Site icon 10TV Telugu

25 ఏళ్ల బాలయ్య ‘బొబ్బిలి సింహం’

25 years for Nandamuri Balakrishna, and Kodandaramireddy's Biggest Blockbuster Bobbili Simham

యువరత్న నందమూరి బాలకృష్ణ, మీనా, రోజా ప్రధాన పాత్రధారులుగా, ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘బొబ్బిలి సింహం’.. 2019 సెప్టెంబర్ 23 నాటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంటుంది..

యువరత్న నందమూరి బాలకృష్ణ, మీనా, రోజా ప్రధాన పాత్రధారులుగా, ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై టి.త్రివిక్రమ్ రావు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బొబ్బిలి సింహం’.. 1994 సెప్టెంబర్ 23న విడుదలైన ‘బొబ్బిలి సింహం’ 2019 సెప్టెంబర్ 23 నాటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. విజయ రాఘవ భూపతిగా బాలయ్య నటనకు ప్రేక్షకులు, అభిమానులు నీరాజనాలు పట్టారు. పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య పలికిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి.

ముఖ్యంగా కలెక్టర్‌తో పల్లెటూళ్ల గొప్పదనం గురించి చెప్తూ.. ఇంగ్లీష్, తమిళ్‌లో చెప్పే డైలాగ్స్, ముఖ్యమంత్రితో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టించాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు.

చక్కటి ఫ్యామిలీ డ్రామాకి మంచి ఎమోషన్స్, సెంటిమెంట్స్ జోడించి కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ‘బొబ్బిలి సింహం’ బాలయ్య కెరీర్‌లో ఓ మెమరబుల్ మూవీగా గుర్తుండిపోయింది. ఎమ్.ఎమ్.కీరవాణి కంపోజ్ చేసిన పాటలన్నీ సూపర్ హిట్టే.. ‘పాలకొల్లు పాప’, ‘మాయదారి పిల్లడా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఈడు ఈల వేసినా’, ‘లకడీకపూలట’, ‘కిట్టమ్మలీల’, వంటి పాటలన్నీ ఆకట్టుకోవడమే కాక ఎవర్‌గ్రీన్ సాంగ్స్‌గా మిగిలిపోయాయి.

‘బొబ్బిలి సింహం’ 100 రోజుల ఫంక్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ ‘అమితాబ్ బచ్చన్’ ముఖ్య అతిథిగా విచ్చేసి మూవీ టీమ్‌ను అభినందించారు. శారద, శరత్ బాబు, కైకాల, జగ్గయ్య, తనికెళ్ల భరణి, కోట, మోహన్ రాజ్, బ్రహ్మానందం, రాళ్లపల్లి, చలపతి రావు తదితరులు నటించిన ‘బొబ్బిలి సింహం’ చిత్రానికి కథ : వి.విజయేంద్ర ప్రసాద్, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : ఎ.విన్సెంట్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఎ.కోదండరామిరెడ్డి.

 

Exit mobile version