29 Movie Review : ’29’ మూవీ రివ్యూ.. అబ్బాయిలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..

తమిళ్ లో థియేటర్స్ లో రిలీజయినప్పుడు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. (29 Movie Review)

  • Updated on- June 9, 2026 / 02:24 PM IST

29 Movie Review

29 Movie Review : విధు, ప్రీతి అస్రాని జంటగా తెరకెక్కిన సినిమా ’29’. కార్తికేయన్, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో రత్న కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మాస్టర్ మహేంద్రన్, అవినాష్, ప్రేమ్ కుమార్, ఆదిరా పాండీలక్ష్మి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. మే 8న తమిళ్ లో థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

కథ విషయానికొస్తే..

సత్య(విధు) ఓ విలేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయి. తన తల్లి ఊరి బాగు, చెరువులు, చెట్లు, పర్యావరణం అంటూ తిరుగుతుంది. ఇది నచ్చక అగ్రికల్చర్ చదివిన సత్య చెన్నైలో ఓ కోర్స్ చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరుతాడు. అదే ఆఫీస్ లో విజు(ప్రీతి అస్రాని) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడి సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విజుకి ఐఏఎస్ అవ్వాలని జీవిత లక్ష్యం. భర్త వదిలేసినా తన తల్లి కష్టపడి తనని చదివించిందని జాబ్ మానేసి ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతుంది. దీంతో సత్య – విధు మధ్య దూరం వస్తుంది.

సత్య పేరెంట్స్ కి తన ప్రేమ గురించి చెప్తాడు. ఓ రోజు చెన్నైకి వచ్చిన సత్య పేరెంట్స్ విజుని కలవాలనుకుంటారు కానీ విజు రాదు. ఆ ఘటనతో వీరిద్దరి మధ్య దూరం పెరిగి విజు తన లక్ష్యం చేరుకోలేకపోతున్నాను అని బ్రేకప్ చెప్తుంది. బ్రేకప్ చెప్పిన తర్వాత సత్య లైఫ్ ఎలా మారింది? విజు ఐఏఎస్ అయిందా? సత్య విజు వెళ్లిపోయిన బాధలో ఏం చేసాడు? సత్య తన తల్లి కోసం నిలబడతాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Allu Arjun : పెద్ది మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. నా సోద‌రుడిని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా..

సినిమా విశ్లేషణ..

తమిళ్ లో థియేటర్స్ లో రిలీజయినప్పుడు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. ఇందులో సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా సత్య – విజు పాత్రలు, పరిచయం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి అయితే నెలకొంటుంది. సెకండ్ హాఫ్ సత్య – విజు మధ్య మనస్పర్థలతో, వారు విడిపోవడం, సత్య బాధ, సత్య తల్లి ఆశయం కోసం నిలబడటం అంటూ సాగుతుంది.

ఈ సినిమా టైటిల్ 29 అంటే ఇందులో హీరో వయసు. 29 ఏళ్ళు వచ్చాక ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, లైఫ్ లో సెటిల్ అవ్వని అబ్బాయి జీవితం ఎలా ఉంటుంది, సమాజం వాళ్ళను ఎలా చూస్తుంది? అలాంటి సమయంలో ఓ అమ్మాయి తన లైఫ్ లోకి ప్రేమ అంటూ వచ్చి విడిపోతే ఎలా ఉంటుంది అని ఓ అబ్బాయి కోణంలో ఈ కథని చూపించారు. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా క్యూట్ గా, సహజంగా ఉంటాయి. చాలా మంది ప్రేమలో ఉన్న అమ్మాయిలు – అబ్బాయిల మధ్య వచ్చే మనస్పర్థలు, వారి ఆలోచలలు ఇలానే ఉంటాయి అన్నట్టు చూపించారు. అయితే ఎక్కువగా హీరో మైండ్ వాయిస్ తో డైలాగ్స్ తోనే కథ నడవడం కాస్త స్లో నేరేషన్ అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా క్యూట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ హీరో తల్లి ఆశయం కోసం నిలబడటం, అది తన గుర్తింపుగా మారడం, ప్రేమ కథలో ఇలాంటి అంశాన్ని జోడించే సీన్స్ బాగుంటాయి. అయితే క్లైమాక్స్ మళ్ళీ వీళ్ళు కలుస్తారా – లేక దూరంగానే ఉంటారా అనేది క్లారిటీ ఇవ్వకుండానే ఒక సీన్ తో ప్రేక్షకులే ఊహించుకోండి అని వదిలేయడం సరైన ముగింపు అనిపించదు. 29 – 30 ఏళ్ళ అబ్బాయిలు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. సినిమా చూడాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

తమిళ నటుడు విధు చాలా బాగా మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో, సెకండ్ హాఫ్ లో తన నటనతో అదరగొట్టాడు అని చెప్పొచ్చు. ప్రీతి అస్రాని కూడా చాలా బాగా నటించింది. హీరో తల్లి పాత్రలో ఆదిరా పాండిలక్ష్మి మెప్పిస్తుంది. మాస్టర్ మహేంద్రన్ నెగిటివ్ షేడ్స్ లో బాగానే నటించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్విస్తాడు. ప్రేమ్ కుమార్, షెహనాజ్ ఫాతిమా, సింధు శ్యామ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also See : Patas Praveen : పెళ్లి తర్వాత భార్యతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కమెడియన్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ లో ఓపెనింగ్ లో కొన్ని సీన్స్, అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. ఒక లవ్ స్టోరీని అబ్బాయి కోణంలో చూపిస్తూ సింపుల్ స్క్రీన్ ప్లేతో చెరువులు కాపాడుకోవాలి అనే ఓ మెసేజ్ తో చక్కగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని చోట్ల తెలుగు డబ్బింగ్ సరిగ్గా కుదర్లేదు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ’29’ సినిమా ఒక మెసేజ్ తో కూడిన మంచి ప్రేమకథ. ముఖ్యంగా అబ్బాయిలు ఈ సినిమాను చూస్తే కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.