు హీరో పక్కనే ఉండే పాత్రలో సుదేవ్ నాయర్ బాగానే మెప్పించాడు. అక్షయ్ ఒబెరాయ్, డారెల్ సిల్వా, మరికొంతమంది వేరే దేశాల నటులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also See : Manasa Varanasi : ఓనం స్పెషల్.. చీరకట్టులో తెలుగు నటి.. ఫోటోలు వైరల్
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. ఎలివేషన్ సీన్స్ కి కూడా పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడలేదు. ఒక్క తబాయి సాంగ్ తప్ప మిగిలినవి ఏవి వినలేము. సెకండ్ హాఫ్ లో సాగదీసిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేసేయొచ్చు. యశ్, నయన్ ఫ్లాష్ బ్యాక్ కూడా కొంత కట్ చేయొచ్చు. ఒక మాములు రొటీన్ కథ తీసుకొని దాన్ని హై యాక్షన్ అడల్ట్ సీన్స్ తో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేసింది దర్శకురాలు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. చాలా సెట్స్ కోసం, యాక్షన్ సీక్వెన్స్ ల కోసం బాగానే ఖర్చుపెట్టారు. పీరియాడిక్ సెట్స్, సర్కస్, గోవా, హిమాలయాల మంచు సెటప్, కాసినో.. వీటన్నిటికోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం బాగానే కష్టపడింది.
మొత్తంగా ‘టాక్సిక్’ ఎలా అయినా ఎదగాలి అనుకునే ఓ హీరో, తండ్రి కొడుకు ఎమోషన్ తో సాగిన యాక్షన్ అడల్ట్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
