తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్ : 30 ఏళ్ల ‘శివ’

నాగార్జున, అమల జంటగా నటించగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయిన ‘శివ’ 2019 అక్టోబర్ 5 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

  • Publish Date - October 5, 2019 / 01:12 PM IST

నాగార్జున, అమల జంటగా నటించగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయిన ‘శివ’ 2019 అక్టోబర్ 5 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

1989 అక్టోబర్ 5.. తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కిన రోజు.. ఇండియన్ సినిమాకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’ సినిమా విడుదలైన రోజు.. నటుడిగా అక్కినేని నాగార్జున స్టామినా చూపించిన సినిమా.. రామ్ గోపాల్ వర్మ అనే టాలెంటెడ్ డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన సినిమా.. 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయిన ‘శివ’ 2019 అక్టోబర్ 5 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

నాగార్జున, అమల జంటగా.. వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అన్నపూర్ణ స్టూడియోస్, యస్.యస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై.. వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘శివ’ రిలీజ్ నాడు మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు, సినీ వర్గాల వారు షాక్ అయ్యారు. తెలుగు తెరపై ఇంతకుముందెన్నడూ చూడని ఓ సరికొత్త.. డేరింగ్ అండ్ డాషింగ్ అటెంప్ట్ ‘శివ’.. నాగార్జున సైకిల్ చైన్ లాగి హీరోయిజానికి ట్రెండ్ సెట్ చేశాడు.. దర్శకత్వంలో ఇదో కొత్త శైలి.. ఎవరీ రామ్ గోపాల్ వర్మ.. అంటూ ఆరా తియ్యడం మొదలెట్టారు. బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్.. థియేటర్లు పెరిగాయి.. ఏ సినిమా కూడా దరిదాపులకు చేరుకోలేని బాక్సాఫీస్ రికార్డులు ‘శివ’ సొంతమయ్యాయి.

శివగా నాగ్, ఆశాగా అమల పెయిర్ సూపర్ హిట్.. భవానిగా రఘువరన్‌ని తప్ప మరొకరిని ఊహించలేం.. జే.డి.గా జే.డి. చక్రవర్తి, నానాజీగా తనికెళ్ల భరణి, శరత్‌గా మురళీ మోహన్, మాచిరాజుగా కోట, విశ్వనాథంగా గొల్లపూడి, శివ ఫ్రెండ్స్‌గా శుభలేఖ సుధాకర్, రామ్ జగన్, యాదగిరిగా ఉత్తేజ్ ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారు. నేచురల్ యాక్టింగ్ కనబడుతుంది ‘శివ’ లో. తనికెళ్ల భరణి మాటలు, ఇళయరాజా కంపోజ్ చేసిన వినసొంపైన, ఎవర్ గ్రీన్ పాటలు, యస్.గోపాల్ రెడ్డి కెమెరా వర్క్, సత్తిబాబు ఎడిటింగ్.. ‘శివ’కు ప్లస్ అయ్యాయి.

కాలేజీ నేపథ్యంలో జరిగే గొడవలని కథగా తీసుకోవడం, ఫస్ట్ సినిమా అయినా.. తెలుగు సినిమా ఇలానే ఉండాలి అనే కంచెను తెంచుకుని తనకంటూ సొంతగా ఓ దారి ఏర్పరచుకునే సాహసం చెయ్యడం, కథా, కథనాల దగ్గరి నుండి, ఫ్రేమ్స్ వరకూ.. టెక్నీషియన్స్ దగ్గరి నుండి అవుట్ పుట్ రాబట్టుకోవడం ఒక్క వర్మకే సాధ్యమయింది. తెలుగు సినిమా ‘శివ’ కు ముందు ‘శివ’ కు తర్వాత అనేట్టుగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ‘శివ’ మూవీ. టైటిల్ లేకుండా 100 రోజుల పోస్టర్ పడిన సినిమా ‘శివ’ నే. 30 సంవత్సరాలే కాదు.. ఎన్నేళ్లైనా ‘శివ’ ఇంపాక్ట్ ఇంచు కూడా తగ్గదు అన్నది వాస్తవం. అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ లేనిదే ‘శివ’ సినిమా లేదు. ‘శివ’ లేనిదే తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అనే మాట కూడా లేదు..